కొద్ది రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించిన అంశం ఒక కొత్త చర్చకు దారి తీస్తుంది. అభివృద్ది అంటే ఏమిటని ఆయన ప్రశ్నించారు. గ్రామాలలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, ఆ పక్కనే ఉన్న గ్రామ సచివాలయం, దాని వెంటనే విలేజీ క్లినిక్, మరో వైపు అదే గ్రామంలో ఉన్న ప్రభుత్వ బడులలో పూర్తి మార్పులు చేయడం, కార్పొరేట్ తరహాలో స్కూళ్లను తయారు చేయడం ..ఇదంతా అబివృద్ది కాదా అని ఆయన అడిగారు.
నిజమే. ఇవన్ని అభివృద్ది కిందకే వస్తాయి. కాని మన దేశంలో ముఖ్యంగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో కాని, ఆ తర్వాత విభజిత ఏపీలో కాని ఒక అంశం విస్తారంగా ప్రచారం అయింది. అదేమిటంటే ఒక భారీ భవనం నిర్మిస్తే అది అభివృద్ది అని, లేదా ఒక పరిశ్రమ ఏదైనా పెడితేనే అభివృద్ది అని ..ఇలా కొన్ని సూత్రాలు ప్రచారంలోకి వచ్చాయి. దానికి ప్రధాన కారణం గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాలు కొంతవరకు కావచ్చు.
ఆయన సుదీర్ఘకాలం సుమారు పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఏమి చేస్తే అదే అభివృద్దేమో అన్న భ్రమ కలిపించడానికి యత్నించారు. అందులోను అమరావతి రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మభ్య పెట్టే యత్నం చేశారు. అమరావతి ఉంటేనే యవతకు ఉద్యోగాలు లభిస్తాయేమో అన్న అభిప్రాయం విస్తారంగా వెళ్లేలా ప్రభావితం చేయడానికి యత్నించారు.
అంతదాకా ఎందుకు..ఈ మధ్యన జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సైతం అమరావతిని నాశనం చేయడం అంటే యువత భవితను నాశనం చేయడమేనని వ్యాఖ్యానించింది. మరి అదెలాగో చెప్పలేదు. అదే పార్టీ నాయకులు కొందరు అమరావతి పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నాడని విమర్శించేవారు. ఇక పరిశ్రమల గురించి చూస్తే ఒక పరిశ్రమ వస్తే మొత్తం అబివృద్ది జరిగిపోయినట్లు అనుకోవాలన్నది ఒక ధీరి.
నిజమే. పరిశ్రమలు రాకూడదని ఎవరూ అనరు. కాని విశాఖ నగరంలో ఏవేవో సదస్సులు పెట్టి దారిన పోయేవారందరితో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చూపించి, ఆ తర్వాత సంవత్సరాలలో అవన్ని పెట్టుబడులుగా మారిపోయినట్లు, పరిశ్రమలు వచ్చేసినట్లు నమ్మబలికించే యత్నం చేశారు. నలభై లక్షల కోట్ల పెట్టుబడులు, ఇరవై లక్షల ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టేవారు.
నిజంగానే అలా జరిగితే అంతకన్నా కావల్సి ఏమి ఉంటుంది.కాని ఒక్కసారి విశాఖలో కాని, ఇతర ప్రాంతాలలో కాని పరిశ్రమలు లేదా సంస్థలను పెడతామని ముందుకు వచ్చినవారిలో కొందరు భూములు తీసుకున్నారే తప్ప, ఎలాంటి అభివృద్ది చూపలేదు. ఉదాహరణకు జగ్గయ్యపేట వద్ద ఒక సంస్థకు 400 ఎకరాలు కేటాయిస్తే,అక్కడ ఎలాంటి ప్రగతి లేదు.పైగా దానిని ఎలా రియల్ ఎస్టేట్ కిందకు మార్చాలా అన్న ఆలోచన చేశారన్న విమర్శ వచ్చింది.
విశాఖలో లూలూ కంపెనీకి అత్యంత విలువైన పదమూడు ఎకరాలు ఇస్తే, అక్కడ సుయి,సయి లేదు. అమరావతి ప్రాంతంలో ఒక భారీ ఆస్పత్రితో పాటు, పలు పరిశ్రమలు స్థాపించుతామని ప్రతిపాదించిన బి.ఆర్.షెట్టి అనే పారిశ్రామికవేత్త ఎంత వివాదాస్పదుడు, ఏ రకంగా ఆర్దిక నేరాల కేసులో ఇరుక్కుంది అన్నదానిపై పలువార్తలు వచ్చాయి. అలా అని చెప్పి అసలు ఏమీ రాలేదని అనజాలం.
ఉదాహరణకు అనంతపురం జిల్లాలో కియా కార్ల కర్మాగారం వచ్చింది. కాని అందుకు ఏపీ ప్రభుత్వం రాయితీల రూపంలో భారీ మూల్యాన్నే చెల్లించవలసి వచ్చింది. అయినా పర్వాలేదు. ఆ సంస్థ ద్వారా వేలాదిమందికి ఉపాధి కలిగితే మంచిదే. కాని ఆ సంస్థలో వచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఏపీ ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు ఎన్ని అన్నవి ఆలోచిస్తే కొంత ఆశ్చర్యం కలుగుతుంది. పైగా ఆ కంపెనీకి కేటాయించిన భూమి చుట్టుపక్కల టిడిపి నేతలు ఎలా రియల్ ఎస్టేట్ చేసి కోట్ల వ్యాపారాలు చేసింది అన్నదానిపై కధలు, కధలు చెబుతారు.
ఇక పవర్ ప్రాజెక్టులు, సోలార్ ప్లాంట్ల వంటివాటికి పాతికేళ్ల ఒప్పందం అధికధరలకు చేసుకోవలసి రావడం రాష్ట్రానికి పెద్ద శాపంగా పరిణమించిందన్న భావన ఉంది. చంద్రబాబు టైమ్ లో పరిశ్రమలు వచ్చింది తక్కువ. ఊదర కొట్టింది ఎక్కువ అనడం లో సందేహం అవసరం లేదు. అంతేకాదు. ఈ పరిశ్రమలను కొందరు కేవలం బ్యాంకు రుణాల కోసం పెట్టి, ఆ తర్వాత వాటిని సరిగా నడపకుండా కోట్లకు,కోట్ల రూపాయలను ఎగవేస్తున్న వైనం చూస్తున్నాం.
వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసిన వ్యాపారులే కాదు. రాజకీయ నేతలు కూడా ఉన్నారు. ఉదాహరణకు టిడిపి నుంచి బిజెపిలో మారిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి గ్రూపు వారు అనేక బోగస్ కంపెనీలను స్థాపించి ,తద్వారా సుమారు 5500 కోట్ల రూపాయల మేర బ్యాంకులను డూప్ చేశారని సిబిఐ హైకోర్టుకు నివేదించింది. మరి ఇదంతా అభివృద్ది అందామా? లేక కొంతమంది మాయాజాలం అందామా? ఇలాంటి అభివృద్ది కావాలా? లేక వాస్తవిక ప్రాతిపదికన జరిగే అభివృద్ది కావాలా? నిజమైన పరిశ్రమలు వస్తే స్వాగతించవలసిందే.
అందుకు ప్రభుత్వాలు కృషి చేయవలసిందే.వారికి అవసరమైన రాయితీలు,సబ్సిడీలు ఇవ్వవలసిందే.దానిని తప్పు పట్టడం లేదు. కాని పరిశ్రమలు వస్తేనే అంతా అభివృద్ది అయిపోతే ముంబై నగరంలో పేదరికం ఉండకూడదు. అక్కడ అనేక పరిశ్రమలు ఉన్నాయి. కాని వాటి చెంతే ధారవి అని ఆసియాలోనే అతి పెద్ద మురికి వాడ కూడా ఉంది.దానిని ఎలా చూడాలి? అయితే పరిశ్రమలు వస్తే కొంత ఉపాధి పెరిగి, ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడుతుంది. కాని అదే పరిశ్రమ మూతపడితే ఆ సంస్థ స్థాయిని బట్టి వందలు లేదా,వేలాది మంది రోడ్డున పడుతున్నారు.
ఇది భారత్ లో నిత్యం కళ్లచూస్తున్నదే. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ లేవనెత్తిన అంశాన్ని గమనంలోకి తీసుకుంటే పల్లెలు భారతదేశానికి పట్టుకొమ్మలు అన్నది మరిచిపోకూడదు. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల కోసం వేలాది భవనాలు నిర్మించారు. అలాగే గ్రామ సచివాలయాల కోసం కొన్ని వేల భవనాలు వెలిశాయి.
నాడు-నేడు కింద స్కూళ్లను మార్చడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ మధ్య ఒక పారిశ్రామికవేత్త రాజంపేట వద్ద ఉన్న తన సొంత గ్రామానికి వెళ్లారట. అక్కడ ఆయన పిల్లల సదుపాయార్ధం ఒక స్కూలు కూడా నడుపుతున్నారు. ఆయన అదే గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్కూలును ఇటీవలికాలంలో మార్చిన తీరు చూసి ఆశ్చర్యపోయి, తమ కు స్కూలుకు ధీటుగా అది తయారైందని వ్యాఖ్యానించారు.
ఇవన్ని చేయడానికి ఆలోచన కావాలి. వీటిని అమలు చేసే క్రమంలో వేలాది మందికి ఉపాది కలుగుతోంది. ఇటీవలికాలంలో జగనన్న కాలనీల పేరుతో కొత్త ఊళ్లను వేల సంఖ్యలో తయారు చేస్తున్నారు. వాటి నిర్మాణానికి అవసరమైన లక్షల టన్నుల సిమెంట్, ఇనుము, తదితర గృహనిర్మాణ సామాగ్రికి సహజంగానే డిమాండ్ వస్తుంది. ఇదంతా ఆర్దిక వ్యవస్థలో భాగమే అవుతుంది.
ఒక్కో పేదవాడికి ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఆస్తిని సమకూర్చిన ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం నిలిచిపోతుంది. అయితే ఇవన్ని సక్రమంగా జరగాలి. సద్వినియోగం అవ్వాలి. అప్పుడే సార్దకం అవుతాయని వేరే చెప్పనవసరం లేదు. ప్రస్తుతానికి ఈ దిశలోనే పనులు సాగుతున్నాయి. గ్రామ,వార్డు సచివాలయాలలో స్థానికులపైన పిల్లలు పది నుంచి పదిహేను మందికి ఉపాది లబిస్తోంది. వీరు కాకుండా వలంటీర్ల రూపంలో కొన్ని లక్షల మందికి ఎంతో కొంత ఊతం లభిస్తోంది. మరి దీనిని ఉపాధి కల్పన అనకూడదా? మరోమాట.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక్క అమరావతి ప్రాంతంలోనే భారీ నిర్మాణాలు చేపట్టాలని తలపెట్టింది. దానికి ముందు అదంతా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చారన్నది బహిరంగ రహస్యమే. దానిపై విచారణలు సాగుతున్నాయి. చివరికి టిడిపి నేతలు వాటిపై స్టేలు తెచ్చి అవి ముందుకు సాగకుండా తంటాలు పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మరి ఒకే చోట వేల కోట్లు ఖర్చు పెట్టడం అభివృద్ది అవుతుందా?లేక రాష్ట్రం అంతటా ఆ డబ్బును వికేంద్రీకరించి నిర్మాణాలు చేపట్టడం అభివృద్ది అవుతుందా? అన్నది అంతా ఆలోచించాలి. అంతేకాదు.
పేదలకు పలు సంక్షేమ పధకాలను ఇవ్వడంపై కూడా కొన్ని వర్గాలలో విమర్శలు ఉన్నాయి. విశేషం ఏమిటంటే అవే వర్గాలు చంద్రబాబు టైమ్ లో పసుపు-కుంకుమనో, అన్నదాత సుఖీభవ అనో, రుణమాఫీ అనో రకరకాల రూపాలలో వేల కోట్ల రూపాయలను ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఖర్చు పెడితే ఆహో,ఓహో అని పొగిడాయి. కరోనా సంక్షోభంలో జగన్ ప్రభుత్వం పేదలకు వివిధ స్కీముల కింద ఆర్దిక సాయం చేయడం ఎంతో ఉపయోగపడిందన్నది వాస్తవాన్ని విసర్మించి ఇవే వర్గాలు డబ్బు పంచుడేనా? అభివృద్ది ఏమైనా జరుగుతుందా అని ప్రచారం చేస్తున్నాయి. ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి.
కచ్చితంగా జగన్ చెబుతున్నట్లు గ్రామాలలో సాగుతున్నది అభివృద్ది కిందే వస్తుంది. అదే సమయంలో ఇతరత్రా అభివృద్దిని విస్మరిస్తున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి వీలుగా కొత్త వ్యూహం అమలు చేసి, రాష్ట్రం అంతటికి కనిపించేలా కొన్ని ప్రాజెక్టులు, భవనాలు, రోడ్ల నిర్మాణం వంటివి చేపట్టడం కూడా అవసరమే అనిపిస్తుంది. ఈ ప్రతిపాదనలు ఇటీవలికాలంలో రూపుదిద్దుకుంటున్నాయి. వాటిని జాగ్రత్తగా అమలు చేయాలి. అలాగే పరిశ్రమలు ప్రచారం కోసం కాకుండా నిజంగా పనిచేసే వాటిని స్థాపింప చేయగలగాలి.
పోర్టులు తదితర రంగాలలో అభివృద్దికి, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినా,అవి పూర్తి కావడానికి కొంత వ్యవధి పట్టవచ్చు. అయినా ప్రభుత్వం సమతుల్యంగా ముందుకు వెళుతోందన్న అభిప్రాయం కలిగించకపోతే, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలలో ప్రత్యర్ధులు అసలు అభివృద్ది జరగడం లేదన్న అబద్దపు ప్రచారం చేసి వారిని నమ్మించడానికి యత్నిస్తాయి.
అమరావతిలో లక్షల కోట్లను ప్రభుత్వం వ్యయం చేయాల్సి ఉందన్న విషయం చెప్పకుండా, లక్షల కోట్ల సంపద వచ్చేసినట్లు పిక్చర్ యత్నం చేస్తుంటారు. వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు పబ్లిసిటీ ఇస్తుంటారు. వీటన్నిటికి చెక్ పెట్టే విధంగా అమరావతి ప్రాంతంలో కొన్ని హబ్ ల ఏర్పాటుకు చొరవ తీసుకోవాలి. అలాగే రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలలో ప్రభుత్వం ప్రతిపాదించిన వివిధ రంగాల ప్రాజెక్టులు అమలులోకి తీసుకు రాగలిగితే జగన్ ప్రభుత్వానికి తిరుగు ఉండదు.
కాని ఇందుకు ఆర్ధిక వనరులు కూడా పెద్ద ఎత్తున అవసరం అవుతాయి. వాటిని ఎలా సమకూర్చుకోవాలన్న దానిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం. సంక్షేమ రంగంతో పాటు గ్రామాలలో సాగుతున్న అభివృద్దిని ఎవరూ కాదనజాలరు. ప్రజలకు వాటిని వివరించి, తాము చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి ప్రజలలోకి తీసుకు వెళ్లి అభివృద్ది అంటే ఇది ..శెహభాష్ అనిపించుకోవాలి. అప్పుడు జగన్ ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం గా గుర్తింపు పొందుతుంది.
కొమ్మినేని శ్రీనివాసరావు