ఒంట‌రైన జ‌గ‌న్ ఇష్ట ఎమ్మెల్యే!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్ అంటే ఎంతో అభిమానం. మొద‌టి నుంచి జ‌గ‌న్ వెంట అనిల్ న‌డుస్తున్నారు. దీంతో అనిల్‌పై జ‌గ‌న్ ఎంతో ఇష్టాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తున్నారు. 2014, 2019…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్ అంటే ఎంతో అభిమానం. మొద‌టి నుంచి జ‌గ‌న్ వెంట అనిల్ న‌డుస్తున్నారు. దీంతో అనిల్‌పై జ‌గ‌న్ ఎంతో ఇష్టాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తున్నారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో నెల్లూరు న‌గ‌రం నుంచి అనిల్ వ‌రుస‌గా వైసీపీ త‌ర‌పున గెలుపొందారు. నెల్లూరులో రెడ్ల సామాజిక వ‌ర్గ ఆధిప‌త్యం వుంటుంది. అయిన‌ప్ప‌టికీ అనిల్‌ను జ‌గ‌న్ ఆద‌రిస్తున్నారు.

వైసీపీ ప్ర‌భుత్వం రాగానే అనిల్‌కు మొద‌టి విడ‌త‌లోనే మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. కీల‌క‌మైన జ‌ల‌వ‌న‌రుల‌శాఖ‌ను క‌ట్ట‌బెట్టారు. ఆ త‌ర్వాత మంత్రివ‌ర్గ మార్పుల్లో అనిల్‌ను ప‌క్క‌న పెట్టారు. ఇదే సంద‌ర్భంలో నెల్లూరు న‌గ‌ర స‌మీపంలోని స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. కాకాణి, అనిల్ మ‌ధ్య విభేదాలున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. కాకాణిపై అనిల్ ప‌రోక్ష విమ‌ర్శ‌లు కూడా చేశారు.

అనిల్‌కు మంత్రి ప‌ద‌వి పోయిన‌ప్ప‌టి నుంచి సొంత నియోజ‌క‌వ‌ర్గంలో అసంతృప్తి ఒక్క‌సారిగా బ‌య‌ట‌ప‌డింది. అనిల్‌కు వ‌రుస‌కు చిన్నాన్న, నెల్లూరు న‌గ‌ర డిప్యూటీ మేయ‌ర్ రూప్‌కుమార్ యాద‌వ్ ఎదురు తిరిగారు. అనిల్‌ను విభేదించిన రూప్‌కుమార్ యాద‌వ్‌… న‌గ‌రంలో సొంతంగా జ‌గ‌న‌న్న భ‌వ‌న్ పేరుతో ప్ర‌త్యేకంగా వైసీపీ కార్యాల‌యాన్ని ప్రారంభించారు. రాజ‌న్న భ‌వ‌న్ పేరుతో ఇప్ప‌టికే అక్క‌డ అనిల్ నేతృత్వంలో వైసీపీ కార్యాల‌యం వుంది. అయిన‌ప్ప‌టికీ రూప్ సొంత కుంప‌టి పెట్టుకున్నారు.

మ‌రోవైపు నెల్లూరులో కార్పొరేట‌ర్లు అనిల్, రూప్‌కుమార్ వ‌ర్గాలుగా విడిపోయారు. త‌న‌ను అంత‌మొందించే వ‌ర‌కూ అనిల్ వెళ్లాడ‌ని స‌న్నిహితుల వ‌ద్ద రూప్‌కుమార్ యాద‌వ్ వాపోతున్నారు. తాను లేక‌పోతే అనిల్‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండేదా? అని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోవైపు నెల్లూరు జిల్లా వైసీపీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు వేమిరెడ్డి ప్రభాక‌ర్‌రెడ్డి కూడా అనిల్ వైఖ‌రిపై గుర్రుగా ఉన్నారు.

రానున్న ఎన్నిక‌ల్లో అనిల్ త‌ప్ప‌, మిగిలిన ఎవ‌రికైనా మ‌ద్ద‌తు ఇస్తాన‌ని ఆయ‌న అంటున్నార‌ని తెలిసింది. త‌న‌కు న‌ష్టం క‌లిగించేలా మంత్రిగా అనిల్ కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రించార‌నే ఆగ్ర‌హం వేమిరెడ్డిలో వుంది. నెల్లూరు న‌గ‌రం టికెట్‌ను త‌న భార్య ప్ర‌శాంతిరెడ్డికి ఇప్పించుకోవాల‌ని వేమిరెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నార‌నే కోపం అనిల్‌లో వుంది. నెల్లూరు జిల్లాలో అంద‌రూ వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న‌ప్ప‌టికీ, ఎవ‌రితోనూ అనిల్‌కు స‌ఖ్య‌త లేద‌ని స‌మాచారం.

చివ‌రికి నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డితో కూడా అనిల్‌కు మంచి సంబంధాలు లేవ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అండ చూసుకుని సొంత పార్టీ నేత‌ల‌ను కూడా లెక్క చేయ‌లేద‌ని, మంత్రి ప‌ద‌వి పోగానే వెంట న‌డిచే వాళ్లెవ‌రో ఆయ‌న‌కు తెలిసొస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రెండు రోజుల క్రితం అనిల్ మీడియాతో మాట్లాడుతూ సొంత పార్టీలోనే వెన్నుపోటుదారులున్నార‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. 

స‌మ‌యం వ‌చ్చిన‌పుడు వారి భ‌ర‌తం ప‌డ‌తాన‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఏది ఏమైనా అనిల్‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కంటే సొంత పార్టీ నేత‌ల‌తో పోరాటం చేయాల్సి వ‌చ్చింది. అదే ఇప్పుడు నెల్లూరులో హాట్ టాపిక్‌గా మారింది.