వైసీపీ సోషల్ మీడియా ఎట్టకేలకు మేల్కొంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సోషల్ మీడియా వేదికగా అధికార పక్షంపై ఓ రేంజ్లో విరుచుకుపడుతోంది. అధికారంలోకి రాకముందు వైసీపీ సోషల్ మీడియా శక్తిమంతంగా పని చేసింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా అవసరం లేదన్నట్టు వైసీపీ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వైసీపీ కోసం సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా ఎంతో మంది పని చేశారు.
వైసీపీకి అధికారం వచ్చిన తర్వాత అలాంటి వాళ్లను పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్య నాయకుల వద్ద ఉన్న ఒకరిద్దరికి పదవులు దక్కడం తప్ప, సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఒరిగిందేమీ లేదనే విమర్శ బలంగా ఉంది. 2024 ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా ప్రాధాన్యాన్ని వైసీపీ గుర్తించింది. ఇప్పటికే నలుగురు సోషల్ మీడియా రీజనల్ కోఆర్డినేటర్లను వైసీపీ నియమించింది.
తాజాగా ప్రతి జిల్లాకు ఒక కన్వీనర్, అలాగే నలుగురు కో -కన్వీనర్లను వైసీపీ నియమించింది. వీరి నియామకాలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. వీరితో ఈ నెల 29,30 తేదీల్లో విజయవాడలో వర్క్‌షాప్ నిర్వహణకు వైసీపీ నిర్ణయించింది. సమావేశంలో వీరికి వైసీపీ అనుబంధ విభాగాల ఇన్చార్జ్ విజయసాయిరెడ్డి నేతృత్వంలో దిశానిర్దేశం చేయనున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై విజయసాయిరెడ్డి ఏ రకంగా దాడి చేస్తారో అందరికీ తెలుసు.
అలాంటి నాయకుడి నేతృత్వంలో కొత్తగా నియమితులైన కన్వీనర్లు, కో-కన్వీనర్లు ప్రతిపక్ష పార్టీలపై యుద్ధానికి సన్నద్ధం చేసే క్రమంలో వర్క్‌షాప్ నిర్వహించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని దీటుగా ఎలా తిప్పికొట్టాలి, అలాగే ప్రత్యర్థులపై సెటైర్స్ ఎలా విసరాలి తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
రానున్న ఎన్నికల్లో వీరోచిత పోరాటానికి సోషల్ మీడియా సైనికులను తయారు చేయడానికి ఇది ఎంత వరకూ ఉపయోగపడుతుందో చూడాలి.