ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ విమర్శలలో అనేక సందర్భాలలో హద్దు మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఆయన చెప్పే మాటలు.. తెలుగుదేశం పార్టీ అభిమానులకు వినసొంపుగా ఉంటాయి. వేలం వెర్రిగా ఆయన విమర్శలను వింటూ ఉంటారు. ఎందుకంటే అంత నీచంగా మాట్లాడ్డం అందరికీ రాదు కాబట్టి.. ఆయన తిట్లను చూసుకుని వాళ్లు ఆనందిస్తుంటారు.
నిజం చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాల మీద ఎవరో ఒక తెలుగుదేశం నాయకుడు నిర్దిష్టంగా, నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తే కూడా ప్రజలు అంతగా ఆదరించరు. అదే సదరు వ్యక్తి చేసే విమర్శలను ఎగబడి చూస్తారు.
ఎందుకంటే ఆయన విమర్శలు మాటల్లాగా ఉండవు తిట్లు లాగా ఉంటాయి. పచ్చి బూతులతో అసభ్యకరమైన మాటలతో లేకి బజారు మనుషులు మాట్లాడుకునే తీరులో… అంతకంటే నీచంగా మాట్లాడుతూ ఉంటారు. ఎగబడి చూసే వాళ్ళు ఉన్నారు కనుక ఆయన మరింత రెచ్చిపోయి చెత్త వాగుడు వాగుతూ ఆ చెత్తనంతా యూట్యూబ్ ఛానల్ గా ఒక రూపం కల్పిస్తూ దానిని క్యాష్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తుంటారు.
ఆయన పేరు బొబ్బూరి వెంగళరావు. ఆయన పచ్చి తెలుగుదేశం కార్యకర్త. తన తెలుగుదేశం రంగుకు ఆయన ఏమీ ముసుగులు తొడుక్కోరు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో ఉంటారు, ఊరేగుతారు.
ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త తమ ప్రత్యర్థి పార్టీ మీద ఆ నాయకుల మీద చవక బారు విమర్శలు చేసినా తప్పేమీ లేదు. నీచమైన మాటలతో చెలరేగి పోతే కూడా అలాంటివి చాలా జరుగుతుంటాయని సరిపెట్టుకోవచ్చు. కానీ ఈ చెత్తనంతా యూట్యూబ్ లో పెడుతూ.. దానికి ‘ఘర్షణ మీడియా’ అని ఒక పేరు పెట్టి.. జర్నలిస్టు హోదాను కూడా సంపాదించుకోవాలని, జర్నలిస్టు విమర్శల లాగా ఈ రాజకీయ విమర్శలకు ఒక ముద్ర వేయాలని ప్రయత్నించడం మాత్రమే తప్పు.
ఇలాంటి బొబ్బూరి వెంగళరావును అరెస్టు చేస్తే పచ్చ మీడియా మొత్తం గగ్గోలెత్తిపోతోంది. ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా అభివర్ణిస్తోంది. ఈ పచ్చ మీడియాకు సిగ్గుగా అనిపిస్తోందో లేదో తెలియదు గాని.. ఈ అరెస్టును జర్నలిజం మీద జరిగిన దాడిగా కూడా పేర్కొంటోంది. ఒక చవక బారు విమర్శలు చేసే వ్యక్తి మీద పోలీసులు చర్య తీసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి సత్య సంధత గురించి ఈ పచ్చ మీడియా పత్రికలు చానళ్లు ఎందుకు అంత గొంతు చించుకుంటున్నాయో ప్రజలకు మాత్రం అర్థం కావడం లేదు.
ఇలాంటి చెత్త ప్రయత్నాల ద్వారా తమ కుండే వేల్యూను కూడా ఆ మీడియా సంస్థలు పలుచన చేసుకుంటాయి. ఒక చెత్తను సమర్థించే వారందరూ కూడా చెత్తగాళ్లే అని ప్రజలు అనుకుంటే అందులో తప్పేముంది.