వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజ్ఞప్తిపై సీబీఐ కోర్టు జడ్జి తప్పు చేశారని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ ఘాటు వ్యాఖ్య చేశారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునకు అనుమతి నిరాకరిస్తూ 2019లో సీబీఐ కోర్టు ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. సీబీఐ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ తెలంగాణ హైకోర్టులో 11 పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ కేసును తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారించారు. ఇందులో భాగంగా తెలంగాణ హైకోర్టు సీబీఐ ఉత్తర్వులను కొట్టేసింది. దీంతో జగన్కు ఊరట లభించింది. కోర్టు విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ అభ్యర్థను పరిశీలించే ముందు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోకుండా సీబీఐ కోర్టు జడ్జి తప్పు చేశారన్నారు. క్రిమినల్ కేసుల విచారణను నిందితుడి సమక్షంలోనే జరగాలని, అందువల్ల జగన్ పిటిషన్ను అనుమతించలేమన్న అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సి వస్తోందని చీఫ్ జస్టిస్ సీరియస్ కామెంట్స్ చేశారు. నేరాలకు నిందితుడు పాల్పడ్డారని ఎలా చెబుతామని ప్రశ్నించారు.
రాష్ట్రానికి దూరంగా వుంటే పాలనకు ఇబ్బంది అవుతుందన్న జగన్ సీబీఐ కోర్టు జడ్జి దృష్టికి తీసుకెళ్లడాన్ని గుర్తు చేశారు. ఈ వాదన ఆధారంగా మినహాయింపు ఇవ్వలేమంటూ సీబీఐ కోర్టు జడ్జి చెప్పడాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పు పట్టారు. జగన్ ఆశించినట్టు వ్యక్తిగత హాజరు నుంచి తెలంగాణ హైకోర్టు మినహాయింపు ఇచ్చి భారీ ఊరట కలిగించింది.