సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 16 నెలల పాటు ఎన్వీ రమణ పని చేశారు. చీఫ్ జస్టిస్‌గా సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన ప్రస్థానం సుదీర్ఘమైందే. శుక్రవారం ఆయన పదవీ విరమణ చేశారు. 22 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు న్యాయ వ్యవస్థలో భాగస్వామి కావడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
పదవీ విరమణ తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న ఆయనపై ప్రశంసల జల్లు కురిసింది. ఎన్వీ రమణ తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో అందరి దృష్టిని ఆకర్షించిన ఆణిముత్యాల్లాంటి వాటి గురించి తెలుసుకుందాం.
“గత 16 నెలల్లో సుప్రీంకోర్టులో 11 మంది న్యాయమూర్తులను నియమించాం. వివిధ హైకోర్టులకు 255 మందిని సిఫార్సు చేశాం. వారిలో ఇప్పటికే 224 మంది నియమితులయ్యారు”
“న్యాయమూర్తిగా నా ప్రవర్తన, పనితీరు ద్వారా ఎప్పుడూ ప్రజల హృదయాల్లో వుండాలని కోరుకున్నాను తప్ప… తీర్పులు, ఉత్తర్వుల రూపంలో పుస్తకాల్లో కాదు”
“కేసుల పెండింగే న్యాయ వ్యవస్థ ముందున్న అతిపెద్ద ప్రధాన సవాల్. కేసుల లిస్టింగ్, పోస్టింగ్‌ల అంశంపై నేను తగినంత దృష్టి సారించలేకపోయాను. అందుకు సారీ చెబుతున్నా”
తీర్పులు, ఉత్తర్వుల రూపంలో పుస్తకాల్లో ఉండాలని కోరుకోలేదని ఆయన అన్నారు. న్యాయమూర్తిగా ప్రజల హృదయాల్లో ఉండాలని కోరుకున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా ఆయన సారీ చెప్పడం చర్చనీయాంశమైంది. కేసుల పెండింగే న్యాయ వ్యవస్థ ముందున్న అతిపెద్ద సవాల్‌గా ఆయన చెబుతూ, వాటిపై ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టలేకపోయి నందుకు క్షమాపణ చెప్పడం గమనార్హం. ఇంత కాలం ఎన్వీ రమణ వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు.