ఆర్ఆర్ఆర్: అనగనగా ఒక సిగ్గులేని సవాలు!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన ఎంపీ రఘురామకృష్ణరాజు మాటల దూకుడు ఎప్పటి లాగానే కొనసాగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి, వారి మీద బురద చల్లడానికి..…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన ఎంపీ రఘురామకృష్ణరాజు మాటల దూకుడు ఎప్పటి లాగానే కొనసాగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి, వారి మీద బురద చల్లడానికి.. రఘురామకృష్ణ రాజు తన జీవిత కాలాన్ని అంతా వెచ్చిస్తూ గడుపుతూ ఉంటారు. 

తనను ఎంపీని చేసిన పార్టీ గురించే పరువు తక్కువగా మాట్లాడుతూ, తన పనులను, మాటలను అడ్డగోలుగా సమర్ధించుకుంటూ బతుకుతుంటారు. తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పదని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రమే ప్రజా కంటకుడని అంటూ ప్రభుత్వానికి పార్టీకి మధ్య సాంకేతికంగా ఉండే విభజన రేఖను వాడుకుంటూ.. తన అతి తెలివితేటలకు తానే మురిసిపోతూ ఉంటారు. రఘురామ కృష్ణంరాజు తాజాగా ఒక సిగ్గులేని సవాలు విసిరారు.

తాను ఎంపీగా రాజీనామా చేసి మళ్లీ జరగబోయే ఉప ఎన్నికల్లో గెలిచినట్లయితే గనుక… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దుచేసి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి అంత ధైర్యం ఉందా అని ప్రశ్నిస్తున్నారు.

నిజానికి, ఎంపీగా గెలిచిన తొలి రోజుల నుంచి.. రామకృష్ణంరాజు జగన్ ప్రభుత్వంతో సున్నం పెట్టుకునే కొనసాగుతున్నారు. నానా చికాకులు సృష్టిస్తున్నారు. గతంలో సిఐడి ఆయనను అరెస్టు చేసినప్పటికీ తర్వాత  బెయిల్ పై విడుదలయ్యారు. ఆ తర్వాత ఇంకా అనేక న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నప్పటికీ ప్రభుత్వం మీద మాత్రం మాటల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు.

రఘురామ కృష్ణంరాజుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ స్పీకరుకు పలుమార్లు ఫిర్యాదు చేసింది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని, ఆయనను ఎంపీగా తొలగించాలని కూడా వైసిపి డిమాండ్ చేసింది. ఇవేవీ ఫలించలేదు. అదే సమయంలో.. జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకుని ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు కు సిగ్గుంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ వైసీపీ కార్యకర్తలు పదేపదే డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి డిమాండ్లకు తాజాగా రఘురామకృష్ణరాజు సమాధానం చెప్పారు. 

తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, తద్వారా వచ్చే ఉప ఎన్నికల్లో తాను తిరిగి నెగ్గితే… వైసీపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళతారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎంపీ సీటు కోసం… జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర మొత్తాన్ని పణంగా పెట్టాలి అనేది ఆయన ఆలోచన. అది ఎటు జరిగే పని కాదని ఆయనకు బాగా తెలుసు. తన గాలి సవాలును ఎవరూ పట్టించుకోరు అనేది కూడా ఆయనకు తెలుసు. 

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆయన మళ్లీ నెగ్గి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేసే పరిస్థితి తర్వాత… అసలు రాజీనామా అంటూ చేస్తే రాబోయే ఉపఎన్నికలలో ప్రచారానికి పోటీ చేయడానికి అయినా నియోజకవర్గంలో అడుగుపెట్టే దమ్ము ఆయనకు ఉందా అనేది ప్రజల సందేహం. తన నియోజకవర్గంలో ప్రధాని పాల్గొన్న కార్యక్రమం జరిగితేనే… తనను చంపడానికి మనుషులు ఫాలో అవుతున్నారంటూ ఒక డ్రామాను రక్తి కట్టించి… రైల్లో నాలుగు కిలోమీటర్ల ప్రయాణించి… వెంటనే పలాయనం చిత్తగించిన ధైర్యశీలి రఘురామకృష్ణరాజు. 

అసలు వైసీపీ ప్రభుత్వంతో సున్నం పెట్టుకున్న తర్వాత నియోజకవర్గంలో ఎంపీగా అడుగుపెట్టిన దాఖలాలు కూడా లేవు. ప్రజలు హేళనగా నవ్వుతారనే వెరపు కూడా లేకుండా ఆయన తన చేతగానితనానికి వైసిపిని నిందిస్తూ ఉంటారు. తాను నియోజకవర్గానికి వెళితే చంపేస్తారని అంటూ భయాన్ని ప్రకటిస్తుంటారు. ఇలాంటి ఒక అసమర్ధ నాయకుడు, నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తా మీ ప్రభుత్వాన్ని మొత్తం రద్దు చేస్తారా అని డిమాండ్ చేయడం చాలా చాలా కామెడీగా ఉంది అని అందరూ అనుకుంటున్నారు.