అమెరికాలో మనకెందుకండి ఆ గొడవలు?

“అనువుగాని చోట అధికులమనరాదు- కొంచెముండుటెల్ల కొదవు కాదు” అని వేమన సూక్తి.  Advertisement అమెరికా నానాజాతులు నివాసముండే దేశం. అక్కడ భారత జాతీయుల ప్రగతిపథం చాలామందికి అసూయ తెప్పిస్తోంది.  గతంలో ధనిక-పేద ఆర్థిక అసమానతలు…

“అనువుగాని చోట అధికులమనరాదు- కొంచెముండుటెల్ల కొదవు కాదు” అని వేమన సూక్తి. 

అమెరికా నానాజాతులు నివాసముండే దేశం. అక్కడ భారత జాతీయుల ప్రగతిపథం చాలామందికి అసూయ తెప్పిస్తోంది. 

గతంలో ధనిక-పేద ఆర్థిక అసమానతలు అమెరికాలో మరీ ప్రస్ఫుటంగా కనిపించేవి కావు. కానీ కాలక్రమంలో పరిస్థితి మారింది, మారుతోంది. 

ఎదుగుతున్నప్పుడే ఒదిగి ఉండాలని చెప్తుంటారు. 

తాజాగా డలాస్ లో ఒక మెక్సికో యువతి భారతీయురాలిపై రేసిజం దాడికి దిగింది. రక్తపాతం లేదు కానీ వాగ్వివాదం, షటప్ అని ఇరు పక్షాలు తిట్టుకోవడం, “గో బ్యాక్ టు ఇండియా” అని ఆమె అరవడం, బ్యాగులో చేయి పెట్టి ఆ మెక్సికన్ యువతి ఏదో తీయబోవడం, భారతీయ మహిళని చెంప మీద కొట్టడం వంటివి మొబైల్లో రికార్డు చేసి వైరల్ చేసారు మనవాళ్లు. 

రేసిజం వయొలెన్స్ చేసిన ఆమెను పోలీసు యంత్రాంగం అదుపులోకి తీసుకోవాలంటూ ట్వీట్స్ కూడా పెడుతున్నారు మనవాళ్లు. 

అయితే ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది. ముందుగా అసలిది కొత్తగా జరిగిన సంఘటన కాదు. ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. సాధారణంగా ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు తెలివైన వాళ్లైతే అస్సలు గొదవపడకుండా సారీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఎందుకంటే ఎదుటివాడి శక్తేంటో తెలుసుకోకుండా, వాడి దగ్గర ఏ ఆయుధముందో ఊహించకుండా మనవాళ్లు గొడవకి దిగడం కరెక్ట్ కాదు. 

మనదేశంలో రోడ్డు మీద ట్రాఫిక్కులో చిన్న డాష్ ఇస్తేనే ట్రాఫిక్ ని ఆపేసి ఎవడికి వాడు హీరోయిజం చాటుకునే క్రమంలో గొడవలకి దిగుతుంటారు. వెహికల్ డ్యామేజ్ కంటే ఇగో డ్యామేజ్ ఎక్కువగా చేసేసుకుని యుద్ధాలకి దిగుతారు, బూతులు తిట్టుకుంటారు. 

కానీ డాలర్లు సంపాదించే అవకాశం కోసం అమెరికాలో స్థిరపడి పని చేసుకుంటున్నప్పుడు అక్కడి జనం మధ్య ఎంత లో ప్రొఫైల్లో బతికిదే అంత మంచిది. గన్ కల్చర్ ఉన్న దేశంలో అనవసరపు హీరోయిజాలు చూపించక్కర్లేదు. అయినా అప్పుడప్పుడు జాతివైరంతో ఎక్కడో అక్కడ ఒక కాల్పుల సంఘటన జరగొచ్చు. అది అరుదు. కానీ ఎప్పుడైతే వాదనల్లోకి దిగుతామో భారతీయులపై అక్కడ మరింత ద్వేషభావం పెరిగే పరిస్థితి రావొచ్చు. అది దేనికైనా దారి తీయవచ్చు. 

ఈ మెక్సికన్ మహిళకి, భారతీయ మహిళకి సంబంధించిన వైరల్ వీడియో కారణంగా మనవాళ్లు భారతీయ మహిళకి, మెక్సికన్లు వాళ్ల మహిళకి వత్తాసు పలికి సొషల్ మీడియాలో పర్సనల్ గొడవలకి దిగొచ్చు. రెండు జాతుల మధ్య అనవసరమైన అగాధం ఏర్పడొచ్చు. 

అసలు భారతీయులపై అసూయకి, చిరాకుకి కొన్ని కారణాలున్నాయి. మనవాళ్లు ఏం చేసినా అతే. 

మరీ ముఖ్యంగా మన తెలుగువాళ్లు చేసే అతి అయితే వర్ణనాతీతం. సినిమా రిలీజులప్పుడు హీరో ఫ్యాన్సంటూ రోడ్ల మీద కార్లేసుకుని ర్యాలీలు చేయడం (అఖండ ఒక ఉదాహరణ),  చంద్రబాబో కేసీయారో జగనో వస్తే ఊరేగింపులు పెట్టడం, లోకల్ రాజకీయాల్లో కూడా చేతులు పెట్టి పవర్ సెంటర్స్ గా మారిపోవాలనుకునే ఆత్రం… ఎందుకు చిరాకు తెప్పించవు?

పక్క రాష్ట్రం నుంచి అందరికీ పరిచయమున్న ప్రకాష్ రాజ్ వచ్చి “మా” ఎన్నికల్లో పోటీకొస్తేనే తట్టుకోలేని జాతి మనది. లోకల్- నాన్ లోకల్ అంటూ గీతలు గీసుకుని బతికే మన జాతినైజానికి అమెరికాలో ఆ పనులు అవసరమా? 

తప్పేంటి అని అడగొచ్చు. అలాంటి కోరికలున్నప్పుడు అన్ని జాతుల జనాలతోటి మమేకమవ్వగలగాలి. మనవాళ్లంతా గ్రూపులుగా బతుకుతుంటారు తప్ప, ఆఫ్రో అమెరికన్స్ తోటి, మెక్సికన్స్ తోటి, తెల్లవాళ్లతోటి అంతలా మమేకం కారు. 

వరల్డ్ స్టాండర్డ్స్ ప్రకారం మనవాళ్లు కమ్యూనికేషన్లోనూ, సోషల్ స్కిల్స్ లోనూ చాలా వీక్. కమ్యూనికేషన్ మరియు సోషల్ స్కిల్స్ కి పెద్దగా ప్రాధాన్యం లేని రంగాల్లోనే మనవాళ్లు రాణిస్తారు. 

ఇక “అమెరికా అబ్బాయితో ఇండియా అమ్మాయి పెళ్లి” లాంటి వార్త 1987 నాటి “పడమటి సంధ్యారాగం” టైమునుంచి ఇప్పటికీ మనవాళ్లకే విడ్డూరమే. కులాంతర వివాహాల్లాగ విదేశీయులతో మమేకమైపోయే గుణం భారతీయుల్లో ఇంకా ఆశించిన స్థాయిలో పెరగలేదు. అన్యజాతీయులకి మనవాళ్లు మానసికంగా దగ్గర కాకపోవడానికి ఇదొక కారణం. 

“భారతీయులు బాగా సంపాదిస్తున్నారు, మన సంపదని దోచుకుంటున్నారు, ఎక్కడికెళ్లినా వీళ్లే కనపడుతున్నారు, ఆల్మోస్ట్ కబ్జా చేసేస్తున్నారు, మనల్ని కలుపుకోరు, వాళ్లల్లో వాళ్లే ఎదుగుతుంటారు…” ఇదీ మనవాళ్లమీద అక్కడి వాళ్ల అభిప్రాయం. ఈ గ్యాప్ వల్ల అన్యజాతుల్లో మన వాళ్ల పట్ల ద్వేషభావం పెరుగుతోంది. 

రానున్న రోజుల్లో అమెరికాలో ధనిక-పేద తారతమ్యాలు మరింత పెరగబోతున్నాయి. ఫలితంగా రేసిజం కూడా పెరుగుతుంది. చట్టం కూడా పెద్దగా కంట్రోల్ చేయలేకపోవచ్చు. కొన్ని వింతలు కూడా చోటు చేసుకోవచ్చు. తాజాగా కాలిఫోర్నియాలో ఒక వింత “లా” వచ్చింది. 900 డాలర్ల వరకు షాప్లిఫ్టింగు చేసినా, మగ్గింగ్ చేసినా క్రైం కిందకు రాదట. దీనినిబట్టి అర్థం చేసుకోవల్సింది ఏంటంటే..క్యాపిటలిష్ట్ దేశమైన అమెరికాలో కూడా ఉన్నవాడు లేనివాడికి పెట్టడమే శాంతిమంత్రమని అనుకుంటోందనుకోవాలి. 

మనదేశంలోలాగ అమెరికాలో హక్కుల పోరాటాలు చేయకుండా తలవంచుకుని పని చేసుకుంటూ, గొడవల్లోకి తలపెట్టకుండా బతకాలి. అప్పుడే భారతీయులు నాన్-కాంట్రవెర్షియల్ రేస్ గా నిలబడతారు. శాంతియుతంగా బతుకుతారు. 

శ్రీనివాసమూర్తి