దొందూ దొందే: వీరావేశం వీర్రాజు-రెచ్చిపోయిన రేవంత్

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజుకి పదవి రాగానే ఎంత హడావిడి జరిగిందో అందరికీ తెలిసిందే. వస్తూ వస్తూనే చిరంజీవిని, పవన్ కల్యాణ్ ని ప్రత్యేకంగా వెళ్లి మరీ కలసి ఫొటోలు దిగి విడుదల…

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజుకి పదవి రాగానే ఎంత హడావిడి జరిగిందో అందరికీ తెలిసిందే. వస్తూ వస్తూనే చిరంజీవిని, పవన్ కల్యాణ్ ని ప్రత్యేకంగా వెళ్లి మరీ కలసి ఫొటోలు దిగి విడుదల చేశారు వీర్రాజు. అబ్బబ్బ.. ఇన్నాళ్లు ఇలాంటి నాయకుడు ఎక్కడికిపోయాడని అందరూ అనుకునేలా చేశారు. 

వీర్రాజు రాకతో ఏపీ బీజేపీకి మహర్దశ పట్టిందని, చిరంజీవి కూడా బీజేపీకి మద్దతిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. వరుసగా అందర్నీ కలుసుకుంటూ, మీడియాలో ఆ వార్తల్ని హైలెట్ చేస్తూ, సోషల్ మీడియాలో చెలరేగిపోతూ సోము ఓ రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు.

కట్ చేస్తే.. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. వీర్రాజు కోతల రాయుడనే విషయం అందరికీ తెలిసిపోయింది. స్థానిక ఎన్నికల్లో పరువుపోయింది, తిరుపతి ఉప ఎన్నికల్లో డిపాజిట్లు పోయాయి. ఇంతమాత్రానికి అంత ఎత్తున ఎగిరెగిరి పడటం దేనికి అనే కామెంట్లు పడ్డాయి.

ఇక తెలంగాణ విషయానికొద్దాం. రేవంత్ రెడ్డి చాలాకాలంగా కాంగ్రెస్ లో ఉన్నారు. కానీ పీసీసీ పదవి రాగానే ఏదో సూపర్ పవర్ వచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నారు. అప్పటి వరకూ ఉన్న రేవంత్ వేరు, ఇప్పుడున్న రేవంత్ వేరు అనేలా రెచ్చిపోయారు. పదవి రాగానే మీడియా అధినేతలందర్నీ కలసి, ఆ ఫొటోలు హైలెట్ చేయించుకుంటూ మీడియాలో, సోషల్ మీడియాలో హడావిడి చేశారు. వీహెచ్ లాంటి నేతల్ని ఆస్పత్రికి వెళ్లి మరీ కలిసొచ్చి.. అబ్బా రేవంత్ ఏం నాయకుడు అనేలా ప్రవర్తించారు.

ఇక టీపీసీసీ చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజున చూడాలి.. రేవంత్ ఎక్స్ ట్రాలు అన్నీ ఇన్నీ కావు. అప్పటికీ కేటీఆర్ లాంటి నేతలు రేవంత్ మరీ ప్రధాని పదవి వచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నారంటూ చురకలంటించారు.

సోము Vs రేవంత్ రెడ్డి..

ఏపీలో పదవి రాగానే సోము వీర్రాజు ఎలాంటి హడావిడి చేశారో.. అంతకంటే ఎక్కువే చేస్తున్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఏపీలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో, తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ, ఆ ఆరిపోయే దీపం పట్టుకున్నోళ్ల హడావిడి ఇంకా ఎక్కువ అన్నట్టు.. ఉంది వీరిద్దరి పరిస్థితి. 

ప్రస్తుతం ఏపీలో వీర్రాజు హడావిడి బాగా తగ్గిపోయింది, ఆయన చప్పబడ్డారు. మరికొన్నాళ్లకు తెలంగాణలో రేవంత్ పరిస్థితి కూడా ఇంతే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

రేవంత్ కి తొలి దెబ్బ పడే సమయం వచ్చినట్టే..

రేవంత్ ఎంత ఎగిరెగిరి పడ్డా, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ పరువు మూసీలో కలవడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉన్న అభ్యర్థిని కూడా దూరం చేసుకుంది కాంగ్రెస్, కొత్త అభ్యర్థికి అక్కడ డిపాజిట్ వస్తుందనే నమ్మకం కూడా లేదు. 

పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యేననే వాదన రోజు రోజుకీ బలపడుతోంది. ఈ దశలో రేవంత్ ఇన్ని రోజులు రెచ్చిపోయినా, హుజూరాబాద్ ఫలితాలొచ్చాక మాత్రం అణిగిమణిగి ఉండాల్సిందేనంటున్నారు.