“ఆర్.నారాయణమూర్తి దీనస్థితిలో ఉన్నారట. ప్రస్తుతం ఆయన ఇంటి అద్దె కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నారట.” 2 రోజులుగా కొన్ని యూట్యూట్ ఛానెల్స్ లో ప్రసారమౌతున్న వార్తలివి. వీటిని చూసి ఆర్.నారాయణమూర్తి తట్టుకోలేకపోయారు. స్వయంగా ప్రెస్ మీట్ పెట్టారు. తనకు ఎలాంటి సమస్యలు లేవని క్లారిటీ ఇచ్చారు.
“ఆర్.నారాయణ మూర్తి ఇంటి అద్దె కట్టుకోలేకపోతున్నాడు. దీనస్థితిలో ఉన్నాడు అని రాస్తున్నారు. అది తప్పు. చాలామంది నేను అమీర్ పేట్ హాస్టల్ లో ఉన్నానని రాస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలా రాయడం ధర్మమా? ఆ వార్తలు చూసి చాలామంది నాకు ఫోన్ చేసి డబ్బులిస్తామంటున్నారు. నాకు ఏడుపొస్తోంది. నా దగ్గర డబ్బులున్నాయి, హ్యాపీగా ఉన్నాను, దయచేసి నాకు డబ్బులు పంపించొద్దు ప్లీజ్.”
తన దగ్గర కావాల్సినన్ని డబ్బులున్నాయంటున్నారు పీపుల్ స్టార్. నెలకు తనకు ఆటో ఖర్చులే 30వేలు అవుతాయని, ఆ డబ్బుతో కావాలంటే తను బంజారాహిల్స్ లో అద్దెకు ఉండగలనని అన్నారు. ఆనందం విషయంలో తనకంటే ధనవంతుడు ఎవ్వరూ లేరన్నారు.
“నేను చాలా రిచ్. నా స్నేహితులు ఎప్పుడు కావాలంటే అప్పుడు హెల్ప్ చేస్తారు. పరిశ్రమలో చాలామంది నాకు హెల్ప్ చేసేవాళ్లున్నారు. చాలామంది ప్రేక్షకులు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. అందుకే నేను చాలా రిచ్. పైగా నాకు కష్టాల్లేవు. సినిమా అన్నప్పుడు అప్పు చేయడం కామన్. అప్పు తీసుకుంటా, తీరుస్తా. అంతే తప్ప వచ్చిన డబ్బులతో స్థలాలు కొనుక్కొని, డబ్బులు పోగెయ్యడం లాంటివి చేయను. అందుకే నేను హ్యాపీగా ఉన్నాను.”
ఇలా తనపై వచ్చిన పుకార్లను ఖండించారు నారాయణ మూర్తి. తను చాలా డబ్బు సంపాదించానని, కానీ తనకు కావాల్సినంత మాత్రం ఉంచుకొని, మిగతాదంతా పంచేశానని అన్నారు నారాయణమూర్తి. చాప-దిండు ఉంటే తనకు చాలని, హైస్కూల్ నుంచి ఇప్పటివరకు తన జీవితం అదేనని అన్నారు.