ఈ రకమైన హాట్ కామెంట్స్ వైసీపీ నుంచి అసలు ఎవరూ ఊహించరు. ఆ మాటకు వస్తే విపక్షాలు కూడా ఇంత వాడిగా ఎపుడూ మాట్లాడి ఉండవేమో. కానీ వైసీపీకి చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ మాత్రం ఏకంగా మోడీ మీదనే ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రధానులు వస్తూంటారు, పోతూంటారు. కానీ ప్రజాభిప్రాయమే ఎపుడూ గొప్పది. దానికి భిన్నంగా ఎవరూ వెళ్ళరాదు అంటూ అవంతి చేసిన కామెంట్స్ ఇపుడు పెద్ద ఎత్తున చర్చకు తావిస్తున్నాయి.
ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఈ కామెంట్స్ చేశారు. ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం మొండిగా ముందుకు వెళ్ళరాదని ఆయన చెప్పారు.
ప్రజల అభిమతానికి అనుగుణంగా విశాఖ స్టీల్ ని ప్రభుత్వ రంగంలో ఉంచాలని ఆయన కోరారు. విశాఖ ఉక్కు విషయంలో ఎందాకైనా తాము వెళ్తామని కూడా ఆయన అన్నారు.
విశాఖ ఉక్కు సెగను ఢిల్లీకి తాకేలా చూస్తామని కూడా స్పష్టం చేశారు. పార్లమెంట్ లోపలా బయటా కూడా తమ ఆందోళనలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి చూస్తే మోడీ ఏడేళ్ల ఏలుబడిలో అవంతి చేసిన లాంటి ఘాటు కామెంట్స్ విని ఉండకపోవచ్చేమో.