నిజానికి ఇది సహజంగా జరిగేదే. విపక్షం అంటే అలాగే ఉండాలి. మంచి జరిగితే మెచ్చుకుని చెడు అనిపించినపుడు చెప్పి ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించేందుకు దోహదపడేదే విపక్ష పాత్ర. ఒక విధంగా నిర్మాణాత్మక ప్రతిపక్షం అని అంటారు. అది 1980 దశకం వరకూ తెలుగు నాట బాగా చక్కగా కనిపించేది. అయితే ఆ తరువాత మెల్లగా మార్పు వచ్చింది.
ఇపుడు చూస్తే దాదాపుగా కనుమరుగు అయింది. ప్రభుత్వం ఏ మంచి చేసినా చూసి మెచ్చుకోకపోవడం, తప్పు అంటూ తమకు అనిపిస్తే చాలు వెంటనే విరుచుకుపడిపోవడం ఇదే ప్రస్తుతం అమలవుతున్న రాజకీయం. దానికి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎవరూ అతీతం కాదు.
తెలుగుదేశం అయితే మూడేళ్ల వైసీపీ పాలనలో ఇది మంచి జరిగింది అని ఏనాడూ చెప్పలేదు. అంత మాత్రంచేత ప్రభుత్వం ఒక్క మంచి పనీ చేయనట్లు అయిపోదు. కానీ వైసీపీ సర్కార్ తప్పులు అంటూ నిత్యం విమర్శించడం మాత్రం టీడీపీ చేస్తోంది. తాను కొత్త రాజకీయం చేస్తానని చెప్పి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కూడా పాత రాజకీయమే చేస్తూ వస్తున్నారు.
విశాఖ వేదిక నుంచి ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. దానికి స్పందనగా విశాఖకు చెందిన జనసేన పార్టీ సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్న్ని స్వాగతించారు, అభినందించారు. వాస్తవానికి ఇదే విపక్షం అన్న తరువాత చేయాల్సింది.
అయితే బొలిశెట్టి ఒక కీలక సూచన చేశారు. ఫ్లెక్సీలనే ఉపాధిగా చేసుకున్న వారికి ఒక దారి చూపాలని. ఇది మంచి విషయంగానే భావించాలి. జనసేన నుంచి ఆ మాటకు వస్తే జగన్ సీఎం అయ్యాక విపక్షం మొత్తం నుంచి వచ్చిన తొలి ప్రశంసగా దీన్ని చూడాలని అంటున్నారు.
ఇక మీదట విపక్షాలు సర్కార్ మంచి చేసినపుడు మెచ్చుకుంటే తప్పు చేసినపుడు నిలదీసే అవకాశం ఉంటుంది. అపుడు ప్రభుత్వం కూడా సరిచేసుకునే వీలు ఉంటుంది. జనాలకు కూడా ఏది ఏమిటి అన్నది పూర్తిగా తెలుస్తుంది.