ఎగిరితే పెద్ద ఎన్టీఆర్ జెండాలు ఎగరాలి. అలాంటి అవకాశం లేకుండా చంద్రబాబు వ్యవస్థల్ని, తన పార్టీ జనాల్ని దశాబ్దాల కిందటే మేనేజ్ చేశారు. కాబట్టి చంద్రబాబు జెండాలు ఎగరాలి. లేదంటే భావి నాయకుడు అని టీడీపీ జనాలు జాకీలేస్తున్న లోకేష్ జెండాలైనా ఎగరాలి. కానీ చంద్రబాబు పర్యటనలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ జెండాలు రెపరెపలాడాయి. ఈసారి ఏకంగా బాబు కాన్వాయ్ లోనే జూ.ఎన్టీఆర్ జెండాలు కనిపించడం.. జై బాబుతో పాటు.. జై తారక్ అనే నినాదాలు వినిపించడం ఆసక్తికరం.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించారు చంద్రబాబు. ఇటీవల మృతి చెందిన మాజీ మంత్రి నరసింహారావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. పనిలో పనిగా చిన్న మీటింగ్ పెట్టి వైసీపీని, జగన్ ను విమర్శించారు. దీన్ని బాబు మీడియా బాగానే వండివార్చింది. కానీ ఇదే పర్యటనలో ఎన్టీఆర్ జెండాలతో పాటు జై ఎన్టీఆర్, నెక్ట్స్ సీఎం ఎన్టీఆర్ అనే నినాదాల్ని మాత్రం ఇటు చంద్రబాబుతో పాటు, అతడి మీడియా కూడా చూసీచూడనట్టు వదిలేసింది.
చంద్రబాబు పర్యటనలో కొంతమంది కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో ప్రత్యక్షమయ్యారు. మరికొంతమంది ఫ్లెక్సీలు కూడా ఏర్పాటుచేశారు. చంద్రబాబు కాన్వాయ్ చివర్లో ఉన్న రెండు కార్ల నుంచి ఎన్టీఆర్ జెండాలు బయటకు కనిపించాయి. ఆ జెండాలపై నెక్ట్స్ సీఎం అనే అక్షరాల్ని ప్రింట్ చేయడంతో పాటు.. అదే నినాదాన్ని కూడా వినిపించారు టీడీపీ కార్యకర్తలు.
చంద్రబాబుకు ఇలా ఎన్టీఆర్ జెండాలతో కార్యకర్తలు ఎదురుపడ్డం ఇదే తొలిసారి కాదు. గతంలో ఏకంగా చంద్రబాబు సొంత ఊరు కుప్పంలోనే ఎన్టీఆర్ జెండా ఎగరేయడంతో పాటు.. ఆమధ్య చంద్రబాబు కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు, ఎన్టీఆర్ ను ఎప్పుడు పార్టీలోకి తీసుకొస్తారంటూ నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
పాపం లోకేష్ పరిస్థితేంటి బాబూ..!
అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ కలిసికట్టుగా ఇలాంటి డిమాండ్లను అణగతొక్కారు. ఎక్కడా ఎన్టీఆర్ పేరు వినిపించకుండా సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడో మునిగే నావ. అందుకే మాకు లోకేష్ వద్దు, ఎన్టీఆర్ మాత్రమే కావాలంటున్నారు టీడీపీలో చాలామంది జనాలు. ఆ విషయాన్ని ఇలా జెండాలు, ఫ్లెక్లీలు, స్లోగన్లు రూపంలో బయటపెడుతూనే ఉన్నారు. ఈసారి చంద్రబాబు, లోకేష్ కు వీటిని అడ్డుకునేంత సీన్ లేదు.
ఇప్పుడు వీటిని చంద్రబాబు చూసీచూడనట్టు వదిలేయొచ్చు. కానీ భవిష్యత్తులో కొడుకును పార్టీకి పెద్ద దిక్కుగా చేయాలని చూస్తున్న బాబుకు అప్పుడు మాత్రం కార్యకర్తల నుంచి గట్టి సెగ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తమ్మీద చంద్రబాబు సంగతి పక్కనపెడితే.. లోకేష్ కు మాత్రం ఎన్టీఆర్ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు.