మరో 4 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది బ్రోచేవారెవరురా సినిమా. సోషల్ మీడియాలో ఈ సినిమాపై కాస్త హైప్ ఉంది కానీ సామాన్య ప్రేక్షకులు మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అందుకు తగ్గట్టే థియేట్రికల్ బిజినెస్ అంతంతమాత్రంగానే జరిగింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సినిమాకు బంపర్ ఆఫర్ తగిలింది.
విడుదలకు ముందే బ్రోచేవారెవరురా సినిమా శాటిలైట్ డీల్ లాక్ అయింది. ఏకంగా 3 కోట్ల రూపాయలకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఈ చిన్న సినిమాకు రిలీజ్ కు ముందే ఇంత బిజినెస్ జరగడం నిజంగా గొప్ప విషయం. మరీ ముఖ్యంగా శ్రీవిష్ణు సినిమా ఇలా విడుదలకు ముందే శాటిలైట్ డీల్ పూర్తిచేసుకోవడం అరుదు.
ఇప్పటికీ శ్రీవిష్ణుకు చెందిన ఎన్నో సినిమాలు శాటిలైట్ కు నోచుకోకుండా అలా పడి ఉన్నాయి. ఎంతోకొంతకు అమ్ముకుందామన్నా కొనేవాళ్లు లేరు. అలాంటి టైమ్ లో శ్రీవిష్ణు నటించిన ఈ సినిమా విడుదలకు ముందే ఇలా అమ్ముడుపోయిందంటే అది చెప్పుకోదగ్గ విషయమే కదా.
థియేట్రికల్ ట్రయిలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు.. రీసెంట్ గా రిలీజైన కామెడీ టీజర్ క్లిక్ అవ్వడంతో ఈ సినిమా ఇంత తొందరగా అమ్ముడుపోయినట్టు చెబుతున్నారు. వివేక్ ఆత్రేయ డైరక్ట్ చేసిన బ్రోచేవారెవరురా ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది.