పులి ఒకలా దాడి చేస్తుంది. సింహం వేట ఇంకోలా వుంటుంది. రెండూ కలిసి ఒకేసారి చేస్తే లైగర్‌లా వుంటుంది. సినిమా చూసి ఒళ్లంతా గాయాలతో ఇల్లు చేరాను. రక్తగాయాల బాధితులు అప్పటికే ఫేస్బుక్లో కిటకిటలాడుతున్నారు. వాళ్లకి పోటీ బాధితుడిగా నా గోడు ఎందుకని నెమ్మదించాను.
సినిమా ప్రమోషన్లో ఓవర్ చేస్తున్నపుడే అనుమానం వచ్చింది. విషయం లేనప్పుడే ఎక్కువ మాట్లాడ్తారు. చార్మి ఏడుస్తున్నపుడు అర్థమైంది. చివరికి మిగిలేది ఆమెకి బోధపడినట్టుంది.
థియేటర్లో కూచున్నప్పటి నుంచి విజయ్ దేవరకొండ ఉతకడం ప్రారంభించాడు. విలన్లని కొడుతున్నాడు కానీ పంచ్‌లు మనకి తగులుతున్నాయి (ఈ సినిమాలో విలన్లు లేరు. ఎవరిని కొడుతున్నాడో హీరోకి కూడా తెలియదు).
పూరీ జగన్నాథ్ మంచి వంటగాడు. చికెన్ లేకుండా చికెన్ బిర్యానీ వండగలడు. ప్రేక్షకుల్ని బొగ్గుల పొయ్యి మీద కాల్చగల నైపుణ్యం ఆయన సొంతం (దీన్నే మోడ్రన్‌గా బార్బెక్యూ అంటారు). సందర్భాన్ని బట్టి నిన్ను మొక్క జొన్న కండెలా కూడా కాల్చగలడు. మనకి చాయిస్ వుండదు. సెగను భరించడమే. లైగర్‌లో హీరోకి నత్తి ఎందుకంటే, మాటలో ఉన్న ల్యాగ్ కథలో కూడా వుండడం వల్ల.
అమీర్‌ఖాన్, అక్షయ్‌కుమార్ సినిమాలే చీదుతున్నాయి. ఎందుకంటే కథలో బలం లేకపోవడం వల్ల. అయితే మన పూరీకి అవన్నీ అక్కర్లేదు. ఎందుకంటే గజనీకి గతం జ్ఞాపం లేనట్టు, ఈయనకి గతమే జ్ఞాపకం వుంటుంది. గతంలో పెద్ద తోపు అని ఈయన నమ్మకం. అది కొంచెం నిజం కూడా. అయితే ఇది డిజిటల్ ప్రపంచం. ఈ రోజు నువ్వేంటో అదే మాకు కొలమానం.
పూరీకి టైలరింగ్ తెలుసు. అయితే కోట్కి, షర్ట్‌కి, బనియన్కి వేర్వేరు కొలతలుంటాయని తెలీదు. టేప్‌కి బదులు పురికోస వాడతాడు. అందుకే అన్నీ ఒకలాగే వుంటాయి. నేను చెప్పిందే కథ, తీసిందే సినిమా అంటాడు. ఆయన బలుపు ఆయన ఇష్టం. కానీ విజయ్ దేవరకొండ కోసం ఈ సినిమా చూసాను. మొత్తం ఖర్చులన్నీ రూ.500 నష్టం. అది ఎవరిస్తారు? మిమ్మల్ని సినిమాకి ఎవరు రమ్మన్నారని కూడా ఈ డైరెక్టర్లు అడగగలరు. మీరు ఊరూరు తిరిగి ప్రమోషన్ వర్క్ చేసేది మమ్మల్ని రప్పించడానికే కదా? పిలిచి చావబాదడం న్యాయమా?
విజయ్ దేవరకొండలో ఈజ్ వుంది. ఫిజిక్, నటన అన్నీ వున్నాయి. లేనిది బుద్ధి మాత్రమే. కథల సెలక్షన్ రాదు. ఆయన పాత్ర బాగుంటే మంచి కథ అనుకుంటాడు. రైలు నడవాలంటే డీజిల్ వుంటే చాలదు. పట్టాలు కూడా వుండాలి. మిగతా పాత్రల ఎమోషన్ కలిస్తేనే హీరో నిలబడేది.
ఇది ఫైటర్ కథలా వుంటే ఏ సమస్యా లేదు. కానీ ప్రేమ కథ దీన్ని చంపేసింది. కథకి హీరోయిన్ బ్రేకులేస్తూ వెళితే ముందుకెళ్లే చాన్స్ ఎక్కడ? ప్రేమ కథైనా కొత్తగా వుందా? అంటే అదో ఊరగాయ. పూరీనే ఎన్నో సార్లు జాడీలో భద్రపరిచిన పాత ఆవకాయ.
హీరోయిన్ పాటలతో, చేష్టలతో వడియాల్లా ప్రేక్షకుల్ని నంజుకుంటుంది. అసలు హీరో తల్లితో కలిసి కరీంనగర్ నుంచి ఎందుకొస్తాడు? ఫైటర్ కావాలని. కొడుకుని ఏదో చేయాలని తల్లికి కసి, జీవిత లక్ష్యం. ఈ పాయింట్ మీదే కథ నడిస్తే సినిమా బతికేది. అయితే సినిమాని చంపడమే డైరెక్టర్ ఉద్దేశం కాబట్టి మధ్యలో ప్రేమ కథ, నత్తి సుత్తి.
హీరో అందర్నీ చితకబాదుతున్నపుడు, కొంచెం వెరైటీగా వుంటుందని మైక్‌టైసన్‌ని తెచ్చారు. ఆయన ఫైటరో, జోకరో అర్థం కాదు. నూనెలో కాల్చకుండా పిండిని ఇచ్చి తినమంటే, దాన్ని పూరి అనుకోలేం. పూరీ స్టైల్ ఇది.
సమీక్షలు కొంచెం ఘాటుగా రాస్తే, మీకు చేతనైతే సినిమా తీసి చూపించండి అని కొంత మంది వెర్రివాగుడు వాగుతుంటారు. హోటల్లో చద్ది కూడు పెడితే మీరు ఓనర్ని పిలిచి కోప్పడతారు. చేతనైతే మీరు వండండి అంటే ఊరుకుంటారా? ఈడ్చి నాలుగు తంతారు.
రైటింగ్ మీద కనీస శ్రద్ధ పెట్టకుండా, కొంచెం కూడా కొత్తగా ఆలోచించకుండా ఇలాంటి సినిమాలు తీసిన పూరీని అభినందించాలి. విజయ్‌ని కూడా మెచ్చుకోవాలి. ఇలాంటివి నాలుగు తీస్తే, ఐదోది వుండదు. ఒకప్పుడు విజయ్ దేవరకొండ అనే నటుడు ఉండేవాడు అని చెప్పుకోవాల్సి వస్తుంది.
పోనీ రమ్యకృష్ణ అయినా బాగా చేసిందా అంటే సినిమా అంతా గట్టిగట్టిగా అరుస్తూ వుంటుంది.
పులికి, సింహానికి పుడితే లైగర్ అంటారట. సింహం రమ్యకృష్ణ అయితే మరి పులి ఎక్కడ? తండ్రి ఆశయం కోసమే కదా హీరో ఫైటర్ అయ్యింది. సినిమాలో ఆ పాత్రే కనపడకపోతే ప్రేక్షకుడు ఎమోషనల్‌గా ఎలా కనెక్ట్ అవుతాడు?
ప్రేక్షకుడి డబ్బు పట్ల ఎలాగూ బాధ్యత, గౌరవం లేదు. కనీసం అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నపుడు మీ డబ్బుపైన అయినా బాధ్యత, భయం వుండాలి కదా?
ఇంతకీ విజయ్ కసరత్తులు చేసి చావ బాదింది ఎవరిని? డబ్బులిచ్చి సీట్లలో కూచున్న ప్రేక్షకుల్ని. ఇంత కాలం తెలుగు ప్రేక్షకుల్ని మాత్రమే చావగొట్టేవాళ్లు. ఇప్పుడు పాన్ ఇండియా పేరుతో దేశాన్ని మొత్తం ఈడ్చి తంతున్నారు. మనం బాగా ఎదిగాం.
లైగర్ క్రాస్ బ్రీడ్ – ప్రేక్షకులే బ్లీడింగ్.
జీఆర్ మహర్షి