తెలంగాణలో కులాల పునరేకీకరణ జరుగుతోందా? ఇన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకుని వున్న రెడ్డి సామాజిక వర్గం మెల మెల్లగా భాజాపా వైపు షిప్ట్ అవుతోందా? రెడ్లను..బిసిలను కలిపి ఆంధ్రలో జగన్ చేస్తున్న రాజకీయాన్నే తెలంగాణలో భాజపా చేయబోతోందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
తెలంగాణ లో చిరకాలం అధికారం అనుభవించిన రెడ్డి సామాజిక వర్గం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత దానికి దూరమైంది. టీఆర్ఎస్ హయాంలో మరీ వారిని మూలన పెట్టేయలేదు. వీలయినంత అవకాశం ఇస్తూనే వస్తున్నారు. కానీ ఎక్కడో ఏదో అసంతృప్తి. ఇన్నాళ్లు అణగి వున్న ఆ అసంతృప్తి ఇప్పుడు బయట పడుతున్నట్లు కనిపిస్తోంది.
తెలంగాణలో బిసిలకు పెద్ద పీట వేస్తూనే, రెడ్డి సామాజిక వర్గ అసంతృప్తిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం భాజపా చేస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ లో వున్న రెడ్డి నాయకులు ఒక్కొక్కరుగా భాజపా తీర్థం తీసుకుంటున్నాను. రానున్న నెలల్లో కీలకమైన మరి కొంత మంది రెడ్డి నాయకులు కూడా అదే బాట పడతారని వార్తలు వినవస్తున్నాయి.
కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా వున్నారు. లక్ష్మణ్ కూడా పార్టీలో కీలకంగా వున్నారు. ఇలా రెండు కులాల సమతూకం చూసుకుంటూనే ఆంధ్ర జనాల మనసులు కూడా చూరగోనే ప్రయత్నం చేస్తోంది భాజపా. ఇటీవలే హీరో ఎన్టీఆర్ ను, మీడియా టైకూన్ రామోజీరావును కలిసి వెళ్లారు అమిత్ షా. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు వచ్చి హీరో నితిన్ ను కలవబోతున్నారు. నితిన్ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన హీరోనే.
చూస్తుంటే జనాలంతా భాజపా బాట పడుతున్నారనే కలరింగ్ ను బలంగా కనిపించేలా చేయాలని భాజపా చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటు మేధావి వర్గం, అటు సెలబ్రిటీలు, మరో పక్క కీలకమైన రెండు సామాజిక వర్గాలు ఇలా అన్ని వైపుల నుంచి భాజపాను గెలుపుదిశగా నడిపించాలని కీలకమైన బృహత్ ప్రయత్నం జరుగుతోంది.
కానీ ఇప్పటికీ గమనించాల్సింది ఏమిటంటే, కిందిస్థాయిలో, కేడర్ పరంగా, జనం పరంగా టీఆర్ఎస్ బలంగా వుంది. అలాగే డెక్కన్ ఏరియాలో వున్న మైనారిటీ వర్గం అంతా టీఆర్ఎస్ వైపే వుంది. అందువల్ల భాజపా యత్నాలు, హడావుడి ఓ రేంజ్ లో వుంటే వుండొచ్చు కానీ ఇప్పటికి ఎడ్జ్ మాత్రం టీఆర్ఎస్ వైపే వుంది.