సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లింగారెడ్డి రాజశేఖరరెడ్డి కుటుంబం ఆందోళనలో ఉంది. సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఆయన తన కుటుంబ సభ్యులతో ….తనను విచారణ పేరుతో సీబీఐ పోలీసులు వేధిస్తున్నారని, తాను తట్టుకోలేకపోతున్నానని, ఇక తనను మరిచిపోవాలని అన్నట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో లింగారెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది.
పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలోని ముతుకూరు అనే గ్రామం లింగారెడ్డి రాజశేఖరరెడ్డి స్వస్థలం. ప్రస్తుతం కడపలో నివాసం ఉంటున్నాడు. ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉండేవాడు. మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం, ఇతరత్రా కారణాల నేపథ్యంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
హైకోర్టు ఆదేశాలను తప్పు పడుతూ కొందరు సోషల్ మీడియాలో జడ్జిలను కించపరుస్తూ పోస్టులు పెట్టారు. దీనిపై న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది. సీఐడీ పోలీసులు తగిన రీతిలో విచారణ చేపట్టకపోవడంతో సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
సీబీఐ నమోదు చేసిన 18 మందిలో లింగారెడ్డి రాజశేఖరరెడ్డి ఒకడు. ఈయన 15వ నిందితుడు. ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి తిరిగొచ్చిన లింగారెడ్డి రాజశేఖరరెడ్డిని సీబీఐ పోలీసులు విజయవాడకు పిలిపించి రెండు రోజుల పాటు విచారించారు. ఆ తర్వాత రెండు రోజులకు కడపకు వెళ్లి అరెస్ట్ చేశారు.
తాజాగా రెండు రోజుల పాటు సీబీఐ పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ గుంటూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్.అరుణశ్రీ ఉత్తర్వులిచ్చారు. దీంతో ఆయన్ను సీబీఐ పోలీసులు మరోసారి రెండురోజుల పాటు విచారించనున్నారు. ఇదిలా ఉండగా జైల్లో ఉన్న లింగారెడ్డి రాజశేఖరరెడ్డి నుంచి వచ్చిన సమాచారం…కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
తన పోస్టు వెనుక ఎవరున్నారో చెప్పాలంటూ సీబీఐ పోలీసులు హింసిస్తున్నారని అతను వాపోయాడని తెలిసింది. సీబీఐ పోలీసుల వేధింపులు తాళలేకున్నానని, ఇక తనను మరిచిపోవాలని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు తల్లడిల్లుతున్నారు. లింగారెడ్డి రాజశేఖరరెడ్డి విరక్తితో కూడిన మాటలు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా ఆందోళనకు గురి చేస్తుండడం గమనార్హం.