కేసీఆర్‌కు కోపం తెప్పిస్తున్న జ‌గ‌న్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న జ‌రిగి ఏడేళ్ల‌వుతోంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇంకా ప్ర‌త్యేక తెలంగాణ సెంటిమెంట్‌నే న‌మ్ముకుని ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు. అది లేక‌పోతే త‌న ఉనికే లేద‌నే భ‌యాందోళ‌న‌లో కేసీఆర్ రాజ‌కీయ అడుగులు చెప్ప‌క‌నే చెబుతున్నాయి.…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న జ‌రిగి ఏడేళ్ల‌వుతోంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇంకా ప్ర‌త్యేక తెలంగాణ సెంటిమెంట్‌నే న‌మ్ముకుని ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు. అది లేక‌పోతే త‌న ఉనికే లేద‌నే భ‌యాందోళ‌న‌లో కేసీఆర్ రాజ‌కీయ అడుగులు చెప్ప‌క‌నే చెబుతున్నాయి. 2018లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా తెలంగాణ‌లో చంద్ర‌బాబు రాజ‌కీయ జోక్యం… ఊహించ‌ని ఆయుధంగా కేసీఆర్‌కు చిక్కింది. 

టీడీపీతో పొత్తు, ప్ర‌చారానికి చంద్ర‌బాబ రాక‌, త‌ద్వారా మ‌రోసారి సెంటిమెంట్‌ను కేసీఆర్ రగ‌ల్చ‌డం ద్వారా త‌మ కొంప మునిగింద‌ని కాంగ్రెస్ ప‌శ్చాత్తాపానికి గురైంది. నాలుగేళ్ల‌లో ప్ర‌జ‌ల కోసం తానేం చేశానో కేసీఆర్ నాడు చెప్ప‌డం మానేసి, చంద్ర‌బాబు అనే తెలంగాణ వ్య‌తిరేక దెయ్యాన్ని చూప‌డం ద్వారా కేసీఆర్ మ‌రోసారి రాజ‌కీయ ల‌బ్ధి పొందార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఎన్నిక ఏదైనా ఆంధ్రా, తెలంగాణ భావోద్వేగాల‌ను రెచ్చ‌గొడితే త‌ప్ప టీఆర్ఎస్‌కు రాజ‌కీయ మోక్షం క‌ల‌గ‌ద‌ని కేసీఆర్ బ‌లంగా న‌మ్ముతున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఒక‌వేళ ప్రాంతీయ విద్వేషాల‌ను రెచ్చ‌గొట్ట‌క‌పోతే దుబ్బాక ఉప ఎన్నిక‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల ఫ‌లితాలు పున‌రావృతం అవుతాయ‌నే ఆందోళ‌న కేసీఆర్‌లో ఉన్న‌ట్టు చెబుతున్నారు. తాజాగా ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామాతో మ‌రోసారి తెలంగాణ‌లో ఉప ఎన్నిక అనివార్యం కానుంది.

హుజూరాబాద్‌కు త్వ‌ర‌లో ఉప ఎన్నిక జ‌రిగే అవ‌కాశం ఉంది. దీంతో పాటు ఆంధ్రప్ర‌దేశ్‌లో క‌డ‌ప జిల్లా బ‌ద్వేలు అసెంబ్లీకి కూడా ఒకే ద‌ఫా ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. వైసీపీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ వెంక‌ట‌సుబ్బ‌య్య అనారోగ్యంతో మ‌ర‌ణించారు. దీంతో ఉప ఎన్నిక జ‌రిగే అవ‌కాశం ఉంది. కానీ ఏపీలో సెంటిమెంట్‌తో ఎన్నిక అనే ఊసే లేదు. 

ఇదే తెలంగాణ విష‌యానికి వ‌స్తే అధికార పార్టీ టీఆర్ఎస్ ఎన్నిక వ‌స్తే చాలు… ఏదో ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని సిద్ధం చేసుకోవ‌డంపై ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కృష్ణా జ‌లాల వివాదం తెర‌పైకి రావ‌డం వెనుక టీఆర్ఎస్ ఎన్నిక‌ల వ్యూహ‌మే అని తెలంగాణ, ఏపీ రాజ‌కీయ ప‌క్షాలు న‌మ్ముతున్నాయి.

అందుకే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చ‌గొట్టే ప్ర‌క‌ట‌న చేస్తున్నా… ముఖ్యంగా ఏపీ అధికార పార్టీ సంయ‌మ‌నం పాటిస్తోంది. దీంతో తాము ఆశించిన విధంగా పొలిటిక‌ల్ మైలేజీ రాక‌పోవ‌డం టీఆర్ఎస్‌ను నిరుత్సాహ ప‌రుస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒక‌వైపు హుజూరాబాద్‌లో బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి, బీజేపీ నేత ఈట‌ల రాజేంద‌ర్‌ను ఎదుర్కొనేందుకు వ్యూహ‌ప్ర‌తివ్యూహాల్లో టీఆర్ఎస్ త‌ల‌మున‌క‌లైంది. 

ఇప్ప‌టికే టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ‌ను పార్టీలో టీఆర్ఎస్ చేర్చుకుంది. ఇక కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డిని నేడోరేపో చేర్చుకోనున్నారు. అయినప్ప‌టికీ హుజూరాబాద్ ఉప ఎన్నిక భ‌యం టీఆర్ఎస్‌ను వెంటాడుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో తాము రెచ్చ‌గొట్టినా, ఏపీ రెచ్చిపోకుండా సంయ‌మ‌నం పాటించ‌డం కేసీఆర్‌కు కోపం తెప్పిస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

కృష్ణా జ‌లాల వివాదంలో త‌మ‌ను జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో తిడితే, దానిపై తాము మ‌రో వంద ర‌కాలుగా తీవ్రంగా స్పందిస్తూ ఎన్నిక‌ల వ‌ర‌కూ ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని టీఆర్ఎస్ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. అయినా జ‌గ‌న్ మౌనం ముందు టీఆర్ఎస్ సెంటిమెంట్ ప‌ప్పులేవీ వుడ‌క‌లేదు. మ‌రోవైపు తెలంగాణ‌ను ఏడేళ్లుగా కేసీఆర్ పాలిస్తున్నా… ఇంకా కేవ‌లం సెంటిమెంట్ పేరు చెప్పుకుని రాజ‌కీయ పండ్లు రాల్చుకోవాల‌నే యావ ఏంటి అనే ప్ర‌శ్నలు త‌లెత్తుతున్నాయి.

నిధులు, నీళ్లు, నియామ‌కాల పేరుతో తెలంగాణ ఉద్య‌మం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఏడేళ్ల‌లో తెలంగాణ ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా నీళ్లు, నిధులు, నియామ‌కాల ఫ‌లాలు ఎంత మాత్రం అందించానో కేసీఆర్ చెప్ప‌కుండా, రెచ్చ‌గొట్టే ప‌నులేంట‌నే ప్ర‌శ్న‌లు స‌హ‌జంగానే వెల్లువెత్తుతున్నాయి. దీనికి కేసీఆర్ ఏం స‌మాధానం చెబుతారో!