రెండు తెలుగు రాష్ట్రాల పాలనలో ఎవరి మార్కులు వారివి, ఎవరి రిమార్కులు వారివి. అయితే ఏపీ సీఎం జగన్ ని మాత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ సైలెంట్ గా ఫాలో అవుతూ వస్తున్నారు. ఏపీలో జాబ్ క్యాలెండర్ పేరుతో ఇటీవలే జగన్ ఖాళీలు, భర్తీల వివరాలు విడుదల చేశారు.
తెలంగాణలో కూడా ఇప్పుడు దీన్ని మక్కికిమక్కి అమలు చేయాలనుకుంటున్నారు కేసీఆర్. ఇటీవలే 50వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్, ఇకపై ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు.
జాబ్ క్యాలెండర్ అనే పేరు, ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ అనే కాన్సెప్ట్ కి ఆద్యుడు జగన్. అధికారంలోకి వచ్చీ రాగానే సచివాలయాలు ఏర్పాటు చేసి, లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడిదే కాన్సెప్ట్ ని కేసీఆర్ ఫాలో అవుతున్నారు. కేబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.
గతంలో కూడా..
గతంలో కూడా ఏపీ సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాలో అయ్యేవారు. ఏపీలో రైతు భరోసాని, తెలంగాణలో రైతు బంధు పేరుతో అమలులోకి తెచ్చారు.
పోలీసుల వీక్లీ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఏపీలో అమలైన తర్వాతే తెలంగాణలో తెరపైకి వచ్చింది. భూ సమగ్ర సర్వేకి ఏపీలో జగన్ శ్రీకారం చుట్టాక, తెలంగాణ దాన్ని ఫాలో అవుతోంది.
ఇంగ్లిష్ మీడియం చదువులు..
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదువులకి కూడా జగనే అందరికీ ఇన్స్ పిరేషన్ అని చెప్పాలి. తెలంగాణలో కూడా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రతిపాదన ఆమధ్య ప్రముఖంగా తెరపైకి వచ్చింది. అయితే కరోనా వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది.
ఈ కాంపిటీటివ్ యుగంలో పిల్లలందరూ ఇంగ్లిష్ మీడియంలో చదివితేనే ఉన్నతోద్యాగాలు లభించే అవకాశాలు ఉన్నాయనేది ఇరు రాష్ట్రాల సీఎంల అభిప్రాయం. దానికి అనుగుణంగానే అక్కడా, ఇక్కడా మార్పులు జరుగుతున్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు-నేడు..
ఏపీలో స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు-నేడు పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాటి రూపు రేఖలు మారిపోతున్నాయి. తెలంగాణలో ప్రత్యేక పథకంలా పేరు పెట్టకుండా.. ఆస్పత్రుల అభివృద్ధికి నిధులు కేటాయించారు కేసీఆర్. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల దిగిపోయిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా జాబ్ క్యాలెండర్ నిర్ణయంతో.. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వేరయినా, తీసుకునే నిర్ణయాలు మాత్రం ఒకేలా కనిపిస్తున్నాయి. అలా తన నిర్ణయాలతో తెలంగాణతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాల ప్రభుత్వాల్ని జగన్ ప్రభావితం చేస్తున్నారు.