తన చుట్టూ ఏం జరుగుతోందో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఇప్పుడిప్పుడే తెలుసొస్తోంది. నష్ట నివారణ చర్యలకు ఆయన ఉపక్రమించారు. ఈ క్రమంలో ప్రవీణ్ ప్రకాశ్‌పై వేటు వేసి… ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసే వారికి ఏం జరుగుతుందో ఓ హెచ్చరిక పంపారు.
సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్శదర్శి (రాజకీయ) బాధ్యతల నుంచి సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్‌ని తప్పించడం రాజకీయ, అధికార వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ప్రవీణ్ ప్రకాశ్ స్థానంలో ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శగా పనిచేస్తున్న ముత్యాలరాజును నియమించారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారైన ప్రవీణ్ ప్రకాశ్ అంటే ఐఏఎస్ అధికారుల్లో గిట్టని వారు ఎక్కువే. ప్రవీణ్ ప్రకాశ్ దూకుడే ఆయనకు బలం, బలహీనత అని చెప్పొచ్చు. ఈస్ట్‌గోదావరి, వైజాగ్, రంగారెడ్డి తదితర పెద్ద జిల్లాల కలెక్టర్‌గా ప్రవీణ్ ప్రకాశ్ పని చేసి సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన కార్యాలయంలో సమర్థవంతమైన అధికారులను నియమించుకోవాలని భావించారు.
ఈ క్రమంలో తన జిల్లాకే చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ్‌రెడ్డి, అలాగే రిటైర్డ్ సీఎస్ అజయ్ కల్లం తదితరులపై నమ్మకం పెట్టుకున్నారు. అయితే తానిచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా పని చేస్తున్న ధనుంజయ్ రెడ్డితో పాటు సలహాదారు అజయ్‌కల్లం కూడా తాత్సారం చేస్తూ వచ్చారని సమాచారం. దీంతో తన ఆదేశాలను అమలు చేయడంలో ఐఏఎస్ అధికారుల అలసత్వం జగన్‌కు చిరాకు తెప్పించింది.
ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి ఆరు నెలల సమయం కూడా పట్టిన రోజులున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో సీఎంవోలోకి ప్రవీణ్ ప్రకాశ్‌ను రప్పించుకున్నారు. తాను ఆశించినట్టు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో ప్రవీణ్ ప్రకాశ్ చురుగ్గా పనిచేశారు, చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ స్పీడ్ జగన్ ఊహించిన దాని కంటే కాస్త ఎక్కువైంది. దీంతో కొత్త సమస్యలు తీసుకొచ్చింది.
కొన్ని కీలక నిర్ణయాల్లో సంబంధిత శాఖ ఉన్నతాధికారుల అభిప్రాయాలు తీసుకోకపోవడంతో పాటు కనీసం సీఎస్‌కు కూడా సమాచారం లేకుండా ప్రవీణ్ అత్యుత్సాహం ప్రదర్శించారని చెబుతున్నారు. అదే ముఖ్యమంత్రికి కోపం తెప్పించింది. దీంతో కీలక పోస్టు నుంచి వెంటనే తప్పించ డానికి దారి తీసిందనే అభిప్రాయాలు ఐఏఎస్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్ విభాగాల్ని, రెవెన్యూ శాఖ నుంచి ఆర్థికశాఖకు మార్చే విషయంలో ప్రవీణ్ ప్రకాశ్ సొంత నిర్ణయం తీసుకున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శుల అధికారాల్లో కోత విధించి, వాటిలో కొన్నింటిని వీఆర్వోలకు బదిలీ చేస్తూ జీవో 2 జారీ చేయడం వివాదానికి దారి తీసింది. దీని వెనుక ప్రవీణ్ ప్రకాశ్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. ఈ జీవోను ఇటీవల హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇలా అంతర్గతంగా మరికొన్ని సంఘటనలకు సంబంధించి ప్రవీణ్ ప్రకాశ్‌పై సీఎంకు ఉన్నతాధికారుల నుంచి భారీగా ఫిర్యాదులు వెళ్లాయని సమాచారం.
మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ప్రవీణ్ ప్రకాశ్‌తో ముఖ్యమంత్రి కార్యాలయంలోని కొందరు ఐఏఎస్ ఆఫీసర్లకు పొసగడం లేదు. ప్రవీణ్‌కు సీఎం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే కినుక మెజార్టీ ఐఏఎస్ ఆఫీసర్లలో ఉంది. ప్రవీణ్ దగ్గరికి వెళితే ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఇతర ఐఏఎస్ అధికారులకు కోపం, అలాగే వీళ్లను కలిస్తే ఆయనకు కోపం అన్నట్టుగా తయారైందని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రవీణ్ ప్రకాశ్ తొలగింపుతోనే ఆగుతుందా? మరి కొందరిపై వేటు వేసి ఉన్నతాధికారుల మధ్య గ్రూప్ రాజకీయాలకు చెక్ పెడుతారా? అనేది తేలాల్సి వుంది.