ఏపీ సమాజం రాజకీయంగా కులాలుగా విడిపోయింది. ఎవరు అవునన్నా, కాదన్నా… ఒక్కో పార్టీ ఒక్కో కులానికి ప్రాతినిథ్యం వహిస్తోంది. ఆ పార్టీ అధినేత కులాన్ని బట్టి, ఆ పార్టీ ఫలానా సామాజిక వర్గం వాళ్లది అని చెప్పుకుంటారు. మిగిలిన వెనుకబడిన కులాల్లో తాము కేవలం బోయీలుగా మిగిలిపోతున్నామనే ఆవేదన ఉంది.
టీడీపీ తమదిగా మెజార్టీ కమ్మ సామాజిక వర్గం భావిస్తుంది. అందుకు తగ్గట్టుగా పార్టీ అభ్యున్నతికి వారు శక్తి వంచన లేకుండా శ్రమిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యం ఎక్కువే. ఇదంతా సహజ సిద్ధంగా జరిగిపోతుంటుంది.
ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సొంత పార్టీలో నిరాదరణపై ఆమె అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు. ఇదే సంగం డెయిరీ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు మార్‌కు పార్టీ అండగా నిలిచిందని గుర్తు చేస్తున్నారు.
గతంలో ధూళిపాళ్ల నరేంద్ర జైలు నుంచి విడుదలై ఇంటికొచ్చిన మరుసటి రోజే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడాన్ని అఖిలప్రియ అనుచరులు గుర్తు చేస్తున్నారు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నరేంద్ర ఇంటికెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పి వచ్చారని అఖిలప్రియ అనుచరులు చెబుతున్నారు.
మరి హైదరాబాద్ హఫీజ్‌పేట్ భూముల వ్యవహారంలో అరెస్ట్ అయి బెయిల్‌పై ఇంటికొచ్చిన తమ నాయకురాలిని కనీసం లోకేశ్ కూడా పరామర్శించేందుకు రాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని భూమా అభిమానులు నిలదీస్తున్నారు. పైగా ఒక మహిళా నాయకురాలు, తల్లిదండ్రులిద్దరూ లేని కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పాలన్న ఆలోచన చంద్రబాబు, ఆయన తన యుడు లోకేశ్‌కు ఎందుకు లేకపోయిందని భూమా అనుచరులు ప్రశ్నిస్తున్నారు.
తమ నాయకురాలు చంద్రబాబు సామాజిక వర్గం కాదు కాబట్టే వారి అభిమానానికి నోచుకోలేదని అర్థం చేసుకోవాలా? అని భూమా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల అఖిప్రియ భర్త, తమ్ముడిని తెలంగాణ పోలీసులు మరోసారి అన్యాయంగా కేసులో ఇరికించారని, దీనిపై చంద్రబాబు, లోకేశ్ ఎందుకు మాట్లాడ్డం లేదని వారు నిలదీస్తున్నారు.
తమ చర్యల ద్వారా భూమా అఖిలప్రియను దూరం పెట్టామనే సంకేతాలను చంద్రబాబు, లోకేశ్ ఇవ్వదలుచుకున్నారా? అని ఆమె అనుచరులు ప్రశ్నిస్తుండడం చర్చనీయాంశమైంది.