టీడీపీ అధ్యక్ష పదవి రాగానే ఎగిరెగిరి పడ్డారు. వైసీపీ అంతం చూస్తానన్నారు. కళా వెంకట్రావుతో కాలేదని, చివరకు తనని రంగంలోకి దించారంటూ గొప్పలు చెప్పుకున్నారు. కానీ చివరకు ఏం జరిగింది. ఏపీలో టీడీపీ అధ్యక్షుడిగా తన రేంజ్ చూపిస్తానంటూ బరిలో దిగిన అచ్చెన్నాయుడు సైలెంట్ అయ్యారు.
ఉద్యమాలు లేవు, ఊకదంపుడు ఉపన్యాసాలు లేవు, ప్రజా యాత్రలు లేవు, పోరాటాలు లేవు.. అసెంబ్లీలో రెచ్చిపోయిన అచ్చెన్న.. ఇప్పుడు జనంలోకి రావడానికి మాత్రం వెనకాడుతున్నారు. దాదాపుగా నోరు మూసేసుకున్నారు.
వైసీపీ హవాని తట్టుకుని గెలిచినా, అసెంబ్లీలో హడావిడి చేసినా.. తర్వాతి రోజుల్లో అచ్చెన్నాయుడు పూర్తిగా డీలా పడ్డారు. ఈఎస్ఐ కుంభకోణంలో ఇరుక్కుని పైల్స్ వ్యాధితో ఆస్పత్రిలో కాలం గడిపి జైలుకెళ్లకుండా తప్పించుకున్నారు అచ్చెన్న. దాదాపు 80 రోజుల పాటు పోలీస్ కస్టడీలో కాలం వెళ్లదీయాల్సి వచ్చింది. పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో 'నెక్స్ట్ హోమ్ మినిస్టర్ ని నేనే.. మీ సంగతి చూస్తా'నంటూ ఆగ్రహంతో ఊగిపోయారు కూడా. అలాంచి అచ్చెన్న ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యారు.
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం కోసం వచ్చి హోటల్ రూమ్ లో.. 'పార్టీ లేదు.. బొక్కా లేదు' అంటూ అచ్చెన్న పేల్చిన డైలాగులు ఆయన పొలిటికల్ ఇమేజ్ ని బాగా డ్యామేజీ చేశాయి. అచ్చెన్నకు నోరెక్కువ, పని తక్కువ అని ప్రతిసారీ నిరూపించుకుంటూనే ఉన్నారు. అవసరానికి వాడుకుని వదిలేసే రకం చంద్రబాబు అని పదవిలోకొచ్చిన తర్వాతే అచ్చెన్నాయుడికి బాగా తెలిసొచ్చింది.
అందుకే పోరాటాలకి బాగా దూరంగా ఉంటున్నారనే ప్రచారం కూడా ఉంది. గతంలో టీడీపీ ఆందోళనల్లో చురుగ్గా పాల్గొనే అచ్చెన్నాయుడు, ఇప్పుడెందుకో ఏపీ అధ్యక్ష హోదాలో కనీసం ముందుకు రావడం లేదు.
నియోజకవర్గానికి కూడా దూరం..
టెక్కలి నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు అటు సొంత నియోజకవర్గాన్ని కూడా మరచిపోయారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా.. విజయవాడ, విశాఖలోనే ఎక్కువగా మకాం పెడుతున్నారు. పోనీ పార్టీ కోసం ఏమైనా పనిచేస్తున్నారా అంటే అదీలేదు.
అటు నియోజకవర్గానికి కూడా వెళ్లట్లేదు. మొత్తమ్మీద ఏపీలో టీడీపీ యాక్టివిటీ బాగా తగ్గిపోయింది. ఈ దశలో పార్టీని ముందుండి నడిపించాల్సిన అధ్యక్షుడే అస్త్ర సన్యాసం చేశారు. తెలంగాణలో టీడీపీకి అధ్యక్షుడు లేకున్నా, ఏపీలో ఉన్నా కూడా ఒకటేనని అంటున్నారు.