ఆయుర్వేదం ఆనందయ్యకు కోపమొచ్చింది. తన చుక్కల మందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వనందుకు కాదు, తన పేరుతో ఎమ్మెల్సీ పదవి అంటూ జరుగుతున్న హంగామాకి అంతకంటే కాదు, మందు కావాలంటూ తనని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రజా ప్రతినిధుల మీదా కాదు. ఆనందయ్య మందు అంటూ మార్కెట్లోకి వచ్చేసిన నకిలీ మందులపై ఆనందయ్యకి కోపమొచ్చింది.
అలాంటి నకిలీ మందులతో తనకి సంబంధం లేదంటున్నారాయన. వాటిని వాడి లేనిపోని రోగాలు తెచ్చుకుంటే తనది బాధ్యత కాదని తెగేసి చెప్పేస్తున్నారు. ప్రభుత్వమే అలాంటి నకిలీ మందుల్ని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆనందయ్య వ్యవహారం బయటకొచ్చిన తర్వాత చాలామంది ఆనందయ్యలు పుట్టుకొచ్చారు. అసలు మందుకంటే కొసరు మందే ఎక్కువగా పంపిణీ అయిందనే అనుమానాలున్నాయి. అయితే దీనిపై ఇన్నాళ్లూ ఆనందయ్య కూడా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడీ నకిలీ బాగోతం ఎక్కువయ్యే సరికి ఆయన కూడా నొచ్చుకున్నారు. తన బిజినెస్ తగ్గిపోతుందనే ఆవేదనో లేక, నకిలీ మందుతో తన పేరుకి చెడ్డపేరు వస్తుందనే భయమో తెలియదు కానీ.. తొలిసారిగా నకిలీలపై ఫైర్ అయ్యారు.
ఇకపై ఆనందయ్య హాల్ మార్క్..
నకిలీలకు చెక్ పెట్టేందుకు, దేశవ్యాప్తంగా వస్తున్న ఆర్డర్లకు సకాలంలో సప్లై చేసేందుకు ఆనందయ్య కొత్త పద్ధతి అవలంబిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయుర్వేదం మందుని చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లలో చేతితోనే ప్యాకింగ్ చేసేవారు. కానీ తొలిసారి దీనికోసం రేగుపండు గుజ్జుని తయారుచేసి, ప్యాక్ చేసే ప్లాంట్ ని ఆయన కొనుగోలు చేశరని తెలుస్తోంది.
నెల్లూరు పట్టణ శివారులో ఉన్న ఈ ప్లాంట్ లో మందు తయారీ చేపడుతున్నారట. ఇకపై ఈ ప్లాంట్ లోనే ఆనందయ్య హాల్ మార్క్ లోగో ఉన్న కవర్లలో ఆయుర్వేదం మందు ప్యాక్ చేస్తారట. ఇదే అధికారికమైన ఆనందయ్య మందు అంటూ ప్రచారం చేపట్టబోతున్నారు.
చుక్కల మందు లేనట్టేనా..?
ఆనందయ్య ఇచ్చే అన్ని ఆయుర్వేద మందులకి సమ్మతి తెలియజేసిన ఏపీ ప్రభుత్వం, చుక్కల మందు విషయంలో మాత్రం రిస్క్ తీసుకోదలచుకోలేదు. కోర్టు పదే పదే అదే విషయాన్ని అడిగినా, కుదరదని చెప్పేసింది.
నిపుణుల పరిశీలనలో చుక్కల మందుతో సైడ్ ఎఫెక్స్ట్ వస్తాయని, దాని పంపిణీకి అధికారికంగా ఎలాంటి అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో ప్రస్తుతానికి ఆనందయ్య ఇస్తున్న కరోనా ప్రివెంటివ్ మెడిసిన్ మాత్రమే మార్కెట్లో బాగా పాపులర్ అవుతోంది.