తెలంగాణలో ఓ ప్రముఖ రాజకీయ నేత కుటుంబంలో ముగ్గురు ముచ్చటగా మూడు పార్టీలు ఎంచుకోవడం చర్చనీయాంశమైంది. తండ్రితో పాటు తనయులిద్దరూ వేర్వేరు పార్టీలను ఎంచుకోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విచిత్ర పరిస్థితి తెలంగాణ సీనియర్ రాజకీయ వేత్త ధర్మపురి శ్రీనివాస్ ఇంట్లో చోటు చేసుకోవడం గమనార్హం.
ఇవాళ ఆయన పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కలిసి చర్చించడంతో పాటు త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబంలో ముగ్గురు మూడు వేర్వేరు పార్టీలను ఎంచుకోవడంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది.
ధర్మపురి శ్రీనివాస్ సీనియర్ పొలిటీషన్. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగి కీలక పదవులు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1998లో, 2004లో ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పని చేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డి.శ్రీనివాస్ తన వంతు కృషి చేశారు. 2004లో దివంగత వైఎస్సార్ కేబినెట్‌లో ఆయన మంత్రిగా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజనతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి.
2015లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన డీఎస్ ….కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. తండ్రితో పాటు పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ కూడా టీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీ తరపున రాజ్యసభ సీటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన పదవిలో కొనసాగుతున్నప్పటికీ, టీఆర్ఎస్‌కు రాజకీయంగా దూరంగా ఉండడం గమనార్హం. కానీ సాంకేతికంగా ఆయన టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడే.
చిన్న కుమారుడు డి.అర్వింద్ మాత్రం బీజేపీలో చేరారు. అనంతరం కేసీఆర్ తనయ కవితను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అర్వింద్ ఓడించడంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఒకే సమయంలో తండ్రీతనయులు ఎంపీలుగా కొనసాగడం విశేషం.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడిని డి.శ్రీనివాస్ కుమారుడు సంజయ్ కలిసి, కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో ఒకే కుటుంబంలో ముగ్గురు వేర్వేరు పార్టీలను ఎంచుకున్నట్టు చర్చ జరుగుతోంది.