బీజేపీ ఏపీ నేతల తీరు చిత్రంగా ఉంది. ఒక వైపు కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ భారాన్ని దించేసుకోవాలని ఆరాటపడుతోంది. దాని కోసం అత్యంగ వేగంగా అడుగులు వేస్తోంది. ఎక్కడా పునరాలోచన అన్నది లేకుండా కేంద్రం దూకుడు చేస్తోంది అని ఉక్కు కార్మిక లోకం ఒక వైపు మండిపడుతోంది.
వాస్తవం ఇలా ఉంటే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పటికీ ప్రైవేట్ పరం కాదు అంటూ గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడే బాధ్యత మాది అంటూ గట్టి భరోసానే ఇస్తున్నారు.
అయితే ఈ స్టేట్మెంట్స్ ని ఉక్కు కార్మికులు మాత్రం అసలు నమ్మడంలేదు. సోము వీర్రాజు ఏపీ ప్రజలను మభ్యపెడుతున్నారని వారు విమర్శిస్తున్నారు. కేంద్రం ఈ విషయంలో చేయాల్సింది చేస్తోందని, మరి సోము వీర్రాజుకు అది కనబడడం లేదా అని వారు నిలదీస్తున్నారు.
నిజంగా ఉక్కు కర్మాగారాన్ని కాపాడాలి అన్న ఆలోచన ఉంటే కనుక సోము వీర్రాజు తమతో పాటుగా ఉక్కు ఉద్యమంలో పాల్గొనాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సోము వీర్రాజు మోడీకి నచ్చచెప్పి స్టీల్ ప్రైవేట్ కాకుండా చూడాలని వారు కోరుతున్నారు.
అంతే తప్ప ఏపీలో ఒక మాట, ఢిల్లీలో మరో చేత అన్నట్లుగా ఉంటే బీజేపీని ప్రజలు కూడా నమ్మరు అని వారు విమర్శిస్తున్నారు. మొత్తానికి సోము చేసిన ప్రకటనతో స్టీల్ మంటలు చల్లారకపోగా మరింతగా మండుతున్నాయనే చెప్పాలి.