మామూలుగా చంద్రబాబునాయుడు గారు నవ్వరు. ఆయన నవ్వుతూ ఉండగా కనిపించే ఫోటోలు అరుదుగా ఉంటాయి. ఎన్నికల ఫోటోలకు కూడా మొహం గంటుపెట్టుకుని దిగే చంద్రబాబునాయుడు.. చిరు నవ్వు నవ్వడం.. మనసులో ఉన్న కల్మషం మొత్తం కరిగిపోయేలా హాయిగా వికటాట్టహాసం నవ్వడం ఎన్నడూ చూసి ఎరగం. కానీ తమాషా ఏంటంటే.. ఎదుటివారిని నవ్వించడానికి మాత్రం ఆయన అప్పుడప్పుడూ భలే ప్రయత్నం చేస్తుంటారు.
నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోను అనే నినాదంతో పాపులర్ అయిన చంద్రబాబునాయుడు, తాను నవ్వకపోయినా.. ఎదుటి వారిని నవ్వించడానికి హాస్యగాడి పాత్రలోకి, విదూషకుడి రోల్ లోకి అప్పుడప్పుడూ పరకాయ ప్రవేశం చేస్తుంటారు. తాజాగా తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలబోయేది లేదని జోస్యమో, జోకో.. ఏదోటి చెప్పారు. జనం మాత్రం ఆయన జోకుకి పగలబడి నవ్వుకుంటున్నారు.
40 ఏళ్లుగా కుప్పంలో గెలుస్తూనే వస్తున్న చంద్రబాబునాయుడుకు, మునిసిపల్ ఎన్నికల రూపంలో జగన్ చుక్కలు చూపించిన తర్వాత.. ఆయన జాగ్రత్త పడుతున్నారు. ఆ జాగ్రత్తల్లో భాగంగానే.. గతంలో నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసినట్లుగా కాకుండా.. ఇప్పుడు తరచుగా అక్కడ పర్యటిస్తున్నారు. అక్కడ తిరగకపోతే సొంత నియోజకవర్గ ప్రజలే తనను మర్చిపోతారని, మునిసిపల్ ఎన్నికల తరహా పరాభవం.. ఎమ్మెల్యేగా కూడా ఎదురైతే.. సిగ్గుతో చావాల్సి వస్తుందని ఆయనకు భయం.
అలా తనలోని అపరిమితమైన భయం, పిరికితనం కొద్దీ.. నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు.. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వైసీపీని ఓడిస్తాం అని అనడం కామెడీ కాక మరేమిటి? ఆ డైలాగులో భాగంగానే.. పులివెందుల నియోజకవర్గంలో కూడా వైసీపీని ఓడిస్తామని అంటున్నారు.
బాబు కామెడీని చూసి జనం నవ్వుకుంటున్నారు. బాబు ఈ మాట చెప్పగానే.. వైసీపీ నాయకులంతా బెదిరిపోయి.. ఇక తట్టాబుట్టా సర్దుకుని రాజకీయాలు మానేయాలని అనుకుంటున్నారంటూ.. జనం సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఇక బాబు దెబ్బకు గింగిరాలు తిరిగి ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉపాధి చూసుకోవాల్సిందే.. అని జోకులు పేలుస్తున్నారు.
ఇక్కడ ఒక విషయం ప్రధానంగా గమనించాల్సి ఉంది. వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదని చెప్పిన చంద్రబాబు.. తెదేపా 175 సీట్లు గెలుస్తుందనే మాట అనలేదు. అలా అనడానికి మాత్రం ఆయనకు ధైర్యం చాలడం లేదు. అలా అంటే.. పవన్ కల్యాణ్ తనను ఛీకొట్టి వెళ్లిపోతాడేమో అని ఆయన భయం.
పవన్ తన పల్లకీకి బోయీగా మారి మోయకపోతే.. ఎన్నికల గండం గట్టెక్కుతానో లేదో అనే భయం! అందుకే వైసీపీ గెలవదని అంటున్నారే తప్ప.. ఎవరు గెలుస్తారో మాత్రం ఆయన చెప్పడం లేదు. ఇది ఇంకో కామెడీ.