కాంగ్రెస్ పార్టీ యువనాయకత్వం వైపు మొగ్గు చూపుతోంది! పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మోడీ కంటే యంగ్ బాయ్ ను ఎంపిక చేయడానికి సిద్ధమవుతోంది. అధినేత్రి సోనియా మొన్న మొన్నటిదాకా నిర్వహించిన పార్టీ అధ్యక్ష బాధ్యతలను, ఆమె కంటే వయసులో బాగా చిన్నవాడైన సీనియర్ నేతకు అప్పగించడానికి సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుత రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ రానున్నారని రాజకీయ వర్గాలలో చురుకుగా ప్రచారం జరుగుతోంది. అంటే కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టడానికి.. ఆ పార్టీ తరఫున ‘భావి ప్రధాని’ హోదాను శాశ్వతంగా కలిగి ఉన్న రాహుల్ సిద్ధంగా లేరని స్పష్టంగా అర్థం అవుతోంది. ఇప్పుడు జరగబోతున్న పార్టీ అధ్యక్ష ఎన్నికలలో అశోక గెహ్లాత్ కు ఆ బాధ్యతలు దక్కుతాయని సమాచారం.
ఈ నియామకం ద్వారా కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలకు.. శ్రేణులకు.. ప్రజలకు ఏం సంకేతం ఇవ్వదలుచుకుంటున్నదో మాత్రం అర్థం కావడం లేదు! భారతీయ జనతా పార్టీ ఒకవైపు చాలా చాలా దూకుడుగా దేశంలో ముందుకెళుతోంది. ఆ పార్టీకి ఎదురు నిలిచి, మోడీ హవాను తట్టుకొని కాంగ్రెస్ పార్టీకి తిరిగి పునర్ వైభవం తీసుకురావాలంటే ఎంతో సమర్థమైన నాయకత్వం.. పరిణతితో పాటు దూకుడైన వేగమైన వ్యూహచాతుర్యం ఉండాలి. కేవలం అనుభవం అనే పేరు మీద వృద్ధ నాయకత్వం చేతిలో పగ్గాలు పెడితే పార్టీ ఏమేర పరిగెత్తగలుగుతుంది. ఇదే ఇప్పుడు అందరి మదిలోనూ మెదలుతున్న సందేహం!!
కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకురావాలనే చర్చ మొదలైన ప్రతిసారీ, పార్టీ నాయకులు అందరూ రాహుల్ వైపు దీనంగా చూస్తారు! ఆయన వచ్చి తమను ఉద్ధరించాలని వారు కోరుకుంటారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ తన చేతిలోకి తీసుకోగానే పార్టీ బాగుపడిపోయినట్లే అని నమ్ముతారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం కొద్దిగా ప్రాక్టికల్ ఆలోచనలతోనే ఉన్నారని అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీలో ‘సీనియర్లు’ అనే టాగ్లైన్ తగిలించుకొని.. ఎందుకు కొరగాకుండా తయారవుతున్న అనుభవజ్ఞుల జాబితా మొత్తాన్ని ఇంట్లో కూర్చోబెట్టేసి.. పార్టీలో యువ రక్తానికి అవకాశం ఇస్తే వారు మరింత బ్రహ్మాండంగా ఆధునిక సామాజిక పోకడలకు తగినట్లుగా పనిచేస్తారని రాహుల్ వ్యూహం.
అయితే ఆయన మాట ఆ పార్టీలో చెల్లుబాటు కావడం లేదు సీనియర్లందరినీ ఇంటికి పంపాలని రాహుల్ ఎప్పటినుంచో గోల చేస్తున్నారు. పట్టించుకున్న వారు లేరు. సోనియాగాంధీ ప్రస్తుతానికి అమెరికాలో ఉండవచ్చు కానీ, ఇండియాలో ఉన్నప్పుడు కూడా రాహుల్ విన్నపాల మేరకు పార్టీలో సీనియర్లను కట్టడి చేయడానికి గాని, వారి ప్రాధాన్యం తగ్గించడానికి గాని ఎన్నడూ దృష్టి పెట్టలేదు. ఇందుకు అలిగినట్లుగా, రాహుల్ పార్టీ పదవిని స్వీకరించడానికి నిరాకరించినట్లుగా తెలుస్తోంది!
ఏతావతా ఆ పదవి వచ్చి అశోక్ గెహ్లాత్ మీద పడుతోంది. ఆయన వయస్సు ప్రస్తుతం 71 సంవత్సరాలు. అదే సోనియాగాంధీ వయస్సు 75 సంవత్సరాలు. దేశానికి సారధ్యం వహిస్తున్న నరేంద్ర మోడీ వయస్సు 72 సంవత్సరాలు. కాబట్టి నిన్నమొన్నటిదాకా అధ్యక్ష బాధ్యతలను చూసిన సోనియా గాంధీ తనకంటె యంగ్ బాయ్ చేతికి ఆ పగ్గాలు అప్పగించేసి విశ్రాంతి తీసుకోవడం సబబే అనిపిస్తోందా? అంతే మరి!!