సినిమాకు కథ అంటే రెండున్నర గంటలు చెప్పేంత వుండక్కరలేదు. చిన్న పాయింట్ చుట్టూ అల్లుకునే స్క్రీన్ ప్లే చాలు అని గత కొన్నేళ్లుగా కొత్త నెత్తురు నిండిన దర్శకులు రుజువుచేస్తూ వస్తున్నారు. పెళ్లిచూపులు నుంచి జాతిరత్నాల వరకు ఎన్నో సక్సెస్ లు ఇలా వచ్చినవే. అలాంటి కొత్త తరం సినిమా లా అనిపిస్తోంది త్వరలో రాబోతున్న ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’.
పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ సంపాదించాలి. ఆ టికెట్ ఎవరి కోసం..హీరో అమితంగా ఇష్టపడే అమ్మాయి కోసం. ఇదే సినిమాలో కోర్ పాయింట్. దీని వెనుక హీరో ఇంటి వ్యవహారాలు, ప్రేమ సంగతులు, ఇంకా..ఇంకా..టోటల్ ఫన్.
ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ట్రయిలర్ విడుదలయింది. ఫన్ పీక్స్ లో వుంది. పవన్ కళ్యాణ్ మాస్ సాంగ్ ను విషాదగీతంలా ఆలపించే సీన్ ను థియేటర్ లో ఊహించుకుంటే నవ్వు ఆగదు. ‘చావాలంటే చాలా ధైర్యం కావాలి..అలాంటి ధైర్యాన్ని బతుకు మీద పెట్టు..…’ అని చెబుతూ…’చచ్చిపో’ అని ముక్తాయించడం భలేగా వుంది.
పది టికెట్ లు తీసుకుని, సీటుకు ఇద్దరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను కూర్చోమని చెప్పిన డైలాగు కూడా అదిరింది. పవన్ కళ్యాణ్ అన్న పేరు అనేది టఫ్ క్వశ్చనా అంటూ వెన్నెల కిషోర్ చెప్పడం భలేగా వుంది.
మొత్తానికి కొత్త కుర్రాళ్లు, జాతిరత్నం అనుదీప్ కలిసి ఓ పల్లెటూరు ఫన్ రైడ్ మూవీని అందిస్తున్నారని క్లారిటీ వచ్చేసింది ట్రయిలర్ తో.