ఎన్నికలకు ఏపీలో ఇంకా ఇరవై నెలలకు పైగా టైం ఉంది. అయినా ఎన్నిక వేడిని రాజకీయ నాయకులు రాజేస్తున్నారు. మాటల యుద్ధానికి తెర తీసి నిత్యం విమర్శలు చేసుకుంటున్నారు. అర్జంటుగా ఏలిన వారు కుర్చీ దిగిపోవాలి మేము త్వరగా ఎక్కేయాలి అన్న తాపత్రయం నేతాశ్రీలలో కనిపిస్తోంది.
ఇక ఎన్నికలు ఎపుడో ఉన్నాయి. ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయినా సరే ఆదికి ముందు అన్నట్లుగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీలో ఓట్ల గల్లంతు అంటూ విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. విశాఖలోనే యాభై వేల ఓట్లు గల్లంతు అయ్యాయని, ఇదంతా ఎందుకు చేశారు అని ఆయన నిలదీస్తున్నారు.
ఆంధ్రేతర ప్రాంతాల వారి ఓట్లు తొలగిస్తున్నారు అని కూడా ఆయనే చెబుతున్నారు. ఇలా అడ్డగోలుగా ఓట్ల రద్దు చేస్తారా. బీజేపీ వారు అంటే వారికి సంక్షేమ పధకాలు ఇవ్వరా అని గదమాయిస్తున్నారు. రేషన్ కార్డులు లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీని మీద చీఫ్ ఎన్నికల అధికారికి లేఖ రాశామని ఆయన చెబుతున్నారు.
నిజంగా కనుక ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తే తిరిగి నమోదు చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ పని చూడకుండా టెక్నికల్ గా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో ఆలోచించుకోకుండా ఈ గొంతు చించుకోవడమేంటి అని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
అయినా సరే బీజేపీ వారి ఓట్లు తీసేయడం, వారికే పధకాలు కట్ చేయడం వైసీపీకి అంత అవసరమా అసలు ఏపీలో బీజేపీని చూసి జడుసుకునే పార్టీ ఏదైనా ఉందా మాస్టారూ అని కూడా అడుగుతున్న వారూ ఉన్నారు. ఏదో రకమైన సంచలన ప్రకటనలు చేయాలి, మీడియాకు ఫోకస్ అవాలి అన్న ఆరాటమేనా ఇందులో కూడా ఉంది అని బీజేపీ పొడ గిట్టని వారు అంటున్నారు.