వినేవారుంటే చంద్రబాబు ఎన్ని ప్రగల్భాలైనా పలుకుతారు. కిందపడ్డా పైచేయి తనదే అనడం చంద్రబాబు ప్రత్యేకత. గత నాలుగు దశాబ్దాలుగా ఇదే ధోరణిలో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతున్నా రంటే, అక్కడ పునాదులు కదిలిపోతున్నాయని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు.
మొదటి రోజు బుధవారం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రెచ్చిపోయారు. కుప్పాన్ని పులివెందుల్లా మారుస్తారా? అని గర్జించారు. ఇంతకూ ఆయన ఏమన్నారంటే…
‘పులివెందులను కుప్పంగా మార్చాలనుకున్నాను.. కానీ వాళ్లు కుప్పాన్ని కూడా పులివెందుల్లా మార్చేస్తున్నారు. పులివెందులలోనే నీ పార్టీని సమాధి చేస్తా. నువ్వు అక్కడ పులివో.. పిల్లివో తేల్చుకుందాం’ అని జగన్‌కు సవాల్ విసిరారు.
రెండు పరస్పర విరుద్ధ అభిప్రాయాలు చెప్పడం చంద్రబాబుకే చెల్లింది. తన ఐదేళ్ల పాలనలో పులివెందులను కుప్పంగా మార్చాలని అనుకున్నట్టు చెప్పారు. మళ్లీ వెంటనే వైసీపీ వాళ్లు కుప్పాన్ని కూడా పులివెందుల్లా మార్చేస్తున్నారని వాపోయింది ఆయనే.
వైసీపీకి పులివెందుల ఏ విధంగా కంచుకోటనో, కుప్పాన్ని కూడా అదే రీతిలో చేస్తున్నారనేది చంద్రబాబు భావనా? జగన్ పులో, పిల్లో ఇప్పటికే నిరూపించుకున్నారు. చివరికి చంద్రబాబు అడ్డాలో కూడా వైసీపీ జెండాను రెపరెపలాడిస్తున్నారు.
ఇక కుప్పంలో తానేంటో తేల్చుకోవాల్సిన సమయం చంద్రబాబుకు ఆసన్నమైంది. కుప్పం టార్గెట్‌గా వైసీపీ దూసుకొస్తోంది. నిలువరించగలిగే సత్తా తనకు ఉందా? లేదా? అనేది నిరూపించుకునే పరీక్షా సమయం రాబోతోంది. పులివెందుల్లో వైసీపీని సమాధి చేస్తాలాంటి హెచ్చరికలు కామెడీని తలపిస్తాయి. చంద్రబాబు ఎదురు దాడి చేసే పరిస్థితి నుంచి ఆత్మరక్షణలో పడ్డారని ఆయన హూంకరింపులే నిదర్శనం.