‘సలహాదారు’ అనే పదం చాలా విలువైనది. మనం చదువుకునే చందమామ కథల్లో రాజుకంటె, ఆయన మంత్రి చాలా తెలివైన వాడు అయి ఉంటాడు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో పదాల రూపురేఖలు మారాయి. కథల్లోని రాజు అంటే- ఇప్పుడు ముఖ్యమంత్రే! ఇవాళ్టి రోజుల్లో మంత్రిత్వశాఖలే సామంతరాజ్యాలు… ఆయా శాఖల మంత్రులందరూ సామంతరాజులు. అచ్చంగా ప్రాచీన కథల్లోని ‘మహామంత్రి- మంత్రి’ లాంటి పాత్ర పోషిస్తున్నది సలహాదారులు!.
సలహాదారులు ప్రభుత్వ వ్యవస్థకు అవసరమే. నిస్సందేహం. కానీ.. ఆ సలహాదారుల నియామకంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్న అతి ఔదార్యం ఆయనకే చేటుచేస్తోంది. పరువు తీస్తోంది. ఇవాళ సలహాదారుల విషయంలో కోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్రమైనవి.
సాధారణంగా నాయకులు అధికారంలోకి రాక ముందునుంచి కూడా.. వారికి మేథోపరమైన అండగా నిలుస్తూ, వ్యూహరచనలో చేదోడువాదోడుగా ఉంటూండే ప్రముఖులు కొందరు ఉంటారు. అదే నాయకుడు అధికారంలోకి వస్తే.. తప్పనిసరిగా వీరికి సలహాదారు పదవి, హోదా వచ్చి తీరాల్సిందే. అధికారం లేకముందే జగన్ కు ప్రతి విషయంలోనూ సలహాలిస్తూ అండగా నిలిచిన వారు.. పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత .. అదే పనిని అధికార హోదాలతో చేస్తారు. కానీ.. సరిగ్గా ఇక్కడే జగన్ మోహన్ రెడ్డి లోని అతి ఔదార్యం అదుపు తప్పింది.
నిజంగా తనకు అవసరమైన సలహాలు చెప్పగలిగిన, చెప్పడం మీద శ్రద్ధ కలిగిన, తనకు ఉపయోగపడే వారిని మాత్రమే కాదు.. తననుంచి ఏదో ఒక ‘లబ్ధి’ ఆశిస్తున్న అనేకానేకమందికి ఆయన ‘సలహాదారు’ అనే ట్యాగ్ లైన్ తగిలిస్తూ వచ్చారు. వారిలో పని ఒత్తిడి అధికంగా పంచుకుంటున్న వారు కొందరున్నారు. అలాగే ఏ పనీ లేని వారూ ఉన్నారు. కేవలం జీత భత్యాలు, హోదా అనుభవించడం మాత్రమే వారి పని!
‘అన్నా’ అంటే అర్థించి వస్తే చాలు.. వారికి సలహాదారు పదవి ఇచ్చేస్తారన్నట్టుగా వ్యవహారం తయారైపోయింది. అలా పదవులు పొందుతున్న వారే.. స్వయంగా జగన్ పరువు తీసిన సందర్భాలూ ఉన్నాయి. సాక్షి మీడియా గ్రూపులో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి, జగన్ అధికారంలోకి రాగానే సలహాదారు పదవిని పొందిన సీనియర్ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి.. కొంతకాలం తర్వాత.. తన సలహాలు ఎవ్వరూ తీసుకోవడం లేదంటూ.. పదవికి రాజీనామా చేశారు. తద్వారా జగన్ నిర్ణయాత్మక శక్తికి, వ్యవహార సరళికి మచ్చ తెచ్చారు. అయినా సరే.. సలహాదారుడు అనే పదాన్ని పప్పులు బెల్లాల్లాగా అందరికీ పంచుకుంటూ పోవడం జగన్ కు అలవాటుగానే మారింది.
దేవాదాయ శాఖకు ప్రత్యేకంగా ఒక సలహాదారును నియమించేసరికి అదికాస్తా వివాదం అయింది. వ్యవహారం కోర్టుకు వెళ్లేసరికి.. తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి. ఆ నియామక ఉత్తర్వునే కోర్టు స్టే ద్వారా నిలిపి వేసింది.
సలహాదారు పదవికి ముందే చెప్పుకున్న నిర్వచనం ప్రకారం.. సామంతరాజులైన మంత్రులకు ఉపయోగపడేలా నియమించి ఉంటే గొడవేమీ లేదు.. కానీ, శాఖకు నియమించడం అనేది వివాదం అయింది. సలహాదారు అనే పదవిని పంచేయడంలో ప్రభుత్వం.. ముందువెనుకలు చూసుకోకుండా, సాంకేతిక సమస్యలు ఎలా వస్తాయో ఆలోచించకుండా దూకుడుగా వెళ్లి మొట్టికాయలు తింటున్నదనడానికి ఇది నిదర్శనం.
ముఖ్యమంత్రి సలహాదారులుగా ఎందరిని నియమించుకున్నా చెల్లుతుంది. వివిధ వ్యవహారాలను నిర్దిష్టంగా అప్పగిస్తూ సలహాదారులు సీఎంకు ఉన్నారు. అలా సీఎంకు దేవాదాయ శాఖ సలహాదారు అని ముద్రవేసి ఉన్నా ఈ న్యాయపరమైన రభసకు ఆస్కారం లేదు. ఆ జాగ్రత్త లేకుండా, దేవాదాయ శాఖకే సలహాదారులాగా నియమించడం వలన చికాకు వచ్చింది.
ఈ సలహాదారు పదవుల నియామకంలో సీఎం జగన్ తన సొంత వివేచనతో వ్యవహరిస్తే ఎప్పటికీ గొడవేమీ రాకపోవచ్చు. కానీ.. ఒత్తిళ్లకు లొంగి, ఆబ్లిగేషన్లకు తలొగ్గి, మొహమాటానికి పోయి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం.. ఇలాంటి అక్షింతలు తప్పవు.