కుప్పంలో ఎలాగైనా ఈ దఫా టీడీపీ అధినేత చంద్రబాబును ఓడించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టుదలతో ఉన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సారథ్య బాధ్యతలు అప్పగించారు. టీడీపీకి కుప్పం కంచుకోట అనడంలో రెండో అభిప్రాయానికే చోటు లేదు. కుప్పంలో ఇతర పార్టీలకు స్థానం లేదు, ఉండబోదు అనే చోట వైసీపీ అడుగు పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకంగా క్లీన్ స్వీప్ చేసి ఎంట్రీనే అదుర్స్ అనిపించారు.
ఈ విజయం జగన్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. అలాగే కుప్పంలో చంద్రబాబును ఓడించడం అసాధ్యం కాదనే మానసిక స్థైర్యం రథసారథి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలోనూ, పార్టీ కేడర్‌లోనూ కలిగింది. ఇంత వరకూ బాగా వుంది. కుప్పం పర్యటన నిమిత్తం స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం అక్కడికి వెళ్లారు. పర్యటన అడ్డుకునేందుకు వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇలాంటి చేష్టలు వైసీపీకి నష్టం కలిగిస్తాయి. వైసీపీలో శల్యసారథులున్నారనే అనుమానాలకు ఆ పార్టీ నాయకుల వ్యవహారాలే నిదర్శనం. చంద్రబాబు ఏదైతే కోరుకుంటున్నారో కుప్పంలో వైసీపీకి చెందిన కొందరు స్థానిక నేతలు అదే చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ పుణ్యమా అని చంద్రబాబు పర్యటనలో వివాదం చెలరేగింది.
చంద్రబాబు పర్యటనకు వస్తున్నారని తెలిసి, వైసీపీ నేతలు రెచ్చగొట్టేలా జెండాలు, ఫ్లెక్సీలు కట్టడం అవసరమా? అనే ప్రశ్నలొస్తున్నాయి. వైసీపీ, టీడీపీ వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకునేందుకు చంద్రబాబు పర్యటన కారణమైంది. ఇలాంటి పరిణామాలు ముమ్మాటికీ వైసీపీకి రాజకీయంగా నష్టం కలిగించేవే. చంద్రబాబుపై సానుభూతి పెంచేందుకు దోహదం చేస్తాయి. ఎవరినైనా రాజకీయంగా అంతమొందించాలంటే మొదట చేయాల్సిన పని వారి గురించి ఎక్కడా చర్చ జరగకుండా చూడాలి. జనం విస్మరించేలా వ్యూహాత్మక మౌనంతో నడుచుకోవాలి. ఇందుకు పూర్తి విరుద్ధంగా కుప్పంలో వైసీపీ నడుచుకోవడం ద్వారా చంద్రబాబుకు మరింత మేలు చేసినట్టైంది.
నిజంగా కుప్పం వైసీపీ నేతలకు తెలివి తేటలుంటే బాబు పర్యటను సాఫీగా సాగిపోయేలా వ్యవహరించేవారు. కుప్పం వైసీపీ నేతలకు పార్టీపై పట్టు లేదనేందుకు ఇదే ఉదాహరణ. బాబు మొదటి రోజు పర్యటనలో ఉద్రిక్తతలు తలెత్తడంతో ఇదే అదునుగా టీడీపీ దూకుడు పెంచింది. టీడీపీ శ్రేణులన్నీ గురువారం కుప్పానికి రావాలని ఆ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని పిలుపునివ్వడం గమనార్హం. ఆ ప్రకటనలో ఏముందంటే… ‘కుప్పంలో గురువారం చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు చూస్తున్నారు. దీనికి దీటుగా మనం సమాధానం చెప్పాలి. అందుకని నాయకులు, కార్యకర్తలు కుప్పం గెస్ట్‌హౌస్ వద్దకు రావాలి’ అని పులివర్తి నాని పిలుపునిచ్చారు.
దారిన పోయే సమస్యల్ని కొని తెచ్చుకోవడం అంటే ఇదే. కుప్పంలో చంద్రబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే వైసీపీకి అంత మంచిది. కుప్పం ప్రజలు ఆయన్ను మరిచిపోయేలా చేసినప్పుడే అధికార పార్టీ ఆశయం నెరవేరుతుంది. మరి అక్కడి వైసీపీ నేతల అజ్ఞానమో, అహంకారమో తెలియదు కానీ, చంద్రబాబును ఊరికే గిల్లుతున్నారు. బాబుకు మేలు చేయడానికే ఇలా ప్రవర్తిస్తున్నారేమో అనే అనుమానం లేకపోలేదు. వైసీపీ రెచ్చగొట్టే చర్య కుప్పంలో టీడీపీ శ్రేణుల్ని ఏకం చేస్తోంది. బాబు చేయలేని పని వైసీపీ చేస్తోందనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.