వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు ముందుగా ప్రకటించినట్టు మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టారు. తెలంగాణను పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రతి మంగళవారం పోరాటం చేస్తానని షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకటించినట్టుగానే ఆమె నిరుద్యోగులకు అండగా నిలిచారు.
దీక్షకు ముందు ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కొండల్ (30) కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. మృతుడి తల్లిదండ్రులను ఓదార్చడంతో పాటు కొంత ఆర్థిక సాయాన్ని కూడా అందించారు.
అనంతరం తెలంగాణలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా తాడిపర్తి బస్టాండ్‌లో షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ అవలంబిస్తున్న నిరుద్యోగ వ్యతిరేక విధానాలను తప్పు పట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో 1.9 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ కేసీఆర్ సర్కార్ భర్తీ చేయడం లేదని విమర్శించారు.
తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేసీఆర్ మొద్దు నిద్రలో ఉన్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రతి మంగళవారాన్ని నిరుద్యోగుల దినంగా పాటించనున్నట్టు ఆమె తెలిపారు. ఉద్యోగాల భర్తీ చేసే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని షర్మిల తేల్చి చెప్పారు.