జాన్సన్ టీకాతో పక్షవాతం.. ఇదెక్కడి గోల..!

కరోనా రాకుండా టీకా ప్రభావం ఎంత ఉంటుందనే విషయంపై ఇంకా శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు కరోనా టీకాతో కలిగే సైడ్ ఎఫెక్ట్స్ పై కూడా ఆందోళన కలిగించే విషయాలు రోజూ వెలుగులోకి వస్తున్నాయి.…

కరోనా రాకుండా టీకా ప్రభావం ఎంత ఉంటుందనే విషయంపై ఇంకా శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు కరోనా టీకాతో కలిగే సైడ్ ఎఫెక్ట్స్ పై కూడా ఆందోళన కలిగించే విషయాలు రోజూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేసిన సింగిల్ డోస్ టీకాపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. 

ఈ టీకా తీసుకున్నవారిలో, కొంతమందిలో పక్షవాతం లాంటి లక్షణాలు గుర్తించారు. నరాలపై రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ టీకా అనుమతి పత్రంలో హెచ్చరికను కూడా చేర్చింది అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (FDA).

జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేస్తున్న సింగిల్ డోస్ టీకాను ఇప్పటివరకు అమెరికాలో కోటీ 28 లక్షలమందికి ఇచ్చారు. అయితే వీరిలో 100మందికి టీకా వికటించింది. వారిలో దుష్పరిణామాలు తలెత్తాయి. దాదాపుగా అందరూ ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితి. వీరిలో ఒకరు మరణించారు కూడా.

టీకా తీసుకున్న 6 వారాలలోపు ఈ సైడ్ ఎఫెక్ట్స్ బయటపడుతున్నాయని చెబుతున్నారు. 50 ఏళ్లుపైబడిన పురుషుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపించాయట. దీన్ని గిలియన్ బారే సిండ్రోమ్ గా పేర్కొంటున్నారు అక్కడి వైద్య నిపుణులు.

గిలియన్ బారే సిండ్రోమ్ అంటే..

సాధారణంగా సీజనల్ ఫ్లూ నివారణకు సంబంధించి టీకాలు తీసుకునేవారిలో ఈ గిలియన్ బారే సిండ్రోమ్ కనపడుతుందని FDA అధికారులు చెబుతున్నారు. దీనివల్ల కండరాల్లో బలహీనత మొదలై, పక్షవాతం వస్తుందని అంటున్నారు. ఇప్పుడిదే సిండ్రోమ్.. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా తీసుకున్నవారిలో కూడా కనిపించడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

విషాదంలో సంతోషం ఏంటంటే.. అతి తక్కువమందిలో ఈ లక్షణాలు కనపడటం, వారు కూడా త్వరగా కోలుకుని ఇంటికి వెళ్లడం. ఇలాంటి దుష్పరిణామాలు తలెత్తుతున్నప్పటికీ జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు తీసుకోవడం మాత్రం మానొద్దని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. అయితే ఈ ఆరోపణతో జాన్సన్ కంపెనీ ఇరకాటంలో పడింది.