జూ.ఎన్టీఆర్ వ‌చ్చే స‌రికి ప‌రిస్థితి ఎలా ఉంటుందో!

ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌య‌సు దాదాపు 40. రాజ‌కీయాల్లో ఈ సినీ హీరో పేరు మార్మోగ‌డం కొత్త కాదు. 2009 అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్ర‌చారం…

ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌య‌సు దాదాపు 40. రాజ‌కీయాల్లో ఈ సినీ హీరో పేరు మార్మోగ‌డం కొత్త కాదు. 2009 అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్ర‌చారం చేసి పెట్టాడు. అయితే ఆ స‌మ‌యంలో తార‌క్ విన్యాసాలు విక‌టించాయి. అప్ప‌టికి నిండా ముప్పై యేళ్లు నిండ‌ని ఎన్టీఆర్ .. ఏకంగా ఇందిరాగాంధీని కూడా విమ‌ర్శించేయ‌డం కామెడీ అయ్యింది!

త‌న వ‌య‌సుకు త‌గ్గ మాట‌ల కాకుండా, తాత త‌ర‌హా వేష‌ధార‌ణ‌తో, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ డైలాగుల‌తో కాంగ్రెస్ పై విరుచుకుప‌డ్డారు ఎన్టీఆర్. ప‌రుచూరి డైలాగులు సీనియ‌ర్ ఎన్టీఆర్ కు వ‌ర్క‌వుట్ అయ్యాయేమో కానీ, తార‌క్ కు సెట్ కాలేదు. ప్ర‌త్యేకించి తార‌క్ ప్ర‌చారం చేసిన దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అప్పుడు టీడీపీ ఓట‌మి పాలైంది. మ‌ధ్య‌లో తార‌క్ కుయాక్సిడెంట్. అయినా చంద్ర‌బాబు వ‌దల్లేదు. ఆసుప‌త్రి బెడ్ మీద నుంచి కూడా ప్ర‌చారం చేయించి, ప‌తాక స్థాయికి తీసుకెళ్లారు. అయినా టీడీపీకి అధికారం అందలేదు. 

ఎన్నిక‌లు కాగానే ఎన్టీఆర్ ను చంద్ర‌బాబు ప‌ట్టించుకోవ‌డం మానేశాడు. దీంతో త‌త్వం బోధ‌ప‌డింది తార‌క్ కు. ఇక 2014లో ఎన్టీఆర్ ప‌ల‌క‌లేదు. అయినా టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది. దీంతో తార‌క్ పై చంద్ర‌బాబు, లోకేష్ మార్కు వేధింపులు కూడా త‌ప్ప‌లేదు.

ఆఖ‌రికి నాన్న‌కు ప్రేమ‌తో సినిమా కు థియేట‌ర్లు దొర‌క‌డం కూడా క‌ష్టం అయ్యే వ‌ర‌కూ వ‌చ్చింది ప‌రిస్థితి. లోకేష్ ను త‌న వార‌సుడిగా చంద్ర‌బాబు ప్రొజెక్ట్ చేసుకుంటూనే ఉన్నారు. ఆ ప్ర‌య‌త్నాలు విక‌టిస్తూనే ఉన్నాయి. అయినా కూడా చంద్ర‌బాబుకు పుత్రుడిపై మ‌మ‌కారం త‌గ్గ‌డం లేదు. లోకేష్ తో ప్ర‌యోజ‌నం లేద‌ని  స్ప‌ష్టం అవుతోంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా త‌నే క‌ష్ట‌ప‌డి పార్టీ ని అధికారంలోకి తీసుకొచ్చింది బ‌ల‌వంతంగా అయినా త‌న త‌న‌యుడిని జ‌నం మీద రుద్దాల‌ని చంద్ర‌బాబు ఫిక్స‌య్యారు. ఆయ‌న వ్యూహంలో మార్పు లేన‌ట్టుగా ఉంది.

ఆ సంగ‌త‌లా ఉంటే… అమిత్ షాతో తార‌క్ స‌మావేశం గురించి రాజ‌కీయ ఆస‌క్తి ఉన్న జ‌నాల్లో చ‌ర్చ జ‌రుగుతూ ఉంది. ఈ విష‌యంలో వారు చెప్పే మాట‌.. ఈ స‌మావేశంతో చంద్ర‌బాబు, తార‌క్ ల మ‌ధ్య దూరం మ‌రింత పెరిగింద‌నేది!

ఒక జాతీయ పార్టీలో జాతీయ స్థాయిలో కీల‌క స్థాయిలో ఉన్న నేత ఇలా పిలించుకుని మాట్లాడ‌టం ఎన్టీఆర్ కు వంద ఏనుగుల బ‌లాన్ని ఇచ్చింద‌ని, దీంతో చంద్ర‌బాబును ఎన్టీఆర్ మ‌రింత లైట్ తీసుకునే అవ‌కాశం ఉంద‌ని సామాన్యులు అనుకుంటున్నారు. ఎన్టీఆర్ క‌లిసొస్తాడ‌ని ఏ మూలో ఉన్న ఆశ‌లు కూడా చంద్ర‌బాబుకు ఇంత‌టితో హ‌రించుకుపోయాయనేది టీకొట్టు కామెంట్.

మ‌రి ఇంత‌కీ తారక్ కు ఇప్పుడు పొలిటిక‌ల్ యాంబిష‌న్స్ ఉన్నాయా? అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. ఇప్పుడు అత‌డి వ‌య‌సు 40. రాజ‌కీయాల‌కు ఇదేమీ త‌క్కువ కాదు. ఇంకో ప‌దేళ్లు త‌ను సినిమాలు చేసుకునే అవ‌కాశాలు ఉండ‌వ‌చ్చు! అప్పుడు ఆయ‌న‌కు జ‌నాలు క‌ష్టాల్లో ఉన్నార‌నిపించ‌చ్చు. 

త‌న తాత వ‌లే ప్ర‌జాసేవ‌కు ముందుకు వ‌చ్చాన‌ని చెప్పుకోవ‌చ్చు! అయితే ఎటొచ్చీ అప్ప‌టికి సినిమా హీరోల‌ను రాజ‌కీయాల్లో సీరియ‌స్ గా తీసుకునే ప‌ద్ధ‌తి జ‌నాల్లో ఈ మాత్ర‌మైనా ఉంటుందా? అనేది శేష‌ప్ర‌శ్న‌! ఇప్ప‌టికే సినిమా హీరోల‌ను సినిమా హీరోలుగా మాత్ర‌మే చూస్తున్నారు స‌గ‌టు మ‌నిషి. ఇంకో ప‌దేళ్ల‌కు అంటే ఈ పాటి సీరియ‌స్ నెస్ కూడా ఉండ‌దేమో!