‘‘ఎక్కడో అమీర్ పేటలో మైకు పెడితే.. మరెక్కడో బేగంపేటలో ఉన్న వాళ్లకు ఎలా వినిపిస్తుంది?’’ అని తనదైన శైలిలో సందేహం వ్యక్తం చేస్తాడు ధర్మవరపు సుబ్రమణ్యం మన్మధుడు సినిమాలో. వినిపిస్తుంది. ఎందుకంటే.. అమీర్ పేటలో మైకుకి, బేగంపేటలో స్పీకరుకి మధ్యలో చిన్న కనెక్షను ఉంటుంది కాబట్టి. కనెక్షన్లు కేవలం మైకులకి, స్పీకర్లకు మాత్రమేనా.. రాజకీయ నాయకులకు కూడా ఉంటాయి. కనెక్షన్లు లేకపోయినా.. కొన్నిసార్లు.. సౌండు మాత్రం మోతెత్తిపోతుంది.
ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అదే జరుగుతోంది. ఎక్కడో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగితే.. దానికి సంబంధించిన ప్రకంపనాలు మాత్రం తెలంగాణలో ప్రతిధ్వనిస్తున్నాయి. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉన్నదంటూ.. కమల నాయకులు చేస్తున్న వరుస ఆరోపణల వల్ల ఈ రాద్ధాంతం చినికి చినికి గాలివానగా మారుతోంది. లిక్కర్ స్కామ్ తో కవితకు సంబంధం ఉన్నదంటూ.. అటు ఢిల్లీలోనూ, ఇటు తెలంగాణలో కూడా కమల నాయకులు ఆరోపణలు చేశారు. సహజంగానే గులాబీ దళం నుంచి వీటికి ఖండనలు వెల్లువెత్తాయి.
కవిత ఇంటివద్దకు బిజెపి నాయకులు వెళ్లి ఆందోళన చేయడం, వారిపై ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టి పోలీసులు అరెస్టు చేయడం, బండి సంజయ్ ను నిర్బంధించడం.. ఇవన్నీ కూడా ఈ వ్యవహారానికి మరింత మసాలా, పోపు జత చేశాయి. కల్వకుంట్ల కవిత బిజెపి నాయకులపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేసేశారు. ఇంకా 32 జిల్లా కోర్టుల్లో కూడా బిజెపి నాయకులపై దావాలు వేయడానికి సిద్ధం అవుతున్నారు.
ఇంతకీ లిక్కర్ స్కామ్ మోత హైదరాబాదులో మోగింది సరే.. దీనివలన రాజకీయ మైలేజీ సాధించినది ఎవరు? స్కామ్ లో కవిత పాత్ర ఉన్నదనే ఆరోపణలతో కేసీఆర్ కుటుంబ అవినీతిన దేశవ్యాప్తం అవుతున్నదని తెలంగాణ ప్రజల్లో సమర్థంగా ప్రచారం చేయగలిగామని కమలదళం సంబరపడుతోంది. అయితే కేసీఆర్ ఫ్యామిలీ ఈ విషయంలో తగ్గడం లేదు. కవితకు యావత్ పార్టీ చాలా గట్టిగా అండగా నిలబడింది. కవిత ఇంటికి దాదాపుగా ప్రభుత్వంలోని పెద్దలందరూ వచ్చి ఆమెతో పాటు ఆందోళనలో కూర్చుని తమ సంఘీభావం వ్యక్తం చేశారు. కమల ప్రచారాన్ని ఘాటుగా తిప్పి కొట్టడం ద్వారా.. వారి కుట్ర బుద్ధులను ఎండగట్టామని తెరాస భావిస్తోంది.
ఇక్కడ ఓ అంశం కీలకంగా గమనించాలి. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రతి నాయకుడూ.. పరువునష్టం దావా వేస్తా అంటూ బీరాలు పోతారు. ఆ వ్యవహారం కాస్త సద్దుమణగగానే మిన్నకుండిపోతారు. మొన్నటి గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ లో కూడా తెలుగుదేశం నాయకులు, మీడియా సంస్థలపై పరువునష్టం దావా వేస్తానని బీరాలు పలికిన మాధవ్ తర్వాత కిమ్మనలేదు. కానీ, ఆ తరహాలో కవిత ఊరుకోలేదు.
తన మీద ఆరోపణలు చేసిన కమలనాయకులు అందరినీ ప్రత్యర్థులుగా చేరుస్తూ నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో దావా వేశారు. వారు ఇలాంటి అసత్య ఆరోపణలు మళ్లీ మాట్లాడకుండా ఆదేశించాలని కోర్టును కోరారు. వారి విమర్వలు, మాటలు.. ఆన్ లైన్ మీడియాలో ఉన్నవన్ని తొలగించాలని కూడా కోరారు. పైపెచ్చు 32 జల్లా కోర్టుల్లో కూడా బిజెపి వారందరిపై పరువునష్టం దావాలు వేయబోతున్నారు. ఇంత దూకుడు సాధారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ప్రదర్శించడం అరుదు. అందుకే, ఇలాంటి దూకుడు ప్రదర్శించడం ద్వారా.. బిజెపినే తప్పు చేస్తున్నది అనే భావనను కవిత ప్రజల్లోకి పంపగలిగారు.
మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ కు ముడిపెట్టి గులాబీ పార్టీని బద్నాం చేయగలిగామని కమలదళం మురిసిపోతుండగా.. వారి ఆరోపణలు బూమరాంగ్ అయ్యాయని.. తమ సచ్ఛీలతే బయటపడిందని గులాబీ శ్రేణులు అనుకుంటున్నాయి.