.. ఎన్నికల్లో ఎదురైన పరాభవం తర్వాత.. ఇంకా తమ పార్టీలో మిగిలేదెవ్వరు? ఇతర పార్టీల్లోకి పారిపోయేదెవ్వరు? అనే విషయాన్ని పవన్ లెక్క చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే తాజాగా సమీక్ష సమావేశాల పేరుతో విజయవాడలో మకాంపెట్టారు. వరుస రివ్యూ మీటింగులతో కాస్త హడావిడి చేయబోతున్నట్లు సమాచారం.
ఎన్నికలలో పరాభవం తెలిసివచ్చిన దగ్గరినుంచి పవన్ కల్యాణ్ ఎక్కువగా అజ్ఞాతంలోనే గడుపుతున్నారు. ఏదో మొక్కు చెల్లించడానికా అన్నట్లు పెంచిన గడ్డం, జుత్తులను కూడా ఆయన ట్రిమ్ చేయించుకుని న్యూ అవతార్ లోకి వచ్చారే తప్ప పార్టీ కార్యకలాపాల మీద అంత పెద్దగా దృష్టి పెట్టలేదు. బెజవాడ వెళ్లడమూ నాల్రోజులు సమీక్ష సమావేశాల హడావిడీ, తర్వాత.. అజ్ఞాతం ఇలాగే ఆయన వైఖరి గడచిపోయింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాలు శరవేగంగా మారిపోతున్నాయి. తెలుగుదేశం ఎంపీలు నలుగురు కమలతీర్థం పుచ్చుకోవడం, చాలామంది ఎమ్మెల్యేలు కూడా కమలం వైపు చూస్తున్నారనే వార్తలు వస్తుండడం… నేపథ్యంలో పవన్ కల్యాణ్ కూడా తన వంతు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శిథిలమైపోయిన తన పార్టీలో ఇంకా ఉండదలచుకున్నది ఎవ్వరో? వెళ్లదలచుకున్నది ఎవ్వరో? ఆయన ఆరాలు తీస్తున్నారని తెలుస్తోంది.
నిజానికి జనసేన నాయకులు, ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థుల్లో ఓ గుబులు మొదలైంది. అధినేత వ్యవహారం చూస్తోంటే.. పార్టీ మళ్లీ లేచి నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు అంతో ఇంతో భారతీయ జనతా పార్టీ వైపు వెళ్దాం అని అనుకుంటూ ఉండగా.. అక్కడ కూడా బెర్తులు నిండిపోతున్నాయి. ఇంకొన్నాళ్లు ఆగితే.. తమ తమ నియోజకవర్గాల్లో ‘టికెట్ ప్రాబబుల్స్’ హోదాలో భాజపాలోకి కూడా ఎంట్రీ దక్కకపోవచ్చునని వారు ఆలోచిస్తున్నారు.
టికెట్ సంగతి మరచిపోయి, వైకాపాలోకి వెళ్లడానికి కూడా పలువురు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తనవెంట నిలిచేదెవరో.. తేల్చుకుని.. దానిని బట్టి భవిష్యత్ ప్రస్థానం ప్లాన్ చేసుకోవడానికి పవన్ కల్యాణ్ బెజవాడ సమావేశాల్లో దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.