బిజినెస్ డీల్స్ లాక్ చేయడంలో సురేష్ బాబు తర్వాతే ఎవరైనా. ఎక్కడ తనకు లాభం ఉంటే అక్కడ పని పూర్తిచేస్తారు సురేష్ బాబు.
తన భాగస్వామ్యంలో, ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి నిర్మించిన వెంకటేష్ సినిమాలతో తాజాగా భారీ లాభాలు దక్కించుకున్నారు సురేష్ బాబు. ఓవైపు కరోనా పరిస్థితులతో, ఇండస్ట్రీ ఇబ్బంది పడుతున్నప్పటికీ.. మరోవైపు నారప్ప, దృశ్యం-2 సినిమాలకు సంబంధించి క్రేజీ డీల్స్ క్లోజ్ చేశారు.
వెంకటేష్ నటించిన నారప్ప సినిమాను డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కింద అమెజాన్ ప్రైమ్ కు ఇచ్చేశారు. ఈ డీల్ తో ఏకంగా 40 కోట్ల రూపాయల్ని దక్కించుకున్నారు మేకర్స్. ఇక్కడితో ఈ సినిమా రాబడి ఆగిపోలేదు. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ తో నిర్మాతలకు అదనపు లాభం చేకూరుతుంది.
ఈ కరోనా కష్టకాలంలో నారప్పను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేస్తే, ఇంత మొత్తంలో కలెక్షన్ వస్తుందా అనేది అనుమానమే. పైగా ఇది స్ట్రయిట్ మూవీ కూడా కాదు. తమిళ్ లో హిట్టయిన ఓ సినిమాకు రీమేక్.
ఇక వెంకీ నటించిన మరో సినిమా దృశ్యం-2 డీల్ కూడా క్లోజ్ చేశారు సురేష్ బాబు. ఈ సినిమాకు సంబంధించి మొత్తం హక్కుల్ని (డిజిటల్, శాటిలైట్, డైరక్ట్ ఓటీటీ రిలీజ్) 36 కోట్ల రూపాయలకు అమ్మేశారు.
దృశ్యం-2 నిర్మాణ వ్యయంతో పోల్చి చూస్తే, ఇది అద్భుతమైన డీల్ అని చెప్పాలి. ఎఁదుకంటే, దృశ్యం-2 సినిమాను జస్ట్ నెల రోజుల్లో పూర్తిచేశారు. పైగా ఇది కూడా స్ట్రయిట్ మూవీ కాదు. మలయాళ హిట్ సినిమాకు రీమేక్.
ఇలా 2 రీమేక్ సినిమాలతో 2 బ్రహ్మాండమైన డీల్స్ లాక్ చేసి, టాలీవుడ్ లో తెలివైన వ్యాపారవేత్త అనిపించుకున్నారు సురేష్ బాబు.