జలవివాదాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించబోతోంది. ఇక్కడ ఏపీ లాజిక్ ఏంటంటే.. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం నీరు విడుదల చేయడం ఆపేసి రాజీకి రావాలి. లేకపోతే రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్న జలాశయాలు, జల విద్యుత్ కేంద్రాలను కేంద్రానికి అప్పగించేలా ఒప్పుకోవాలి.
ఇదే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుందనేలా సుప్రీంలో రిట్ పిటిషన్ వేయడానికి ఏపీ సిద్ధమవుతోంది. ఈమేరకు మీడియాకు లీకులిచ్చారు. లీకులు అనడం కంటే.. తెలంగాణకు షాకులు అంటేనే బాగుంటుందేమో. జలజగడంపై జగన్ ది మౌనం కాదు, వ్యూహం అని ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చేసింది.
ఏపీ, తెలంగాణ మధ్య శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల వంటి అంతర్ రాష్ట్ర ప్రాజెక్ట్ లున్నాయి. కృష్ణా నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్ట్ లన్నీ రెండు రాష్ట్రాలకు చెరిసగం వస్తాయి. వాటి నిర్వహణ, భద్రత వంటి అంశాలను రెండు రాష్ట్రాలు పర్యవేక్షిస్తుంటాయి. ఈ హక్కుతోనే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీటిని నిర్దాక్షిణ్యంగా కిందకు వదిలేస్తూ విద్యుత్ ఉత్పత్తి సాకు చెబుతోంది తెలంగాణ. దీనిపై కృష్ణాబోర్డ్ కి లేఖలు రాసినా, కేంద్ర జలశక్తి మంత్రికి ఫిర్యాదు చేసినా, ప్రధానికి మొరపెట్టుకున్నా ఫలితం లేదు.
దీంతో ఏపీ, సుప్రీంకోర్టు తలుపు తట్టబోతోంది. ఇలాంటి గొడవలన్నీ వద్దు.. ప్రాజెక్ట్ ల నిర్వహణ, భద్రతను కేంద్రానికే అప్పగించండి అంటూ మెలికపెట్టడానికి సిద్ధమైంది.
వాస్తవానికి ప్రాజెక్ట్ ల నిర్వహణ రాష్ట్రాల పరిధిలో ఉంటేనే వాటికి ఉపయోగం. నీటి అవసరాలకు తగినట్టు, విద్యుత్ అవసరాలకు తగినట్టు ప్రాజెక్ట్ లను ఉపయోగించుకోవచ్చు. కేంద్రం పరిధిలోకి వెళ్తే, ప్రతి విషయానికి అర్జీ పెట్టుకోవాలి, వారు చెప్పినట్టే నడచుకోవాలి. కానీ ఇప్పుడు ఏపీ చేతుల్లో ఏమీ లేదు. తెలంగాణ మరీ మూర్ఖంగా ముందుకెళ్తోంది.
సాగునీటి నిల్వల్ని కూడా నిర్దాక్షిణ్యంగా విద్యుత్ కోసం అంటూ సముద్రంపాలు చేస్తోంది. తప్పని చెబుతున్నా వినిపించుకోవడంలేదు. కృష్ణాలో ఫిఫ్టీ ఫిఫ్టీ వాటాలివ్వాలంటూ ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ కొత్త లెక్కలు తీస్తోంది. ఈ దశలో తెలంగాణకు గట్టి షాకివ్వడానికి డిసైడ్ అయ్యారు జగన్. సుప్రీంలో రిట్ పిటిషన్ కి సిద్ధమయ్యారు.
నీటి వాటాలపై కొట్లాటలెందుకు కేంద్రం పరిధిలో పెడదాం అని ఏపీ బేషరతుగా ముందుకొస్తుండే సరికి తెలంగాణకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. కేంద్రానికి అప్పగిస్తే తెలంగాణ ఆటలు సాగవనేది స్పష్టం. అంటే అర్జంట్ గా జలవిద్యుత్ ఉత్పత్తి ఆపేసి ఏపీ ప్రభుత్వానికి సహకరించాలి. లేదా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించి హక్కులు కేంద్రానికి దఖలు పడకుండా చూడాలి. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలో ఎలాంటి దురుద్దేశాలు లేవు అనేది స్పష్టంగా తెలుస్తోంది.
సో.. సుప్రీంకోర్టు తన పరిధిలో ఈ అంశాన్ని పరిష్కరించాలనుకుంటే.. కేంద్రానికి హక్కులు దఖలు పరిచే అవకాశం ఉంది. అదే జరిగితే అది తెలంగాణకు కోలుకోలేని దెబ్బ అవుతుంది. కేంద్రం పరిధిలోకి వెళ్తే నీటి వాటాలన్నీ సక్రమంగా ఉంటాయి. ఎవరి ప్రలోభాలు, ఒత్తిడిలు ఉండవు.
ఒకరకంగా సుప్రీంలో రిట్ పిటిషన్ పేరుతో, కేంద్రానికే బాధ్యతలు అప్పగిస్తామనే వాదనతో తెలంగాణపై ఏపీ ఒత్తిడి పెంచుతోంది. ఈలోగా కేసీఆర్ సర్కారు వెనక్కి తగ్గుతుందో లేదో చూడాలి.