స్టార్ హీరోలుగా ఎదిగినా ఆర్ధిక పరమైన చిక్కులు అనుభవించిన నటులు ఎంతో మంది ఉన్నారు. వీళ్లను దేవుళ్లుగా చూసే అభిమానగణం ఉన్న సమయంలో.. వీరు చేసే కొన్ని రకాల ప్రయోగాలు సక్సెస్ కాకనప్పుడు వీరు బాగా నష్టపోయి ఉంటారు. ఇందుకు కమలహాసన్ కూడా ఒక ఉదాహరణ. నిత్యం ప్రయోగాలు చేసే కమల్ అమావాస్యచంద్రుడు అనే ప్రయోగం ఒకటి చేశాడు. అందులో అంధుడి పాత్రను హీరోగా పెట్టి తనే నటించడమే కాదు, నిర్మించాడు కూడా. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో కమల్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడట. ఆ ఇబ్బందుల నుంచి బయట పడటానికి కమల్ కు ఏడెనిమిదేళ్లు పట్టిందట! ఒక్క సినిమా డిజాస్టర్ అయితే అంత నష్టం ఉండవచ్చు. కమల్ వంటి భారీ పారితోషకం తీసుకునే హీరో కూడా ఆ కష్టాల నుంచి బయటపడానికి సమయం తీసుకున్నాడంటే ఇండస్ట్రీలో వ్యాపారం నిప్పుతో చెలగాటం అని చెప్పడానికి మరే ఉదాహరణ కావాలి?
అలాగే ఈ తరహా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న మరో స్టార్ హీరో బిగ్ బి అమితాబ్. ఇప్పుడంటే అమితాబ్ బ్రాండ్ వ్యాల్యూ కోట్ల రూపాయల్లో ఉంది. ఐశ్వర్యరాయ్ బిగ్ బి కోడలయ్యాకా వారి బ్రాండ్ వ్యాల్యూ మరింత పెరిగింది. అయితే మధ్యలో అభిషేక్ కెరీర్ మందగించింది. ఇంతకు మించిన ఇబ్బంది అమితాబ్ 2000 సంవత్సరం సమయంలో ఎదుర్కొన్నారు.
అమితాబ్ ఫెయిల్యూర్ స్టోరీ ఏబీసీఎల్ తో ముడిపడి ఉంది. ఏబీసీఎల్ ను ప్రారంభించి రకరకాల పెట్టుబడులు పెట్టారు అమితాబ్. సినిమాలు కూడా నిర్మించారు. మొదట్లో బాగానే నడించింది కానీ, 1999-2000 సమయానికి ఏబీసీఎల్ నష్టాలు 90 కోట్ల రూపాయలుగా తేలాయట. ఆ కాలానికి అది ఎక్కువ మొత్తమే!
అమితాబ్ కు అప్పటికే హీరోగా వేషాలు దాదాపు లేవు. వేరే హీరోలతో స్క్రీన్ పంచుకుంటూ వచ్చారు. అలాంటి సినిమాలు హిట్ కాలేదు. ఒకవైపు పీకల్లోతు వరకూ వచ్చిన అప్పులు. వాటిని రీ పే చేయలేకపోవడంతో అమితాబ్ ఇంటి చుట్టూ అప్పులిచ్చిన వారు తిరిగే వారట. కొందరైతే దూషించడానికి కూడా వెనుకాడలేదట. ఈ విషయాన్ని అమితాబే స్వయంగా ఒక సారి చెప్పారు. ఆ పరిస్థితుల నుంచి బయటపడానికి సినిమాలు తప్ప అమితాబ్ కు మరో మార్గం లేదు. ఆ సమయంలో వచ్చిన *మొహబ్బతే* అమితాబ్ జీవితాన్ని మరో టర్న్ తిప్పింది. అందులో అమితాబ్ చేసిన హీరోయిన్ తండ్రి పాత్ర ఆయనకు అలాంటి అవకాశాలను బోలెడన్నింటిని తెచ్చి పెట్టింది. ఆ వెంటనే ప్రారంభం అయిన కేబీసీ అమితాబ్ ను టీవీ హోస్టుగా మార్చింది. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కావడంతో అమితాబ్ తన 90 కోట్ల రూపాయల అప్పును కూడా తేలికగానే తీర్చేసుకున్నారట. దూరదర్శన్ కు పడ్డ బకాయిలను ఆ సంస్థకు సంబంధించిన యాడ్స్ లో కనిపించింది తీర్చేశారట. 2003-04 నుంచి మళ్లీ అమితాబ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఆయన ప్రస్థానం మరో సక్సెస్ స్టోరీ అయ్యింది.