కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పక్ష నేత. ప్రస్తుతం ఆ పదవికి ఎలాంటి పవర్స్ పెద్దగా ఉండవు. సోనియా, రాహుల్ లు పార్టీని తమ కనుసన్నల్లో నడిపిస్తుంటారు. పార్టీ పతనావస్థలో ఉన్నా.. అంతిమ నిర్ణయాలు, అధికారాలు వారివే. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పక్ష నేత పదవి కేవలం అలంకార ప్రాయంగా మారింది.
అయితే.. లోక్ సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలన్నా, మహామహులు కూర్చున్న ఆ హోదాలో భారత లోక్ సభలో కూర్చోవాలన్నా మరొకరికి అది గొప్పే అవుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు లోక్ సభలో కాంగ్రెస్ కు నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఆ హోదాలో ఉన్న బెంగాలీ నేత వెస్ట్ బెంగాల్ పీసీసీ అధ్యక్ష హోదాలో ఉండటంతో.. మరొకరిని ఆ పదవిలో నియమించనుందట కాంగ్రెస్ అధిష్టానం. ఆ ఎంపికలో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. లోక్ సభలో కాంగ్రెస్ కు ఉన్న ఎంపీల సంఖ్య పరిమితమే కావడంతో.. వారిలోనే ఎవరికో అవకాశం దక్కవచ్చు. ఈ జాబితాలో ఉత్తమ్ తో పాటు కేరళ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఇంకా మనీష్ తివారీ తదితరులున్నారట.
వీరంతా కొంతకాలం కిందట ఇదే పదవిని రాహుల్ గాంధీ చేపట్టాలని కోరుతూ సోనియాకు లేఖ రాసిన వారు. కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టి నడిపించాలని వీరు కోరారట. అయితే రాహుల్ కు ఆ ఆసక్తి ఇప్పటికీ లేనట్టుంది. అందుకే లోక్ సభ పక్ష నేతగా రాహుల్ వీర విధేయుల్లో ఒకరిని ఎంపిక చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
అప్పుడు లేఖ రాసిన వారంతా ఇప్పుడు పరిగణనలో ఉన్నట్టేనని, ఉత్తమ్ కు కూడా ఆ అవకాశం లభించవచ్చునని తెలుస్తోంది. మరి ఒక తెలుగు వాడికి లోక్ సభలో ప్రతిపక్ష పార్టీ అధ్యక్ష స్థానం…మంచిదే!