కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ నేత రమేశ్‌యాదవ్‌కు ఎమ్మెల్సీ పదవితో పాటు అంతుచిక్కని సమస్యలను తీసుకొస్తోంది. దీంతో అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి వచ్చిందనే ఆనందం కంటే, మనశ్శాంతి కరువవుతోందనే ఆందోళనే ఎక్కువైంది. రమేశ్‌యాదవ్ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వార్డు మెంబర్‌గా గెలుపొంది, త్రుటిలో చైర్మన్ పదవిని చేజార్చుకున్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చల్లని చూపుతో ఆయన్ను ఎమ్మెల్సీ పదవి వరించింది. గవర్నర్ కోటాలో ఇటీవల ఆయన ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు.
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి, అనంతరం ప్రొద్దుటూరు చేరుకున్నారు. పట్టణంలో యాదవులతో పాటు బీసీ సామాజిక వర్గం బలంగా ఉంది. దీంతో రమేశ్‌యాదవ్‌కు ఎమ్మెల్సీ పదవి రావడాన్ని, తమకే వచ్చినట్టుగా బీసీలు భావిస్తూ సంబరపడుతున్నారు. మరోవైపు రమేశ్ యాదవ్ దగ్గరికి బీసీల తాకిడి పెరిగింది. రమేశ్ యాదవ్‌కు రాజకీయ పరపతి పెరగడం అధికార పార్టీలోని కొందరికి కంటగింపుగా మారిందనే చర్చ ప్రొద్దుటూరు పట్టణంలో జరుగుతోంది. దీంతో స్వపక్షంలోనే ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్‌కు శత్రువులు తయారయ్యారనే టాక్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో రమేశ్ యాదవ్ కాల్ డేటా లిస్టు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోవడం రాజకీయ దుమారం రేపుతోంది. మరీ ముఖ్యం గా అధికార పార్టీలో నేతల మధ్య అంతర్గతంగా గ్యాప్ పెంచడానికి కారణమవుతోందనే చర్చ జరుగుతోంది. గత నెలలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రమేశ్ యాదవ్‌కు ఇంటర్నెట్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ అయిన వారం రోజులకే టీడీపీ బీసీ నేత నందం సుబ్బయ్య సమాధి పక్కనే నిన్నూ సమాధి చేస్తామంటూ బెదిరింపు కాల్స్ చేసి ఆయన్ను భయాందోళనకు గురి చేయడం కలకలం రేపింది.
రెండు రోజుల వరుస బెదిరింపు కాల్స్‌పై ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. దీనిపై జూన్ 30న త్రీటౌన్ పోలీస్టేషన్లో 137/2021 నంబర్‌పై కేసు రిజిస్టర్ చేశారు. అయితే బెదిరింపు కాల్స్‌పై విచారణ జరపాలంటే ఎమ్మెల్సీ కాల్ లిస్టు కావాలి. బెదిరింపు కాల్స్ వచ్చిన తేదీల్లో కాల్ డేటాను తీసుకునేందుకు ఎమ్మెల్సీ అంగీకారం తెలుపుతూ లెటర్ ఇచ్చారు. అయితే పోలీసులు రెండు రోజుల కాల్ డేటాకు బదులు అవసరం లేని ఏడాది కాల్ డేటాను తీసినట్లు తెలుస్తోంది. తాను అనుమతి ఇచ్చిన తేదీల్లో కాకుండా ఏకంగా ఏడాది కాల్‌డేటాను పోలీసులు తీసుకోవడంపై ఎమ్మెల్సీ ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు తన ఏడాది కాల్‌డేటాను రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీలోని ముఖ్యులకు పోలీసులు చేరవేశారని ఎమ్మెల్సీతో పాటు ఆయన అనుచరులు అనుమానిస్తున్నారు. అలాగే కాల్‌డేటా ఆధారంగా రమేశ్ యాదవ్ ఏడాది కాలంగా ఎవరెవరితో టచ్‌లో ఉన్నారో నిగ్గుతేల్చి… రాజకీయంగా సమాధి కట్టేందుకు బలమైన రాజకీయ శక్తి పనిచేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా రమేశ్ యాదవ్ తమకు ప్రత్యామ్నాయం అవుతారని భయపడుతున్న వారే చేస్తున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
కాన్ఫిడెన్షియల్ కాల్ లిస్టు రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్లడంపై రమేశ్ యాదవ్ ఆగ్రహంగా ఉన్నారు. ఎవరి ద్వారా ఎమ్మెల్సీ కాల్ లిస్టు వారి చేతుల్లోకి వెళ్ళిందే దానిపై కొత్త వివాదం తలెత్తింది. ఈ కాల్ డేటా వ్యవహారంపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో పాటు సీఎం జగన్‌కు ఎమ్మెల్సీ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
బెదిరింపు కాల్స్‌పై దర్యాప్తు చేపట్టి దోషులెవరో తేల్చాల్సిన పోలీసులే…కొత్త సమస్యను సృష్టించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి సీఎం సొంత జిల్లాలో ఓ బీసీ నేతకు ఎమ్మెల్సీ పదవి వరుస సమస్యలను తీసుకొచ్చి… కంటిమీద కునుకు లేకుండా చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.