కృష్ణా జలాల వివాదంలో తెలంగాణ ప్రభుత్వ దుందుడుకు చర్యలు, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఏపీ సర్కార్ విసిగిపోయింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో న్యాయం కోసం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇరు రాష్ట్రాల ఫిర్యాదులపై కేంద్రం జోక్యం చేసుకుని ఉంటే, తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేష భావనలకు ఆస్కారం ఉండేది కాదు.
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం తలెత్తితో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి సమస్యను పరిష్కరించాలి. కానీ మోదీ సర్కార్ మాత్రం ఆ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ తనకు రాజకీయ ప్రయోజనాలు తప్ప, ప్రజాప్రయోజనాలు పట్టవని చెప్పకనే చెప్పిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో కృష్ణా జల వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయిం చుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే ఏఏ అంశాలపై రిట్ పిటిషన్ దాఖలు చేయాలనే విషయమై ప్రభుత్వం న్యాయనిపుణులతో చర్చిస్తోంది. కృష్ణా జలాల వినియోగంపై ఇటు ఏపీ, అటు తెలంగాణ ప్రభుత్వం పరస్పరం ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. దీంతో రోజురోజుకూ వివాదం జఠిలమవుతోంది.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను, ఫిర్యాదులను లెక్క చేయకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింత జలాశయాల్లో విద్యుత్ ఉత్పత్తి చేపట్టింది. ఈ సందర్భంగా భారీగా సాగునీరు సముద్రంలో వృథాగా కలిసిపోతోందని ఏపీ ప్రభుత్వం లబోదిబోమని మొత్తుకుంటోంది.
ఈ విషయమై పలుమార్లు ప్రధానితో పాటు వివిధ వ్యవస్థలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖలు రాశారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కన్పించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తమ రాష్ట్ర హక్కుల్ని కాపాడుకునేందుకు ఏకైక ప్రత్యామ్నాయం సుప్రీంకోర్టు ఒక్కటే అని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. న్యాయం తమ పక్షాన్నే ఉందని ఏపీ ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. సుప్రీంకోర్టులో తప్పక తమ హక్కులు పరిరక్షించబడుతాయనే విశ్వాసంతోనే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని జగన్ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది.
అంతర్రాష్ట్ర నదులపై ఉన్న ప్రాజెక్టులను, విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడంతో పాటు వాటి నిర్వహణ, భద్ర తలను కేంద్ర బలగాలకు అప్పగించాలని పిటిషన్‌లో కోరనున్నట్లు తెలిసింది. కృష్ణా బోర్డు విధివిధానాలు ఖరారు చేసేలా కేంద్రా నికి ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం విన్నవించనుంది.
పనిలో పనిగా కృష్ణా జలాల వినియోగంపై ప్రస్తుతం వివాదం తలెత్తిన నేపథ్యంలో …ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా సుప్రీంకోర్టు వేదికగా ఎండగట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకోవడం గమనార్హం.