కరీనా కపూర్.. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్ నటీమణి. ఒక పెద్ద హీరో భార్య. ఒక రాజవంశపు కోడలు. అంతేనా.. బాలీవుడ్ లో వేళ్లూనుకుపోయిన కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. బాలీవుడ్ లో సక్సెస్ కావాలంటే కపూర్ అనే ఇంటి పేరు ఒక లైసెన్స్ లాంటిది! రాజ్ కపూర్ ఇంటి నుంచి ఆడపడుచు.
తాతలు, తండ్రులు.. సెలబ్రిటీలు. బాలీవుడ్ ను ఏలిన ఫ్యామిలీ! మరి అలాంటామెకు కూడా కష్టాలుంటాయని అనుకోగలమా? అందులోనూ.. ఆర్థిక కష్టాలు! ఎవరేమనుకున్నా.. తన జీవితంలో చాలా సాధారణ, సాదాసీదా స్థితిని చూసినట్టుగా చెబుతుంది కరీనా కపూర్. ఇటీవలే రెండో సారి తల్లి అయిన కరీనా కపూర్.. తన జీవితంలో ఆర్థికంగా ఇబ్బందికరమైన స్థితిని అనుభవించినటు వంటి రోజులను గతంలోనే చెప్పింది.
కరీనా కపూర్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ఉపయోగించేదట. సగటు మధ్యతరగతి కుటుంబంలోని అమ్మాయిల్లాగా ఆర్టీసీ బస్సులో కాలేజ్ కు వెళ్లేదట. ఆ సమయంలో వీరి జీవితం చాలా సాదాసీదా గా ఉండేదట. సెలబ్రిటీ స్టేటస్ మాట అటుంచితే ఆర్థికంగా విలాసాలు కూడా ఏమీ ఉండేవి కావట.
ఒక కారు అయితే ఉండేదట కానీ, ఈమెది ఎలాగూ అప్పటికి సొంతంగా కారు నడిపే వయసు కాదు. తల్లి పని మీద ఉంటే, వీళ్లను బయటకు తీసుకెళ్లడానికి డ్రైవర్ ను పెట్టుకునే తాహతు ఉండేది కాదట. ఇంతకీ రణ్ ధీర్ కపూర్ కూతురు అలాంటి పరిస్థితులను ఎందుకు ఎదుర్కొందంటే, అప్పట్లో రణ్ దీర్, బబితలు వేర్వేరుగా ఉండేవారు.
1980లలోనే రణ్ ధీర్ కెరీర్ మందగించింది. ఆ తర్వాత కొంతకాలానికి తన పెద్దకూతురుని నటిని చేయాలనే ఆలోచనలో ఉందట బబిత. ఆ విషయం రణ్ ధీర్ కు అస్సలు ఇష్టం లేదట. దీంతో ఆ దంపతులు విడిపోయారు. అధికారికంగా విడాకులు తీసుకోలేదు. కానీ, 19 యేళ్ల పాటు వేర్వేరుగా జీవించారు. ఆ సమయంలో తల్లి సంరక్షణలోనే కరిష్మా, కరీనాలు పెరిగారు.
కరిష్మ హీరోయిన్ అయ్యింది. కరీనా మాత్రం చదువుకునేదట. నటి అయిపోవడంతో తనకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించాల్సిన అవసరం రాలేదని, కరీనా మాత్రం ఓపికగా వెళ్లి చదుకునేదని కరిష్మ ఒకసారి చెప్పింది.
కరిష్మ హీరోయిన్ గా స్టార్ స్టేటస్ కు ఎదగడంతో వీరి కుటుంబ పరిస్థితులే మారిపోయాయి. ఒక సమయంలో పెద్దకూతురు హీరోయిన్ గా వద్దన్న రణ్ ధీర్ కూడా ఆ తర్వాత మనసు మార్చుకున్నాడట. రణ్ ధీర్, బబితలు మళ్లీ కలిసిపోయారు. కరీనా కూడా హీరోయిన్ అయ్యింది.
కొంత కాలానికి స్టార్ అయ్యింది. కోట్ల రూపాయల పారితోషకాల స్థాయికి ఎదిగింది. సొంతంగా కూడా ఇప్పుడు కోటీశ్వరురాలు. ఇప్పుడు ఆమె ధరించే దుస్తులు లక్షల రూపాయలు, వాడే హ్యాండ్ బ్యాగులు కూడా లక్షల రూపాయలవే! అయితే పాత రోజులను కరీనా మరిచిపోలేదు, వాటిని దాచుకోనూ లేదు.