తెలుగు సీరియ‌ళ్ల‌ను మ‌రిపిస్తున్న బీజేపీ

తిరుప‌తి ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఏపీ బీజేపీ త‌మ అభ్య‌ర్థి ఎంపిక‌లో మాత్రం తెలుగు సీరియ‌ళ్ల‌ను త‌ల‌పిస్తోంది. అభ్య‌ర్థి ఎంపిక‌లో నెల‌ల త‌ర‌బ‌డి కాల‌యాప‌న శ్రేణుల్లో అస‌హ‌నాన్ని పెంచుతోంది. పుణ్య‌కాలం కాస్త అభ్య‌ర్థి…

తిరుప‌తి ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఏపీ బీజేపీ త‌మ అభ్య‌ర్థి ఎంపిక‌లో మాత్రం తెలుగు సీరియ‌ళ్ల‌ను త‌ల‌పిస్తోంది. అభ్య‌ర్థి ఎంపిక‌లో నెల‌ల త‌ర‌బ‌డి కాల‌యాప‌న శ్రేణుల్లో అస‌హ‌నాన్ని పెంచుతోంది. పుణ్య‌కాలం కాస్త అభ్య‌ర్థి ఎంపిక‌కే స‌రిపోయేలా ఉంద‌నే అభిప్రాయాలు పార్టీ శ్రేణుల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అంద‌రి కంటే ముందుగా తిరుప‌తి ఉప ఎన్నిక‌పై బీజేపీ హ‌డావుడి మొద‌లు పెట్టింది. జ‌న‌సేన‌తో సంప్ర‌దించ‌కుండానే తిరుప‌తిలో తామే బ‌రిలో ఉంటామ‌ని బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజుతో పాటు మిగిలిన నేత‌లు ప్ర‌క‌టించారు. దీంతో జ‌న‌సేన ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ నేప‌థ్యంలో నాలుక్క‌రుచుకున్న బీజేపీ నేత‌లు  జ‌న‌సేనానితో స‌ర్దుబాటు చేసుకున్నారు.

ఎట్ట‌కేల‌కు తిరుప‌తిలో తామే పోటీ చేసేలా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఒప్పించి ప్ర‌క‌టన ఇప్పించారు. మ‌రో రెండు రోజుల్లో తిరుప‌తి ఉప ఎన్నిక‌కు నామినేష‌న్ల ప్ర‌క్రియ మొద‌లుకానుంది. ఇప్ప‌టికీ బీజేపీ త‌న అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంపై జ‌న‌సేన అసంతృప్తిగా ఉంది. ఇలాగైతే గ‌ట్టి పోటీ ఎలా ఇస్తామ‌ని జ‌న‌సేన నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

తాజాగా ఐదుగురు అభ్య‌ర్థుల పేర్ల‌ను బీజేపీ ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. విశ్రాంత ఐఏఎస్ అధికారులు  ర‌త్న‌ప్ర‌భ‌, దాస‌రి శ్రీ‌నివాసులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కృష్ణ‌ప్ర‌సాద్‌,బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముని సుబ్ర‌హ్మ‌ణ్యంల‌తో పాటు 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన డాక్ట‌ర్‌ శ్రీ‌హ‌రిరావు పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి.

వీరిలో ర‌త్న‌ప్ర‌భ‌, దాస‌రి శ్రీ‌నివాసులు పోటీ చేసేందుకు ఆస‌క్తి చూప‌డం లేదంటున్నారు. అభ్య‌ర్థి ఎంపిక‌లోనే ఇంత కాల‌యాప‌న అయితే, ప్ర‌చారానికి ఎప్పుడు వెళ‌తారో అనే సెటైర్లు విన‌ప‌డుతున్నాయి.