ఉప ఎన్నికా? కురుక్షేత్ర యుద్ధమా ?

ఒకప్పుడు ఉప ఎన్నికలను ప్రజలుగానీ, మీడియాగానీ పెద్దగా పట్టించుకోకపోయేవారు. ఉప ఎన్నికలు జరిగినట్లు కూడా పెద్దగా ఎవరికీ తెలిసేదికాదు. అంటే ఉప ఎన్నికలు అనేవి సీరియస్ సబ్జెక్ట్ కాదని అర్ధం. ఒకేసారి ఒకటికంటే ఎక్కువ…

ఒకప్పుడు ఉప ఎన్నికలను ప్రజలుగానీ, మీడియాగానీ పెద్దగా పట్టించుకోకపోయేవారు. ఉప ఎన్నికలు జరిగినట్లు కూడా పెద్దగా ఎవరికీ తెలిసేదికాదు. అంటే ఉప ఎన్నికలు అనేవి సీరియస్ సబ్జెక్ట్ కాదని అర్ధం. ఒకేసారి ఒకటికంటే ఎక్కువ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కొంత చర్చ జరిగేది. ఏదో ఆసక్తి కలిగేది. కానీ ఇప్పుడు రాజకీయాలు మారాయి. మీడియా మారింది. టీవీ చానెళ్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వీరవిహారం చేస్తోంది. 

మీడియా విస్తరించడమే కాకుండా పార్టీలవారీగా చీలిపోయింది. పార్టీకో దినపత్రిక, టీవీ ఛానెల్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క ఉప ఎన్నిక జరిగినా పార్టీలు సవాలుగా తీసుకొని తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. అలాగే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కూడా విపరీతమైన ద్వేషం, శత్రుత్వం పెరిగిపోయాయి. అధికారంలో ఉన్న పార్టీలకు ప్రతిపక్షాలు బతికి ఉండకూడదనే కచ్చ పెరిగిపోయింది. ఇలా అనేక కారణాల వల్ల ఒక్క ఉప ఎన్నిక సైతం సంకుల సమరంగా మారుతోంది.

తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక అలాగే సాగింది. నాగార్జున సాగర్ అలాగే జరగబోతోంది. ప్రస్తుతం ఏపీలోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఇది చాలా హాట్ గురూ అన్నట్లుగా తయారైంది. మరో మాటలో చెప్పాలంటే కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తోంది. రాజకీయాల్లో ఇదో ట్రెండ్ఈ. తిరుపతి ఉప ఎన్నికలో అధికార వైసీపీ ఓడిపోయినా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీలేదు. పార్టీ దిగజారదు. కకావికలు కాదు. కానీ టీడీపీ ఓడిపోతే దాని భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

పంచాయతీ.. ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికల్లో ఘోర ఓటమితో టీడీపీ బోర్లా పడింది. ఇంకా ఒకటి, రెండు దెబ్బలు తగిలితే పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది. అధిష్టానం మాట వినే నేతలు, కేడర్ కనుమరుగవుతారు. పార్టీని కాపాడేదెవరు అంటూ ఆపసోపాలు పడుతున్న వేళ.. తిరుపతి ఉప ఎన్నిక  ఆ పార్టీకి సవాల్ గా మారింది. 

ఈ ఉప ఎన్నిక టీడీపీకి డూ ఆర్ డై లాంటింది. ఓడితే ఇక టీడీపీ కనుమరుగైనట్టే అనే ప్రచారం జరుగుతోంది. దానికి తోడు సీనియర్ లీడర్లను పక్కన పెట్టాలనే డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాలనే నినాదం  ఊపందుకుంది. అదే జరిగితే లోకేష్ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని చంద్రబాబు భయపడుతున్నారు.  

తిరుపతిపై  తెలుగుదేశం పార్టీ పుల్‌ ఫోకస్ పెట్టింది. గెలుపే లక్ష్యంగా తెగించి పోరాడాలని నేతలకు చంద్రబాబు ఇప్పటికే నాయకులకు క్లాస్ పీకారు.  మరోవైపు పార్టీ అభ్యర్థిని ముందుగానే టీడీపీ ప్రకటించినా.. ఇప్పటి వరకు పనబాక లక్ష్మి తెరపైకి రాలేదు. అసలు ఆమె పోటీకి సిద్ధంగా ఉన్నారో లేరో తెలియక కేడర్ తికమక అవుతోంది. పనబాక పోటీ నుంచి  తప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం సంగతి ఎలాఉన్నా చంద్రబాబు నాయుడు యుద్ధానికి సిద్ధమవుతున్నారు.  

తాజాగా తిరుపతి గెలుపు కోసం ఏం చేయాలి అనే దానిపై పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయిన చంద్రబాబు.. సీనియర్ నేతల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గల నేతలతో విడి విడిగా భేటీ అయి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం పై చర్చించారు. ఐదుగురుతో తిరుపతి ఉప ఎన్నిక కోసం మానిటరింగ్ కమిటీ వేశారు.  

ఈ కమిటీలో అచ్చెన్నాయుడు, నారా లోకేష్, బీద రవిచంద్ర, పనబాక కృష్ణయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకొని ప్రతి ఒక్కరూ తెగించి పోరాడాలని, తెగించి పోరాడేవాళ్లకే పార్టీలో గుర్తింపు ఉంటుందని చంద్రబాబు తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో నాయకులు పనిచేయకుండా కబుర్లు చెప్తే కుదరదని, రిజర్వేషన్లు, విధేయతలు, మోహమాటాలు ఇకపై చెల్లవన్నారు.

వైసీపీ వైఫల్యాలపై కొన్ని ముఖ్య అంశాలను గుర్తించి వాటినే ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని టీడీపీ భావిస్తోంది. ప్రతి నియోజకవర్గాన్ని పది క్లస్టర్లు గా విభజించి, మొత్తం ఏడు నియోజకవర్గ వర్గాలకు 70 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. వీటికి సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఇన్ చార్జ్ లుగా బాధ్యతలు ఇచ్చారు. టీడీపీని గెలిపిస్తే, ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, విభజన హామీల కోసం పోరాటం చేస్తామని.. టీడీపీ నేతలు హామీ ఇస్తామంటున్నారు.  

ఈ ఎన్నికలను డూ ఆర్ డైగా భావించి బరిలో దిగుతోంది టీడీపీ. ఈ ఒక్క ఉప ఎన్నికలో గెలిస్తే అధికారంలోకి వచ్చామన్నట్లుగా కలర్ ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నట్లుగా ఉంది. ప్రత్యేక హోదా  రాదని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని బాబుకు తెలుసు. తెలిసి కూడా ప్రత్యేక హోదా కోసం,  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి పోరాటం చేస్తామని  చెప్పడం ఏమిటి ? ఈ హామీలను ప్రజలు నమ్ముతారా ? 

ఇక పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యంగా మునిసిపల్ ఎన్నికల్లో సునామీ సృష్టించిన అధికార వైసీపీ కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉపఎన్నికలో గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న  ఆ పార్టీ.. ఏడుగురు మంత్రులను రంగంలోకి దింపింది. ఒక్క ఉప ఎన్నికలో గెలుపు కోసం ఇంతమంది మంత్రులను మోహరించడం నిజంగా ఆశ్చర్యమే.  పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లుగా ఏడుగురు మంత్రులను నియమించింది.  

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి పేర్ని నాని, సత్యవేడుకు మంత్రి కొడాలి నాని, గూడూరుకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సూళ్లూరుపేటకు మంత్రి కన్నబాబు, సర్వేపల్లికి మంత్రి ఆదిమూలపు సురేష్, వెంకటగిరికి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గానికి మంత్రి గౌతంరెడ్డిలకు పూర్తి బాధ్యతలు అప్పగించింది.

మొత్తం పార్లమెంట్ ఎన్నికల పూర్తి వ్యవహారాల బాధ్యతలు పార్టీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి  జగన్ అప్పగించారు. మొత్తం మీద ఉప ఎన్నికలో గెలుపు కోసం రెండు పార్టీలు భారీగా ఏర్పాట్లు చేసుకున్నాయి.