తీన్మార్ మ‌ల్ల‌న్న పోరాటానికి స‌లామ్‌

తీన్మార్ మ‌ల్ల‌న్న … ఓ సామాన్య జ‌ర్న‌లిస్ట్‌. న్యూస్ చాన‌ల్‌లో నాలుగు మాట‌లు చెబితే త‌ప్ప ముద్ద నోట దిగ‌ని ఉద్యోగం. అత‌నొక వేత‌న జీవి. త‌న ఉద్యోగ‌మే కుటుంబానికి ఆద‌రువు. ఇటీవ‌ల సొంత…

తీన్మార్ మ‌ల్ల‌న్న … ఓ సామాన్య జ‌ర్న‌లిస్ట్‌. న్యూస్ చాన‌ల్‌లో నాలుగు మాట‌లు చెబితే త‌ప్ప ముద్ద నోట దిగ‌ని ఉద్యోగం. అత‌నొక వేత‌న జీవి. త‌న ఉద్యోగ‌మే కుటుంబానికి ఆద‌రువు. ఇటీవ‌ల సొంత యూట్యూబ్ చాన‌ల్ పెట్టుకుని, తెలంగాణ ప్ర‌భుత్వంపై త‌న‌దైన వ్యంగ్యాన్ని జోడించి తెలంగాణ స‌మాజాన్ని ఆక‌ట్టుకున్నారు. 

అలాంటి ఓ సామాన్య జ‌ర్న‌లిస్ట్ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, తెలంగాణ ఉద్య‌మ శిఖ‌ర స‌మానుడైన కోదండ‌రాం లాంటి మ‌హామ‌హుల‌ను కాద‌ని… తెలంగాణ అధికార పార్టీ అభ్య‌ర్థికి చివ‌రి వ‌ర‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన న‌వీన్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న పోరాటానికి స‌లాం చెప్ప‌కుండా ఉండ‌లేం.

జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్‌కు రోల్ మోడ‌ల్‌గా నిలిచి, ట్రెండ్ సెట‌ర్‌గా తీన్మార్ మ‌ల్ల‌న్న నిలిచాడ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కేవ‌లం మూడు శాతం ఓట్ల తేడాతో న‌ల్గొండ ప‌ట్ట‌భద్రుల స్థానాన్ని మ‌ల్ల‌న్న కోల్పోయారు. ఆర్థిక‌, అధికార‌, అంగ బ‌లం పుష్క‌లంగా క‌లిగిన టీఆర్ఎస్ అభ్య‌ర్థి ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డికి తీన్మార్ మ‌ల్ల‌న్న ఏ స్థాయిలో చుక్క‌లు చూపించారో … గ‌త నాలుగు రోజులుగా ఎన్నిక‌ల కౌంటింగ్ ప్ర‌క్రియే క‌థ‌లుక‌థ‌లుగా చెబుతోంది.

తెలంగాణ‌లో అధికార పార్టీకి మీడియా ఏ విధంగా దాసోహ‌మైందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌జాగొంతుకుగా తానున్నానంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్వ‌తంత్ర మీడియా సంస్థ‌గా తీన్మార్ మ‌ల్ల‌న్న అవ‌త‌రించారు. మెయిన్‌స్ట్రీమ్ పోక‌డ‌ల‌తో పాటు తెలంగాణ ప్ర‌భుత్వ అప్ర‌జాస్వామిక విధానాల‌ను ఎండ‌గ‌డుతూ మ‌ల్ల‌న్న పోరాటం చేసిన‌, చేస్తున్న తీరు విద్యావంతుల మ‌న్న‌న‌లు అందుకున్న‌ద‌ని ఆయ‌న‌కొచ్చిన ఓట్లే లెక్కేసి చెబుతున్నాయి.

త‌మ త‌ర‌పున తెగించి పోరాడిన‌, పోరాడుతున్న వారికి తామెప్పుడూ అండ‌గా ఉంటామ‌ని విద్యావంతులు నిరూపించారు. తీన్మార్ మ‌ల్ల‌న్న సాంకేతికంగా విజ‌యం సాధించ‌క‌పోవ‌చ్చు. కానీ విద్యావంతుల మ‌న‌సుల‌ను గెలుచుకున్నారు.

ఈ ఎన్నికలో విద్యావంతుల ఇచ్చిన ప్రోత్సాహంతో తీన్మార్ మ‌ల్ల‌న్న మ‌రింత నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేసేందుకు స్ఫూర్తి ల‌భించింది. న‌ల్గొండ ప‌ట్ట‌భ‌ద్ర ఎమ్మెల్సీ స్థానంలో తీన్మార్ మ‌ల్ల‌న్ల పోరాట స్ఫూర్తితో మ‌రికొంద‌రు ముందుకొచ్చేందుకు బీజం ప‌డింది. ఈ మేరకు త‌ప్ప‌కుండా ఆయ‌న్ను అభినందించాలి.