‘పలుకు’ కాదు..బాబుకి ములుకు

తెలుగుదేశం పార్టీకి కొత్తగా శతృవులు అక్కరలేదు. దాని మద్దతు మీడియా చాలు. నిజానికి జగన్ ఎవరికన్నా రుణపడి వుండాలి అంటే అది తెలుగుదేశం మద్దతు మీడియాకే. ఎందుకంటే జగన్ తప్పులు ఏవన్నా వుంటే భూతద్దంలో…

తెలుగుదేశం పార్టీకి కొత్తగా శతృవులు అక్కరలేదు. దాని మద్దతు మీడియా చాలు. నిజానికి జగన్ ఎవరికన్నా రుణపడి వుండాలి అంటే అది తెలుగుదేశం మద్దతు మీడియాకే. ఎందుకంటే జగన్ తప్పులు ఏవన్నా వుంటే భూతద్దంలో చూపిస్తూ హడావుడి చేస్తున్నారు. ఆ వెంటనే అతగాడు వాటిని సరిదద్దుకుంటున్నాడు. 

కుల, మత వ్యవహారాలు, స్కీముల్లో లోపాలు ఇవన్నీ ఇలాగే సెట్ చేసుకుంటూ పోతున్నాడు. పైగా ఇదే మీడియా ఇన్నాళ్లుగా తెలుగుదేశం వైఫల్యాలు, బలహీనతలు చెప్పకుండా దాచుకుంటూ వస్తోంది. ఇలా అన్ని విధాలా జగన్ కు మేలు జరుగుతోంది. ఇంత  మేలు చేసేవారు ఇంకెవరు వుంటారు? 

ఇలాంటి మీడియా ఇప్పుడు ఉన్నట్లుండి బాబుగారి మీద పడింది. ఇన్నాళ్లు దాచిపెట్టిన నిజాలు అన్నీ ఒక్కసారి కక్కేసింది. పాపం, పార్టీ పాడయిపోతోంది..కాపాండండ్రా అనే ఆవేదనతో ఇదంతా రాసి వుండొచ్చు. కానీ అది ఎలా వుందీ అంటే ఇలా ఇన్ని లోపాలతో తగలబడిన పార్టీని ఇంక ఎవరు కాపాడగలరు? అన్నట్లు వుంది. దాదాపుగా ఇక చంద్రబాబు పార్టీ నేతగా అన్ ఫిట్ అన్నట్లు వుంది.

అదెలా వుందో చూద్దాం.

''…ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు పార్టీని, రాజకీయాలను పూర్తిగా విస్మరించడం వల్ల ప్రస్తుత దుస్థితి దాపురించింది. మునిసిపల్‌ ఎన్నికల్లో ఓటమికి కారణాలు అన్వేషించి విరుగుడు చర్యలకు ఉపక్రమించకుండా ప్రజలను నిందించే దుస్సాహసానికి కొంత మంది నాయకులు తెగబడ్డారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలపై పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అభిమానం, గౌరవం అయినా ఉండాలి లేదా భయం ఉండాలి. చంద్రబాబు విషయంలో తెలుగుదేశం శ్రేణులకు ఈ రెండూ లేవు. ఉండివుంటే ఎన్నికల ప్రచార సమయంలో విజయవాడలో కేశినేని నాని, ఆయనతో విభేదిస్తున్న బొండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరా వంటి వారు అలా బజారుకెక్కి ఉండేవారు కారు. ..''

ఇవి చాలవా, బాబుగారి పరువు బజార్న పడేయడానికి. సిఎమ్ గా వుండగా పార్టీని గాలికి వదిలేసారు. ఎన్నికల్లో ఫలితాలకు ప్రజల్ని నిందిస్తున్నారు. బాబు గారి మీద నాయకులకు, కార్యకర్తలకు గౌరవం, భయం లేవు.

ఇవీ చెప్పిన విషయాలు. సిఎమ్ గా వుండగా పార్టీని గాలికి వదిలేసారు అని చెప్పి ఊరుకునే బదులు, లోకేష్ కు వదిలేసారు అని కూడా చెప్పవచ్చుగా. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మీదే చంద్రబాబుకు భయం, గౌరవం లేదు. అందుకే పార్టీని లాక్కో గలిగారు. మరి అలాంటి నాయకుడి మీద కార్యకర్తలకు గౌరవం ఎందుకు వుంటుంది? సరే, ఇక్కడితో ఊరుకున్నారా? అంటే అదీ లేదు. 

''…..అధినేత చంద్రబాబు వైపు కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి. అధినేత బలంగా ఉంటేనే ఏ ప్రాంతీయ పార్టీ అయినా బలంగా ఉంటుంది. పరిస్థితికి తానెంతవరకు కారణమో చంద్రబాబు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. కీలక సమయాల్లో పార్టీ అధినేత తమకు అండగా ఉంటారన్న నమ్మకం ఆయనపై పార్టీ నాయకులకు లేదనే చెప్పవచ్చు. పార్టీ కోసం చొక్కాలు చించుకొని పనిచేసినా కీలక సమయంలో పక్కనపెట్టరన్న గ్యారంటీ లేదని పలువురు నాయకులు వాపోతూ ఉంటారు. 

నిర్ణయాలు తీసుకోవడంలో అంతులేని తాత్సారం చేయడమే కాకుండా తప్పు చేసిన వారిపైన, పార్టీకి నష్టం చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరించడంలో కూడా చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖర్‌ రెడ్డి తన అనుచరుడైన గౌరు వెంకటరెడ్డిని జైలుకు వెళ్లి మరీ పరామర్శించారు. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న వారిని పరామర్శించే సాహసం చంద్రబాబు చేయగలరా? ఆనాడు రాజశేఖర్‌ రెడ్డి చేసిన పని వల్ల నమ్ముకున్న వాళ్ల కోసం ఆయన ఎంత వరకైనా వెళతారన్న పేరొచ్చింది. 

ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అంతెందుకు, జగన్‌ రెడ్డి విషయమే తీసుకుందాం. కేంద్రంలో అధికారం చలాయిస్తూ అత్యంత బలమైన నాయకురాలిగా చలామణి అవుతున్న సోనియాగాంధీని ధిక్కరించి సొంత పార్టీ పెట్టుకొని జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడని కారణంగానే జగన్‌కు జనంలో క్రేజ్‌ ఏర్పడింది. గతంతో పోల్చితే ఇప్పుడు రాజకీయాల్లో కొలమానాలు మారిపోయాయి. చంద్రబాబు ఇంకా పాత విధానాలను, విలువలను పట్టుకొని వేలాడుతున్నారు….''

అబ్బబ్బ..ఏం సెప్తిరి..ఏం సెప్తిరి..ఎప్పుడూ ఇలాగే సెప్తూ వుంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కానీ దాని అధినేత చంద్రబాబు కానీ ఎప్పుడో వైఫల్యాల బారిన పడకుండా వుండేవారు. కానీ ఇన్నాళ్లూ ఈ తప్పులు అన్నీ దాచి పెట్టడం వల్లనే కదా ఈ పరిస్థితి దాపురించింది. కానీ బాబుగారి హితం కోరే మీడియా ఇక్కడితో కూడా ఆగలేదు. మరో అడుగు ముందుకు వేసేసింది. అదెలా అన్నది చూద్దాం.

''ఎన్టీఆర్‌ వేసిన పునాది పుణ్యమా అని తెలుగుదేశం పార్టీ దాదాపు నాలుగు దశాబ్దాలు నిలబడింది. ఇప్పటి తరాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఆ పునాదులను పటిష్ఠం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటే మరో మూడు నాలుగు దశాబ్దాల పాటు పార్టీ నిలబడుతుంది. పార్టీ గురించి ఆలోచించని వారినీ, తనపట్ల కనీసం గౌరవం కూడా లేనివారిని ఇంకెంత కాలం మోస్తారు? పార్టీకి ఇప్పుడు కొత్త రక్తం అవసరం…''

హమ్మయ్య ఇప్పటికి కుండ బద్దలు కొట్టేసారు. ఎన్టీఆర్ వేసిన పునాది పుణ్యం తప్ప మరేం లేదని క్లారిటీ ఇచ్చేసారు. పార్టీ గురించి ఆలోచించని వారిని, తన పట్ల గౌరవం లేని నాయకులను వదిలేయమని సలహా ఇచ్చేసారు. కానీ వారి అండతోనే కదా బాబుగారు పార్టీని లాక్కున్నది. ఇప్పుడు వారిని ఎలా పొమ్మనగలరు?  బయటకు వెళ్లి వారు ఊరుకుంటారా? గొంతు విప్పితే బాబుగారు తట్టుకోగలరా? కొత్త నెత్తురు కేవలం నాయకుల విషయంలోనేనా?  పార్టీ అధినేత విషయంలో అక్కరలేదా?  అది కూడా అవసరం అనిపించి వుండొచ్చు. అందుకే ఈ లైను కూడా యాడ్ చేసారు.

''…వాడుకుని వదిలేస్తారు అన్న అపవాదు మోసుకుంటూ గడిపే నాయకులకు ఒడిదుడుకులు తప్పవు…''

ఇలా వాడుకుని వదిలేసి ఎవరు? ఉపేంద్ర, జయప్రద, రేణుక చౌదరి, దగ్గుబాటి, హరికృష్ణ, ఇలా చాలా మంది ఉదంతాలు దీనికి సమాధానం చెబుతాయి. మొత్తం మీద ఇన్నాళ్లకు తెలుగుదేశం పార్టీ నేత పరువు తీసి బజార్ని పెట్టినట్లా? లేక నిజంగా హితవు కోరినట్లా? ఈ వ 'పలుకు' పరమార్థం.?

ఆర్వీ