టీపీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టకా.. ఉత్సాహవంతంగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి తన మంత్రాంగానికి ఉన్న సత్తా ఏమిటో చూపించే అవకాశం వచ్చింది. రేపోమాపో అన్నట్టుగా ఉన్న హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ సత్తా ఏమిటో రేవంత్ చూపించాల్సి ఉంది. రేవంత్ మాటలు జోరుగా ఉన్న నేపథ్యంలో చేతలేమిటో హుజురాబాద్ ఉప ఎన్నిక చూపనుంది. అయితే ఇంతలోనే ఝలక్ లు తప్పడం లేదు. అలాంటిదే కౌశిక్ రెడ్డి రాజీనామా అంశం.
కాంగ్రెస్ లో ఉండగానే టీఆర్ఎస్ టికెట్ తనకే అంటూ పార్టీ నేతలతో మాట్లాడి కౌశిక్ రెడ్డి దొరికినట్టున్నారు. ఈ అంశంపై టీపీసీసీ వివరణ అడిగే సరికే ఆయన టీఆర్ఎస్ లోకి చేరడానికి రాజీనామా పత్రాన్ని గాంధీ భవన్ కు పంపించినట్టుగా ఉన్నారు. పనిలో పనిగా రేవంత్ పై కూడా కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు. 50 కోట్ల రూపాయల డబ్బులిచ్చి రేవంత్ రెడ్డి టీపీసీసీ పదవిని పొందారంటూ ఆరోపించారు. ఇప్పటికే రేవంత్ పై ఈ ఆరోపణలున్నాయి. కౌశిక్ రెడ్డి కూడా వాటినే రిపీట్ చేశాడు.
మరి తన అధ్యక్షతన కాంగ్రెస్ ఎదుర్కొనబోయే తొలి ఉప ఎన్నిక విషయంలోనే రేవంత్ కు ఇప్పుడు గట్టి పరీక్ష ఎదురవుతోంది. కౌశిక్ రెడ్డి అభ్యర్థిగా ఉండి ఉంటే.. మంచోడో చెడ్డడో.. గత అభ్యర్థితోనే కాంగ్రెస్ రంగంలోకి దిగుతున్నట్టయేది. బీజేపీ తరఫున బరిలోకి దిగే ఈటెలకు పోటీ ఇవ్వగల అభ్యర్థే కౌశిక్ రెడ్డి. అయితే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ చేజారినట్టే! ఇప్పుడు మరో అభ్యర్థిని చూసుకోవాల్సి ఉంది కాంగ్రెస్ పార్టీ.
సహజంగానే ఇది ఇప్పుడు రేవంత్ కు ప్రతిష్టాత్మకంగా మారుతుంది. ఒకవేళ కౌశిక్ రెడ్డికి చక్రమడ్డేసి రేవంత్ రెడ్డి ఆపి ఉంటే అది అసలు చాణక్యం అయ్యేది. అంత దృశ్యం ఇక లేనట్టే. ఇప్పుడు కౌశిక్ స్థానంలో మరో అభ్యర్థిని కాంగ్రెస్ బరిలోకి దించాలి. ఈ మధ్యనే రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోని ప్రతి కార్యకర్తా ఒక ప్రశాంత్ కిషోర్ అవుతాడన్నారు.
అదేమో కానీ.. ఇప్పుడు చెప్పుకోదగిన అభ్యర్థిని హుజురాబాద్ లో నిలబెట్టాల్సి ఉంది. ముక్కోణపు పోరులో విజయం మాట అటుంచి.. మెరుగైన స్థానంలో అయితే నిలవాలి. లేకపోతే.. రేవంత్ పై విరుచుకుపడటానికి సొంత పార్టీలోనే చాలా మంది రెడీగా ఉంటారు!