రాజకీయాల్లో సన్ స్ట్రోక్ గురించి ఎక్కువగా విన్నాం. కానీ డాటర్ స్ట్రోక్ గురించి వినడం తక్కువే. మరీ ముఖ్యంగా తెలుగు రాజకీయాల్లో కొడుకుల వల్ల ఇబ్బంది పడ్డ నాయకులున్నారే తప్ప, కూతుళ్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్లు ఎవరూ లేరని చెప్పొచ్చు. ఇంకా అల్లుడి వల్ల సీఎం సీటును కూడా పోగొట్టుకున్న చరిత్ర తెలుగు రాజకీయాల్లో ఉంది. తాజాగా డాటర్ స్ట్రోక్ చరిత్ర లేని లోటును కేసీఆర్ కూతురు కవిత తీరుస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉన్నట్టు బీజేపీ గట్టిగా చెబుతోంది. అయితే తాను తెలంగాణ సీఎం కేసీఆర్ కూతుర్ని కావడం వల్లే బీజేపీ టార్గెట్ చేస్తోందని కవిత తిప్పికొడుతోంది. కానీ బీజేపీ మాత్రం మరోసారి కవిత పాత్రపై సీబీఐ విచారణ జరుపుతోందని తేల్చి చెప్పడం సర్వత్రా చర్చకు దారి తీసింది.
తనపై తీవ్ర విమర్శల నేపథ్యంలో కల్వకుంట్ల కవిత ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేశారు. తెలంగాణలోని 33 జిల్లాల కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదిలా వుండగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మరోసారి కవితపై ఆరోణలను తీవ్రతరం చేయడం గమనార్హం. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేకుంటే తమ పార్టీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.
ఈ కేసులో దర్యాప్తు సంస్థలు పూర్తిగా శోధించి నిజానిజాలను బయటకి తీస్తాయని చెప్పుకొచ్చారు. తాము ఆరోపణలు చేస్తే కవిత ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. మీడియా సమావేశంలో మరో ఎంపీ పర్వేష్‌వర్మ పాల్గొన్నారు. కూతురిపై లిక్కర్ స్కాం ఆరోపణలు రావడం కేసీఆర్‌కు చికాకు తెప్పిస్తున్నాయి. ఒకవైపు జాతీయ స్థాయిలో బీజేపీతో ఢీకొడుతున్న తరుణంలో కవితపై లిక్కర్ ఆరోపణలు రావడాన్ని టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది.